మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతనియొద్ద నిలువబడితిని. ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను; ఏమనగా ఇంక ముగ్గురు రాజులు పారసీకముమీద రాజ్యము చేసినపిమ్మట అందరికంటె అధికైశ్వర్యము కలిగిన నాలుగవ రాజొకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తుచేత బలవంతుడై అందరిని గ్రేకేయుల రాజ్యమునకు విరోధముగా రేపును. అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యము నేలి యిష్టానుసారముగా జరిగించును. అతడు రాజైనతరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కుల విభాగింపబడును. అది అతని వంశపువారికి గాని అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయువారికి గాని విభాగింప బడదు, అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడును, అతని వంశపువారు దానిని పొందరు గాని అన్యులు పొందుదురు. అయితే దక్షిణదేశపు రాజును, అతని అధిపతులలో ఒకడును బలముపొందెదరు; అతడు ఇతనికంటె గొప్పవాడై యేలును; అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వమగును. కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనెదరు. మరియు వారు ఉభయులు సమాధానపడవలెనని కోరగా దక్షిణదేశపు రాజకుమార్తె ఉత్తరదేశపు రాజునొద్దకు వచ్చును. అయినను ఆమె భుజబలము నిలుపుకొననేరదు; అతడైనను అతని భుజబలమైనను నిలువదు; వారు ఆమెను, ఆమెను తీసికొని వచ్చిన వారిని, ఆమెను కనినవారిని, ఈ కాలమందు ఆమెను బలపరచిన వారిని అప్పగించెదరు. అతనికి బదులుగా ఆమె వంశములో ఒకడు సేనకు అధిపతియై ఉత్తరదేశపురాజు కోటలో జొరబడి యిష్టానుసారముగా జరిగించుచు వారిని గెలుచును మరియు అతడు వారి దేవతలను సొమ్ములను విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపెట్టి ఐగుప్తునకు తీసికొనిపోవును. అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపురాజు ప్రభుత్వము కంటె ఎక్కువ ప్రభుత్వము చేయును. అతడు దక్షిణ దేశపురాజు దేశములో జొరబడి మరలి తన రాజ్యమునకు వచ్చును. అతని కుమారులు యుద్ధము చేయబూని మహా సైన్యముల సమూహమును సమకూర్చుకొందురు. అతడు వచ్చి యేరువలె ప్రవహించి ఉప్పొంగును; యుద్ధము చేయబూని కోటదనుక వచ్చును. అంతలో దక్షిణదేశపు రాజు అత్యుగ్రుడై బయలుదేరి ఉత్తరదేశపురాజుతో యుద్ధము జరిగించును; ఉత్తరదేశపురాజు గొప్పసైన్యమును సమకూర్చుకొనినను అది ఓడిపోవును. ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణదేశపు రాజు మనస్సున అతిశయ పడును; వేలకొలది సైనికులను హతము చేసినను అతనికి జయము కానేరదు. ఏలయనగా ఉత్తర దేశపురాజు మొదటి సైన్యముకంటె ఇంక గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరల వచ్చును. ఆ కాలాంతమున, అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును. ఆ కాలములయందు అనేకులు దక్షిణదేశపు రాజుతో యుద్ధము చేయుటకు కూడివచ్చెదరు. నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరచునట్లు కూడుదురు గాని నిలువలేక కూలుదురు. అంతలో ఉత్తరదేశపురాజు వచ్చి ముట్టడి దిబ్బ వేయును. దక్షిణ దేశపు రాజుయొక్క బలము నిలువలేకపోయినందునను, అతడు ఏర్పరచుకొనిన జనము దృఢశౌర్యము పొందక పోయినందునను ఉత్తరదేశపు రాజు ప్రాకారములుగల పట్టణమును పట్టుకొనును. వచ్చినవాని కెదురుగా ఎవరును నిలువలేక పోయినందున తనకిష్టమువచ్చినట్టు అతడు జరిగించును గనుక ఆనందముగల ఆ దేశములో అతడుండగా అది అతని బలమువలన పాడైపోవును. అతడు తన రాజ్యముయొక్క సమస్త బలమును కూర్చుకొని రావలెనని ఉద్దేశింపగా అతనితో సంధిచేయబడును; ఏమనగా నశింపజేయవచ్చునని యొక కుమార్తెను అతని కిచ్చెదరు, అయితే ఆమె సమ్మతింపక అతని కలిసికొనదు. అతడు ద్వీపముల జనములతట్టు తన మనస్సును త్రిప్పుకొని యనేకులను పట్టుకొనును. అయితే అతనివలన కలిగిన యవమానమును ఒక యధికారి నివారణ చేయును. మరియు ఆయన యవమానము అతనిమీదికి మరల వచ్చునట్లు చేయును, అది అతనికి రాక తప్పదు. అప్పుడతడు తన ముఖమును తన దేశములోని కోటలతట్టు త్రిప్పు కొనును గాని ఆటంకపడి కూలి అగుపడకపోవును. అతనికి మారుగా మరియొకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్నుపుచ్చుకొను వానిని లేపును; కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును గాని యీ నాశనము ఆగ్రహమువలననైనను యుద్ధమువలననైనను కలుగదు.
చదువండి దానియేలు 11
వినండి దానియేలు 11
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: దానియేలు 11:1-20
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు