1 సమూయేలు 28:15-25

1 సమూయేలు 28:15-25 TELUBSI

సమూయేలు–నన్ను పైకిరమ్మని నీ వెందుకు తొందరపెట్టితివని సౌలు నడుగగా సౌలు– నేను బహు శ్రమలోనున్నాను; ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నములద్వారానైనను నా కేమియు సెలవియ్యకయున్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించితిననెను. అందుకు సమూయేలు–యెహోవా నిన్ను ఎడ బాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుటవలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చియున్నట్టు నీ చేతినుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాని నిచ్చియున్నాడు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక, అమాలేకీయుల విషయములో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చక పోయిన దానినిబట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును; యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును; రేపు నీవును నీ కుమారులును నాతోకూడ ఉందురు అని సౌలుతో చెప్పగా సమూయేలు మాటలకు సౌలు బహు భయమొంది వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజన మేమియు చేయక యుండినందున బలహీను డాయెను. అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకువచ్చి, అతడు బహుగా కలవరపడుట చూచి–నా యేలినవాడా, నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణము నా చేతిలో పెట్టుకొని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసితిని. ఇప్పుడు నీ దాసినైన నేను చెప్పు మాటలను ఆలకించుము, నేను నీకు ఇంత ఆహారము వడ్డించుదును, నీవు భోజనముచేసి ప్రయాణమై పోవుటకు బలము తెచ్చుకొనుమని అతనితో చెప్పగా అతడు ఒప్పక భోజనము చేయననెను; అయితే అతని సేవకులు ఆ స్త్రీతో ఏకమై యతని బలవంతముచేయగా అతడు వారు చెప్పిన మాట ఆలకించి నేలనుండి లేచి మంచముమీద కూర్చుండెను. తన యింటిలో క్రొవ్విన పెయ్య ఒకటి యుండగా ఆ స్త్రీ దాని తీసికొని త్వరగా వధించి పిండి తెచ్చి పిసికి పులుసులేని రొట్టెలు కాల్చి తీసికొని వచ్చి సౌలునకును అతని సేవకులకును వడ్డించగా వారు భోజనముచేసి లేచి ఆ రాత్రి వెళ్లిపోయిరి.