1 థెస్సలొనీకయులకు 2:13-20

1 థెస్సలొనీకయులకు 2:13-20 TELUBSI

ఆ హేతువుచేతను, మీరు దేవునిగూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్య మని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదులవలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంతదేశస్థులవలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడు సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి, అన్యజనులు రక్షణపొందుటకై వారితో మేము మాటలాడకుండ మమ్మును ఆటంకపరచుచు, దేవునికి ఇష్టులు కానివారును మనుష్యులకందరికి విరోధులునై యున్నారు; దేవుని ఉగ్రత తుదముట్ట వారిమీదికి వచ్చెను. సహోదరులారా, మేము శరీరమునుబట్టి కొద్దికాలము మిమ్మును ఎడబాసియున్నను, మనస్సునుబట్టి మీదగ్గర ఉండి, మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలెనని మరి యెక్కువగా ప్రయత్నము చేసితిమి. కాబట్టి మేము మీయొద్దకు రావలెనని యుంటిమి; పౌలను నేను పలుమార్లు రావలెనని యుంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరచెను. ఏలయనగా మా నిరీక్షణయైనను ఆనందమైనను అతిశయకిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసుయొక్క రాకడ సమయమున ఆయన యెదుట మీరే గదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనంద మునై యున్నారు.