2 కొరింథీయులకు 4:8-18

2 కొరింథీయులకు 4:8-18 TELUBSI

ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములోనున్నను కేవలము ఉపాయము లేనివారము కాము; తరుమబడు చున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము. యేసుయొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసుయొక్క మర ణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించుకొని పోవుచున్నాము. ఏలయనగా, యేసుయొక్క జీవము కూడ మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు, సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. కృప యెక్కువమంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున, సమస్తమైనవి మీకొరకై యున్నవి. కాగా –విశ్వసించితిని గనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతోకూడిన ఆత్మగలవారమై, ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడ లేపి, మీతోకూడ తన యెదుట నిలువ బెట్టునని యెరిగి, మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము. కావున మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంత కంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ జేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు.