ద్వితీయోపదేశకాండము 10:12-22

ద్వితీయోపదేశకాండము 10:12-22 TELUBSI

కాబట్టి ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, ఆయనను ప్రేమించి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణాత్మతోను సేవించి, నీ మేలుకొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? చూడుము; ఆకాశము, మహాకాశము, భూమియు, అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారియందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. కాబట్టి మీరు సున్నతిలేని మీ హృదయమునకు సున్నతి చేసికొని యికమీదట ముష్క రులుకాకుండుడి ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరులముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. ఆయన తలిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చి, పరదేశియందు దయయుంచి అన్నవస్త్రముల ననుగ్రహించువాడు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై యుంటిరి గనుక పరదేశిని జాలి తలచుడి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులార చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. నీ పితరులు డెబ్బదిమందియై ఐగుప్తునకు వెళ్లిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశనక్షత్రములవలె నిన్ను విస్తరింపజేసి యున్నాడు.