దానియేలు 2:24-49

దానియేలు 2:24-49 TELUBSI

ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింప జేయుటకు రాజు నియమించిన అర్యోకునొద్దకు వెళ్లి–బబులోనులోని జ్ఞానులను నశింపజేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కల భావమును రాజునకు తెలియజేసెదననెను. కావున అర్యోకు–రాజునకు భావము తెలియజెప్పగల యొక మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను కను గొంటినని రాజుసముఖమున మనవిచేసి, దానియేలును త్వరగా రాజుసన్నిధికి తోడుకొనిపోయెను. రాజు–నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా? అని బెల్తెషాజరు అను దానియేలును అడుగగా దానియేలు రాజుసముఖములో ఈలాగు ప్రత్యుత్తర మిచ్చెను–రాజడిగిన యీ మర్మము జ్ఞానులైనను గారడీవిద్య గలవారైనను శకునగాండ్రయినను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచ గల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్యదినములయందు కలుగబోవుదానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడకమీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్నదర్శనములు ఏవనగా రాజా, ప్రస్తుతకాలము గడచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడకమీద పరుండి మనోచింతగలవారై యుండగా మర్మములను బయలు పరచువాడు కలుగబోవుదానిని తమరికి తెలియజేసెను. ఇతర మనుష్యులకందరికంటె నాకు విశేష జ్ఞానముండుటవలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును, తమరి మనస్సుయొక్క ఆలోచనలు తాము తెలిసికొను నిమిత్తమును అది బయలుపరచబడెను. రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమకనబడెను గదా. ఈ గొప్ప ప్రతిమ మహా ప్రకాశమును, భయంకరమునైన రూపమును గలదై తమరియెదుట నిలిచెను. ఆ ప్రతిమయొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు, దాని రొమ్మును భుజములును వెండివియు, దాని ఉదరమును తొడలును ఇత్తడివియు, దాని మోకాళ్లు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునైయుండెను. మరియు చేతిసహాయము లేక తీయబడిన ఒక రాయి, యినుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమయొక్క పాదములమీదపడి దాని పాదములను తుత్తునియలుగా విరుగగొట్టినట్టు తమకు కనబడెను. అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండ గాలి వాటిని కొట్టుకొనిపోయెను; ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహా పర్వతమాయెను. తాము కనిన కల యిదే, దాని భావము రాజుసముఖమున మేము తెలియ జెప్పెదము. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్ర హించియున్నాడు; తమరు రాజులకు రాజైయున్నారు. ఆయన మనుష్యులు నివసించు ప్రతిస్థలమందును, మనుష్యులనేమి భూజంతువులనేమి ఆకాశపక్షులనేమి అన్నిటిని ఆయన తమరి చేతి కప్పగించియున్నాడు, వారందరి మీద తమరికి ప్రభుత్వము ననుగ్రహించియున్నాడు; తామే ఆ బంగారపు శిరస్సు తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యముకంటె తక్కువైన రాజ్యమొకటి లేచును. అటుతరువాత లోకమంత యేలునట్టి మూడవ రాజ్యమొకటి లేచును. అది యిత్తడి వంటిదగును. పిమ్మట నాలుగవ రాజ్యమొకటి లేచును. అది ఇనుమువలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైనవాటిని దంచి విరుగగొట్టునది గదా; ఇనుము పగులగొట్టునట్లు అది రాజ్యములన్నిటిని పగులగొట్టి పొడిచేయును. పాదములును వ్రేళ్లును కొంతమట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంతమట్టునకు ఇనుపదిగానున్నట్టు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసియున్నట్టు కనబడెను గనుక ఆ రాజ్యములో ఆలాగుననుండును, ఆ రాజ్యము ఇనుమువంటి బలముగలదై యుండును. పాదముల వ్రేళ్లు కొంతమట్టునకు ఇనుపవిగాను కొంతమట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమై యుండుట తమరికి కనబడెను; అటువలె మనుష్య జాతులు మిళితములై యినుము మట్టితో అతకనట్లువారు ఒకరితో ఒకరు పొసగకయుందురు. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపిం చును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతమునుండి తియ్యబడిన ఆ రాయి యినుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే; యిందువలన మహా దేవుడు ముందు జరుగబోవు సంగతి రాజునకు తెలియజేసియున్నాడు; కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను. అంతట రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగనమస్కారము చేసి అతని పూజించి, నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. మరియు రాజు–ఈ మర్మమును బయలు పరచుటకు నీవు సమర్థుడవైతివే; నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచు వాడునై యున్నాడని దానియేలునకు ప్రత్యుత్తర మిచ్చెను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి, అనేక గొప్ప దానములిచ్చి, అతనిని బబులోను సంస్థానమంతటిమీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. అంతట దానియేలు రాజునొద్ద మనవి చేసికొనగా రాజు షద్రకు మేషాకు అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలనుగా నియమించెను; అయితే దానియేలు రాజుసన్నిధిని ఉండెను.