ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమ కూర్చి యూదా దేశములోని శోకోలో కూడి ఏఫెస్దమ్మీము దగ్గర శోకోకును అజేకాకునుమధ్యను దిగి యుండగా సౌలును ఇశ్రాయేలీయులును కూడివచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయుల కెదురుగ యుద్ధపంక్తులు తీర్చిరి. ఫిలిష్తీయులు ఆతట్టు పర్వతము మీదను ఇశ్రాయేలీయులు ఈతట్టు పర్వతముమీదను నిలిచియుండగా ఉభయులమధ్యను ఒక లోయయుండెను. గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులోనుండి బయలుదేరు చుండెను. అతడు ఆరుమూళ్లజేనెడు ఎత్తుమనిషి. అతని తలమీద రాగి శిరస్త్రాణముండెను, అతడు యుద్ధకవచము ధరించియుండెను, ఆ కవచము అయిదు వేల తులముల రాగి యెత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజములమధ్యను రాగి బల్లెమొకటి యుండెను. అతని యీటెకఱ్ఱ నేతగాని దోనె అంత పెద్దది; మరియు అతని యీటెకొన ఆరువందల తులముల యినుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను. అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండువారిని పిలిచి–యుద్ధపంక్తులు తీర్చుటకై మీ రెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులుకారా? మీ పక్షముగా ఒకనిని ఏర్ప రచుకొని అతని నాయొద్దకు పంపుడి; అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగినయెడల మేము మీకు దాసుల మగుదుము; నేనతని జయించి చంపినయెడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకని నియమించినయెడలవాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచువచ్చెను. సౌలును ఇశ్రాయేలీయులందరును ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైరి. దావీదు యూదా బేత్లెహేమువాడగు ఎఫ్రాతీయుడైన యెష్షయి అనువాని కుమారుడు. యెష్షయికి ఎనమండు గురు కుమాళ్లుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై యుండెను. అయితే యెష్షయియొక్క ముగ్గురు పెద్దకుమారులు యుద్ధమునకు సౌలువెంటను పోయి యుండిరి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమారుల పేరులు ఏవనగా, జ్యేష్ఠుడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా, దావీదు కనిష్ఠుడు; పెద్దవారైన ముగ్గురు సౌలువెంటను పోయి యుండిరిగాని దావీదు బేత్లెహేములో తన తండ్రి గొఱ్ఱెలను మేపుచు సౌలునొద్దకు తిరిగి పోవుచు వచ్చుచు నుండెను. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలు దేరుచు నలువది దినములు తన్నుతాను అగుపరచుకొనుచు వచ్చెను. యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి–నీ సహోదరులకొరకు వేయించిన యీ గోధుమలలో ఒక తూమెడును ఈ పది రొట్టెలను తీసికొని దండులో నున్న నీ సహోదరులదగ్గరకు త్వరగా పొమ్ము. మరియు ఈ పది జున్నుగడ్డలు తీసికొనిపోయి వారి సహస్రాధిపతి కిమ్ము; నీ సహోదరులు క్షేమముగా నున్నారో లేదో సంగతి తెలిసికొని వారియొద్దనుండి ఆనవాలొకటి తీసికొని రమ్మనిచెప్పి పంపివేసెను. సౌలును వారును ఇశ్రాయేలీయులందరును ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయుచుండగా దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొఱ్ఱెలను అప్పగించి ఆ వస్తువులను తీసికొని యెష్షయి తన కిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను; అయితే అతడు కందకమునకు వచ్చునప్పటికి వారును వీరును పంక్తులుగా తీరి, జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి. సైన్యము సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీయులును ఫిలిష్తీయులును యుద్ధసన్నద్ధులై బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామగ్రిని కనిపెట్టువాని వశము చేసి, పరుగెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశలప్రశ్నలు తన సహోదరుల నడిగెను. అతడు వారితో మాటలాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యములోనుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను. ఇశ్రాయేలీయులందరు ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి వాని యెదుటనుండి పారిపోగా ఇశ్రాయేలీయులలో ఒకడు –వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే; నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరు చున్నాడు, వానిని చంపినవానికి రాజు బహుగ ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లిచేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగాచేయు ననగా దావీదు–జీవముగల దేవుని సైన్యములను తిరస్క రించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలీయులనుండి యీ నింద తొలగించిన వానికి బహుమతి యేమని తనయొద్ద నిలిచినవారి నడుగగా జనులు–వాని చంపినవానికి ఇట్లిట్లు చేయబడునని అతని కుత్తరమిచ్చిరి. అతడు వారితో మాటలాడునది అతని పెద్దన్నయగు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపమువచ్చి అతనితో–నీవిక్కడి కెందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొఱ్ఱె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును; యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితి వనెను. అందుకు దావీదు–నేనేమి చేసితిని? మాట మాత్రము పలికితినని చెప్పి అతనియొద్దనుండి తొలగి, తిరిగి మరియొకని ఆప్రకారమే యడుగగా జనులు వానికి అదేప్రకారము ప్రత్యుత్తరమిచ్చిరి.
చదువండి 1 సమూయేలు 17
వినండి 1 సమూయేలు 17
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 1 సమూయేలు 17:1-30
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు