1 సమూయేలు 21:10-15

1 సమూయేలు 21:10-15 TELUBSI

అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినము ననే లేచి పారిపోయి గాతురాజైన ఆకీషునొద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు–ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గానప్రతిగానములు చేయుచు– సౌలు వేలకొలది హతముచేసెననియు, దావీదు పదివేలకొలది హతముచేసెననియు పాడిన పాటలు ఇతనిగూర్చినవే గదా అని అతనినిబట్టి రాజుతో మాటలాడగా దావీదు ఈ మాటలు తన మనస్సులోనుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి యెదుట తన చర్య మార్చుకొని వెఱ్ఱివానివలె నటించుచు, ద్వారపు తలుపులమీద గీతలు గీయుచు, ఉమ్మి తన గడ్డముమీదికి కార నిచ్చుచు నుండెను. వారతని పట్టుకొనిపోగా అతడు పిచ్చిచేష్టలు చేయుచు వచ్చెను. కావున ఆకీషురాజు– మీరు చూచితిరికదా? వానికి పిచ్చిపెట్టినది, నాయొద్దకు వీని నెందుకు తీసికొని వచ్చితిరి? పిచ్చిచేష్టలుచేయు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చిచేష్టలు చేయుటకు వీని తీసికొని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రా తగునా? అని తన సేవకులతో అనెను.