1 పేతురు 2:13-23

1 పేతురు 2:13-23 TELUBSI

మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువునిమిత్తమై లోబడియుండుడి. రాజు అందరికిని అధిపతి యనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతి దండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజువలన పంపబడినవారనియు వారికి లోబడియుండుడి. ఏలయనగా మీరిట్లు యుక్తప్రవర్తన గలవారై, అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులై యుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్యమును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడి యుండుడి. అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. పనివారలారా, మంచివారును సాత్వికులునైనవారికి మాత్రముకాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణభయముతో లోబడియుండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమపొందుచు, దేవునిగూర్చిన మనస్సాక్షికలిగి, దుఃఖము సహించినయెడల అది హితమగును. తప్పిద మునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినయెడల మీకేమి ఘనము? మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును; ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను. ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.