1 యోహాను 2:1-28

1 యోహాను 2:1-28 TELUBSI

నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవ డైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనినయెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసి కొందుము. ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యములేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను; ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచు కొన బద్ధుడైయున్నాడు. మనమాయనయందున్నామని దీనివలన తెలిసికొనుచున్నాము. ప్రియులారా, మొదటనుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనేగాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయుటలేదు; ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించు చున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయనయందును మీయందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటివరకును చీకటిలోనే యున్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు; అతనియందు అభ్యంతరకారణమేదియు లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి, చీకటిలో నడుచుచున్నాడు; చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవు చున్నాడో అతనికి తెలియదు. చిన్నపిల్లలారా, ఆయన నామముబట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆదినుండి యున్నవానిని ఎరిగి యున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యౌవనస్థులారా, మీరు దుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆదినుండి యున్నవానిని ఎరిగి యున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యౌవనస్థులారా, మీరు బలవంతులు, దేవునివాక్యము మీయందు నిలుచుచున్నది; మీరు దుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. చిన్నపిల్లలారా, యిది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు; ఇది కడవరి గడియ అని దీనిచేత తెలిసికొనుచున్నాము. వారు మనలోనుండి బయలువెళ్లిరి గాని వారు మన సంబంధులు కారు; వారు మన సంబంధులైతే మనతోకూడ నిలిచియుందురు; అయితే వారందరు మన సంబంధులు కారని ప్రత్యక్ష పరచబడునట్లువారు బయలువెళ్లిరి. అయితే మీరు పరిశుద్ధునివలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యమెరుగనివారైనందున నేను వ్రాయలేదు గాని, మీరు దానిని ఎరిగియున్నందునను, ఏ అబద్ధమును సత్యసంబంధమైనది కాదని యెరిగి యున్నందునను మీకు వ్రాయుచున్నాను. యేసు, క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు; కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించు వాడు. అయితే మీరు మొదటనుండి దేనిని వింటిరో అది మీలో నిలువనియ్యుడి; మీరు మొదటనుండి వినినది మీలో నిలిచినయెడల, మీరు కూడ కుమారునియందును తండ్రియందును నిలుతురు. నిత్యజీవము అనుగ్రహింతు ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మిమ్మును మోసపరచువారినిబట్టి యీ సంగతులు మీకు వ్రాసియున్నాను. అయితే ఆయనవలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు; ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు; అది అన్నిటినిగూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను, ఆయనలో మీరు నిలుచుచున్నారు కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్ష మగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన యెదుట సిగ్గుపడక ధైర్యము కలిగియుండునట్లు మీరాయనయందు నిలిచియుండుడి.