2 రాజులు 4:1-7

2 రాజులు 4:1-7 TELUBSI

అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య–నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను; అతడు యెహోవాయందు భక్తిగలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది; ఇప్పుడు అప్పులవాడు నా యిద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొనిపోవుటకు వచ్చియున్నాడని ఎలీషాకు మొఱ్ఱపెట్టగా ఎలీషా–నా వలన నీకేమి కావలెను? నీ యింటిలో ఏమి యున్నదో అది నాకు తెలియ జెప్పుమనెను. అందుకామె–నీ దాసురాలనైన నా యింటిలో నూనెకుండ యొకటి యున్నది; అది తప్ప మరేమియు లేదనెను. అతడు–నీవు బయటికి పోయి, నీ యిరుగు పొరుగు వారందరియొద్ద దొరుకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరవు పుచ్చుకొనుము; అప్పుడు నీవు నీ యింటిలోకి వచ్చి నీవును నీ కుమారులును లోపలనుండి తలుపుమూసి, ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి, నిండినవి యొకతట్టున ఉంచుమని ఆమెతో సెలవియ్యగా ఆమె అతని యొద్దనుండి పోయి, తానును కుమారులును లోపలనుండి తలుపుమూసి, కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నియు నిండిన తరువాత ఇంక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు–మరేమియు లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచి పోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు–నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలినదానితో నీవును నీ పిల్లలును బ్రదుకుడని ఆమెతో చెప్పెను.