2 దినవృత్తాంతములు 20:21-26

2 దినవృత్తాంతములు 20:21-26 TELUBSI

మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడచుచు–యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారిమీదికి వచ్చిన అమ్మోనీయులమీదను మోయాబీయులమీదను శేయీరు మన్యవాసులమీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీయులును మోయాబీయులును శేయీరు మన్యనివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలెనని పొంచియుండి వారిమీద పడిరి; వారు శేయీరు కాపురస్థులను కడముట్టించిన తరువాత తమలో ఒకరి నొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. యూదావారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యముతట్టు చూడగా వారు శవములై నేలపడియుండిరి, ఒకడును తప్పించుకొనలేదు. యెహోషాపాతును అతని జనులును వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవములయొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను; వారు తమకిష్టమైనంతమట్టుకు తీసికొని తాము కొనిపోగలిగినంతకంటె ఎక్కువగా ఒలుచుకొనిరి; కొల్లసొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు మూడుదినములు పట్టెను. నాల్గవదినమునవారు బెరాకా లోయలో కూడిరి; అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటివరకును ఆ చోటికి బెరాకా లోయ యని పేరు.