అతని యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు పదియవ మాసము పదియవ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమంతయును యెరూషలేము మీదికి వచ్చి దానికెదురుగా దిగి దాని చుట్టును ముట్టడి దిబ్బలు కట్టిరి. ఈ ప్రకారము రాజైన సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవత్సరమువరకు పట్టణము ముట్టడివేయబడియుండగా నాల్గవ నెల తొమ్మిదవ దినమందు పట్టణములో క్షామము అఘోరమాయెను, దేశపు జనులకు ఆహారము లేకపోయెను. కల్దీయులు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రియందు రాజు తోటదగ్గర రెండు గోడలమధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయిరి. అయితే కల్దీయులు పట్టణముచుట్టు ఉండగా రాజు మైదానమునకు పోవుమార్గమున వెళ్లి పోయెను; కల్దీయుల సైన్యము రాజును తరిమి, అతని సైన్యము అతనికి దూరముగా చెదరిపోయినందున యెరికో మైదానమందు అతని పట్టుకొనిరి. వారు రాజును పట్టుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునొద్దకు తీసికొనిపోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను. సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి యిత్తడి సంకెళ్లతో అతని బంధించి బబులోను పట్టణమునకు తీసికొనిపోయిరి. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో పందొమ్మిదవ సంవత్సరమందు అయిదవ నెలయేడవదినమున రాజదేహసంరక్షకులకు అధిపతియు బబులోనురాజు సేవకుడునగు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేమునందున్న యిండ్లన్నిటిని గొప్పవారి యిండ్లన్నిటిని అగ్నిచేత కాల్పించెను. మరియు రాజదేహసంరక్షకుల అధిపతియొద్దనున్న కల్దీయుల సైనికులందరును యెరూషలేము చుట్టునున్న ప్రాకారములను పడగొట్టిరి. పట్టణమందు మిగిలియుండిన వారిని, బబులోనురాజు పక్షము చేరిన వారిని, సామాన్యజనులలో శేషించినవారిని రాజదేహసంరక్షకుల అధిపతియైన నెబూజరదాను చెరగొని పోయెనుగాని వ్యవసాయదారులును ద్రాక్షతోట వారును ఉండవలెనని దేశపు బీదజనములో కొందరిని ఉండనిచ్చెను. మరియు యెహోవామందిరమందున్న యిత్తడి స్తంభములను మట్లను యెహోవామందిరమందున్న యిత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి, ఆ యిత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తికొనిపోయిరి. సేవకొరకై యుంచబడిన పాత్రలను చేటలను ముండ్లను ధూపార్తులను ఇత్తడి ఉపకరణములన్నిటిని వారు తీసికొనిపోయిరి. అగ్నిపాత్రలు గిన్నెలు మొదలైన వెండి వస్తువులను బంగారు వస్తువులను రాజదేహసంరక్షకుల అధిపతి తీసికొనిపోయెను. మరియు అతడు యెహోవా మందిరమునకు సొలొమోను చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లను తీసికొనిపోయెను. ఈ యిత్తడి వస్తువులయెత్తు లెక్కకు మించియుండెను. ఒక్కొక స్తంభపు నిడివి పదునెనిమిది మూరలు. దాని పైపీట యిత్తడిది, పైపీట నిడివి మూడు మూరలు. మరియు ఆ పైపీటచుట్టు ఉన్న అల్లికలును దానిమ్మపండ్లును ఇత్తడివి; రెండవ స్తంభమును వీటివలె అల్లికపని కలిగియుండెను. రాజదేహసంరక్షకుల అధిపతి ప్రధానయాజకుడైన శెరాయాను రెండవ యాజకుడైన జెఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టుకొనెను. మరియు ఆయుధస్థులమీద నియమింపబడియున్న అధిపతిని, పట్టణములోనుండి తీసికొని, రాజుసముఖమును కనిపెట్టుకొని యుండువారిలో పట్టణమందు దొరకిన అయిదుగురిని, దేశపుజనులను సంఖ్య చేయువారి అధిపతియొక్క లేఖికుని, సామాన్యజనులలో పట్టణమందు దొరకిన అరువదిమందిని పట్టుకొనెను. రాజదేహసంరక్షకుల అధిపతియగు నెబూజరదాను వీరిని తీసికొని రిబ్లా పట్టణమందున్న బబులోనురాజునొద్దకు రాగా బబులోనురాజు హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు వారిని చంపించెను. ఈ రీతిగా యూదావారు తమ దేశములోనుండి ఎత్తికొని పోబడిరి.
చదువండి 2 రాజులు 25
వినండి 2 రాజులు 25
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 2 రాజులు 25:1-21
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు