ద్వితీయోపదేశకాండము 7:1-10

ద్వితీయోపదేశకాండము 7:1-10 TELUBSI

నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను ఏడు జనములను నీ యెదుటనుండి వెళ్లగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవావారిని నీకప్పగించునప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసికొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండ ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు, అందునుబట్టి యెహోవా కోపాగ్ని నీమీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. కావున మీరు వారికి చేయవలసినదేమనగా, వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను తనకు స్వకీయజనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటె విస్తారజనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనములకంటె మీరు లెక్కకు తక్కువేగదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలముచేత మిమ్మును రప్పించి దాసుల గృహములోనుండియు ఐగుప్తురాజైన ఫరో చేతిలోనుండియు మిమ్మును విడిపించెను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞల ననుసరించి నడుచుకొనువారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయితరములవరకు కృపచూపువాడును నమ్మతగిన దేవుడుననియు, తన్ను ద్వేషించువారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలిసికొనవలెను. ఆయన తన్ను ద్వేషించువాని విషయము ఆలస్యముచేయక బహిరంగముగా వానికి దండన విధించును