1 తిమోతికి 6:1-10

1 తిమోతికి 6:1-10 TELUBSI

దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాసత్వమను కాడిక్రింద ఉన్నవారందరును, తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని యెంచవలెను. విశ్వాసులైన యజమానులుగల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక, తమ సేవాఫలము పొందువారు విశ్వాసులును ప్రియులునై యున్నారని మరి యెక్కువగా వారికి సేవచేయవలెను; ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క హిత వాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీక రింపక, భిన్నమైన బోధనుపదేశించినయెడల వాడేమియు ఎరుగక తర్కములనుగూర్చియు వాగ్వాదములనుగూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటిమూలముగా అసూయ కలహము దూషణలు దురను మానములును, చెడిపోయిన మనస్సుకలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థవివాదములును కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది. మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము. కాగా అన్నవస్త్రములుగలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.