అపొస్తలుల కార్యములు 15:1-21
అపొస్తలుల కార్యములు 15:1-21 TELUBSI
కొందరు యూదయనుండి వచ్చి–మీరు మోషే . నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు, ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపొస్తలులయొద్దకును పెద్దలయొద్దకును వెళ్లవలెనని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘమువలన సాగనంపబడి, ఫేనీకే సమరయ దేశములద్వారా వెళ్లుచు, అన్యజనులు దేవునివైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికిని మహా సంతోషము కలుగజేసిరి. వారు యెరూషలేమునకు రాగా, సంఘపువారును అపొస్తలులును పెద్దలును వారిని చేర్చుకొనిరి; దేవుడు తమకు తోడై యుండి చేసినవన్నియు వారు వివరించిరి. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరులేచి, అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు, మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరి. అప్పుడు అపొస్తలులును పెద్దలును ఈ సంగతినిగూర్చి ఆలోచించుటకు కూడివచ్చిరి. బహు తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను– సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడేర్పరచుకొనెనని మీకు తెలియును. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి, వారినిగూర్చి సాక్ష్య మిచ్చెను. వారి హృదయములను విశ్వాసమువలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడమీద పెట్టి మీ రెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా? అలాగే వారును రక్షణ పొందుదురు అనెను. అంతట ఆ సమూహమంతయు ఊరకుండి, బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచకక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను–సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్యజనులలోనుండి దేవుడు తన నామముకొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించెనో సుమెయోను వివరించియున్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడియున్నవి; ఎట్లనగా– ఆ తరువాత నేను తిరిగి వచ్చెదను; మనుష్యులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులును ప్రభువు ను వెదకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను దాని పాడైనవాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెద నని అనాదికాలమునుండి ఈ సంగతులను తెలియ పరచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడియున్నది. కాబట్టి అన్యజనులలోనుండి దేవునివైపు తిరుగుచున్నవారిని మనము కష్టపట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము. ఏలయనగా, సమాజమందిరములలో ప్రతి విశ్రాంతిదినమున మోషే లేఖనములు చదువుటవలనమునుపటి తరములనుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను.

