ద్వితీయోపదేశకాండము 14:22-29

ద్వితీయోపదేశకాండము 14:22-29 TELUBSI

ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనునట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలోగాని నీ ద్రాక్షారసములోగాని నీ నూనెలోగాని పదియవ పంతును, నీ పశువులలోగాని గొఱ్ఱె మేకలలోగాని తొలిచూలు వాటిని తినవలెను. మార్గము దీర్ఘముగానున్నందున, అనగా యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలము మిక్కిలి దూరముగా నున్నందున, నీవు వాటిని మోయ లేనియెడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించునప్పుడు, వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేతపట్టుకొని, నీ దేవుడైన యెహోవా యేర్పరచుకొను స్థలమునకు వెళ్లి నీవు కోరు దేనికైనను ఎద్దులకేమి గొఱ్ఱెలకేమి ద్రాక్షారసమునకేమి మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండి నిచ్చి, అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనముచేసి, నీవును నీ యింటివారును నీ యింటనుండు లేవీయులును సంతోషింపవలెను. లేవీ యులను విడువకూడదు; నీమధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైననులేదు. నీ దేవుడైన యెహోవా నీవుచేయు నీ చేతి పని అంతటిలోను నిన్ను ఆశీర్వదించునట్లు మూడేసి సంవత్సరముల కొకసారి, ఆయేట నీకు కలిగిన పంటలో పదియవ వంతంతయు బయటికి తెచ్చి నీ యింట ఉంచవలెను. అప్పుడు నీమధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులును, నీ యింటనున్న పరదేశులును, తండ్రిలేనివారును, విధవరాండ్రును వచ్చి భోజనముచేసి తృప్తిపొందుదురు.