1 రాజులు 9:1-9

1 రాజులు 9:1-9 TELUBSI

సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు, తాను చేయకోరినదంతటిని చేయుటయు ముగించిన తరువాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవమారు యెహోవా సొలొమోనునకు ప్రత్యక్షమై అతనితో ఈలాగు సెలవిచ్చెను–నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని, నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన యీ మందిరమును పరిశుద్ధపరచియున్నాను; నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడు అక్కడ ఉండును. నీ తండ్రియైన దావీదు నడిచినట్లు నీవును యథార్థహృదయుడవై నీతిని బట్టి నడుచుకొని, నేను నీకు సెలవిచ్చిన దంతటిప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించినయెడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయులమీద సింహాసనాసీనుడై యుండక మానడని నీ తండ్రియైన దావీదునకు నేను సెలవిచ్చియున్నట్లు ఇశ్రాయేలీయులమీద నీ సింహాసనమును చిరకాలమువరకు స్థిరపరచుదును. అయితే మీరేగాని మీ కుమారులేగాని యేమాత్రమై నను నన్ను వెంబడించుట మాని, నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక యితరమైన దేవతలను కొలిచి పూజించినయెడల నేను ఇశ్రాయేలీయుల కిచ్చిన యీ దేశములో వారిని ఉండనియ్యక వారిని నిర్మూలము చేసి, నా నామమునకు నేను పరిశుద్ధపరచిన యీ మందిరమును నా సముఖములోనుండి కొట్టివేసెదను; ఇశ్రాయేలీయులు సర్వజనములలో చెదరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. ఈ మందిరమార్గమున వచ్చువారందరును దానిచూచి, ఆశ్చర్యపడి ఇసీ, యని–యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఈలాగున ఎందుకు చేసెనని యడుగగా జనులిట్లందురు–ఐగుప్తు దేశములోనుండి తమపితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి యితర దేవతలను ఆధారము చేసికొని కొలిచి పూజించుచు వచ్చిరి గనుక యెహోవా ఈ కీడంతయు వారిమీదికి రప్పించియున్నాడు.