దానియేలు 9:1-10

దానియేలు 9:1-10 TELUBSI

మాదీయుడగు అహష్వేరోషుయొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయెను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు, యెరూషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తియౌచున్నవని గ్రంథములవలన గ్రహించితిని. అంతట నేను గోనెపట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసికొని ఉపవాసముండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని యెదుట నా మనస్సును నిబ్బరము చేసి కొంటిని. నేను నా దేవుడైన యెహోవా యెదుట ప్రార్థనచేసి యొప్పుకొన్నదేమనగా–ప్రభువా, మాహాత్మ్యము గలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారియెడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకముచేయువాడా, మేమైతే నీ దాసులగు ప్రవక్తలు నీ నామమునుబట్టి మా రాజులకును మా యధిపతులకును మా పితరులకును యూదయదేశ జనులకందరికిని చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని, పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసినవారము. ప్రభువా, నీవే నీతిమంతుడవు; మేమైతే సిగ్గుచేత ముఖవికారమొందినవారము; మేము నీమీద తిరుగుబాటు చేసితిమి; దానినిబట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి, యెరూషలేములోను యూదయదేశములోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టియు, పర దేశవాసులుగా ఉన్నట్టియు ఇశ్రాయేలీయులందరికిని మాకును ఈ దినమున సిగ్గే తగియున్నది. ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా యధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగియున్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి; అయితే ఆయన కృపాక్షమాపణలుగల దేవుడైయున్నాడు. ఆయన తన దాసులగు ప్రవక్తలద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి, వాటిని అనుసరించి నడుచుకొనవలెనని సెలవిచ్చెను గాని, మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి.