1 సమూయేలు 15:17-24

1 సమూయేలు 15:17-24 TELUBSI

అందుకు సమూయేలు– నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సువైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులమీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి–నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము, వారు లయమగువరకు వారితో యుద్ధము చేయుమని సెలవియ్యగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడుమీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. అందుకు సౌలు–ఆ మాట అనవద్దు; నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసికొనివచ్చితిని కాని అమాలేకీయులను నిర్మూలము చేసితిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొఱ్ఱెలలోను ఎడ్లలోను ముఖ్యమైనవాటిని తీసికొనివచ్చిరని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు–తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుటవలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పించుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము. తిరుగుబాటు చేయుట సోదెచెప్పుటయను పాపముతో సమానము; మూర్ఖతను అగపరచుట మాయావిగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జింతివి గనుక నీవు రాజుగా ఉండకుండ ఆయన నిన్ను విసర్జించెననగా సౌలు–జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని.