షేబదేశపు రాణి సొలొమోనునుగూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నలచేత సొలొమోనును శోధింపవలెనని కోరి, మిక్కిలి గొప్ప పరివారమును వెంట బెట్టుకొని, గంధవర్గములను విస్తారము బంగారమును రత్నములను ఒంటెలమీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోనునొద్దకు వచ్చి తన మనస్సు లోని విషయములన్నిటిని గురించి అతనితో మాటలాడెను. సొలొమోను ఆమె ప్రశ్నలన్నియు ఆమెకు విడదీసి చెప్పెను; సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట యేదియు లేకపోయెను. షేబదేశపు రాణి సొలొమోనునకు కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును, అతని బల్లమీది భోజనపదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని యుపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను, అతనికి గిన్నెల నందించువారిని వారి వస్త్రములను, యెహోవామందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచినప్పుడు, ఆమె విస్మయ మొంది రాజుతో ఇట్లనెను –నీ కార్యములనుగూర్చియు జ్ఞానమునుగూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజవర్తమానమే గాని, నేను వచ్చి దాని కన్నులార చూచువరకు వారి మాటలను నమ్మకయుంటిని. నీ యధిక జ్ఞానమునుగూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. నిన్నుగూర్చి నేను వినినదానికంటె నీ కీర్తి యెంతో హెచ్చుగానున్నది. నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడును నీ సముఖమున నిలిచి నీ జ్ఞానసంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనముమీద ఆసీనుడవై యుండునట్లు నీయందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఇశ్రాయేలీయులను నిత్యము స్థిరపరచవలెనన్న దయాలోచన నీ దేవునికి కలిగియున్నందున నీతిన్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారిమీద రాజుగా నియమించెను అని చెప్పెను. ఆమె రాజునకు రెండువందల నలుబది మణుగుల బంగారమును విస్తారమైన గంధవర్గములను రత్నములను ఇచ్చెను; షేబదేశపు రాణి రాజైన సొలొమోనున కిచ్చిన గంధవర్గములతో సాటియైన దేదియులేదు. ఇదియుగాక ఓఫీరునుండి బంగారము తెచ్చిన హీరాము పనివారును సొలొమోను పనివారును చందనపు మ్రానులను ప్రశస్తమైన రత్నములను కూడ కొనివచ్చిరి. ఆ చందనపు మ్రానులచేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును సోపానములను, గాయకులకు తంబురలను సితారాలను చేయించెను, అటువంటి పని అంతకుముందు యూదాదేశమందు ఎవ్వరును చూచియుండలేదు. షేబ దేశపు రాణి రాజునకు తీసికొనివచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానములుగాక ఆమె మక్కువపడి అడిగినదంతయు రాజైన సొలొమోను ఆమె కిచ్చెను; తరువాత ఆమె తన సేవకులను వెంట బెట్టుకొని మరలి తన దేశమునకు వెళ్లిపోయెను.
చదువండి 2 దినవృత్తాంతములు 9
వినండి 2 దినవృత్తాంతములు 9
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 2 దినవృత్తాంతములు 9:1-12
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు