Mufananidzo weYouVersion
Mucherechedzo Wekutsvaka

మత్తయి సువార్త 10

10
యేసు పన్నెండుమందిని పంపుట
1యేసు పన్నెండుమంది శిష్యులను దగ్గరకు పిలిచి అపవిత్రాత్మలను వెళ్లగొట్టడానికి, అన్ని రకాల రోగాలను వ్యాధులను బాగుచేయడానికి వారికి అధికారం ఇచ్చారు.
2ఆ పన్నెండుమంది అపొస్తలుల పేర్లు:
మొదట పేతురు అని పిలువబడే సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ,
జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను,
3ఫిలిప్పు, బర్తలోమయి,
తోమా, పన్ను వసూలు చేసే మత్తయి,
అల్ఫయి కుమారుడైన యాకోబు, తద్దయి;
4జెలోతే అని పిలువబడిన#10:4 జెలోతే అంటే మతాభిమాని లేదా అత్యాసక్తి కలవాడు లేదా కనానీయుడైన సీమోను సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.
5యేసు ఆ పన్నెండు మందికి ఈ సూచనలు ఇచ్చి పంపారు: “యూదేతరుల ప్రాంతాల్లోనికి గాని సమరయ పట్టణాలకు గాని వెళ్లకండి. 6ఇశ్రాయేలీయులలో తప్పిపోయిన గొర్రెల దగ్గరకు వెళ్లండి. 7మీరు వెళ్తూ, ‘పరలోక రాజ్యం సమీపించింది’ అనే సందేశాన్ని ప్రకటించండి. 8రోగులను స్వస్థపరచండి, చనిపోయినవారిని లేపండి, కుష్ఠురోగులను శుద్ధులుగా చేయండి, దయ్యాలను వెళ్లగొట్టండి. మీరు ఉచితంగా పొందుకున్నారు కాబట్టి ఉచితంగా ఇవ్వండి.
9“మీ నడికట్టులో బంగారం గాని వెండి గాని రాగి గాని పెట్టుకోకండి. 10ప్రయాణం కోసం సంచి గాని రెండవ చొక్కా గాని చెప్పులు గాని చేతికర్ర గాని తీసుకెళ్లకండి, ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు. 11మీరు ఏ పట్టణంలో గాని గ్రామంలో గాని ప్రవేశించినప్పుడు అక్కడ యోగ్యులెవరో అడిగి తెలుసుకొని అక్కడినుండి వెళ్లేవరకు ఆ ఇంట్లోనే బసచేయండి. 12ఒక గృహంలో ప్రవేశించినప్పుడు ఆ ఇంటివారికి శుభమని చెప్పండి. 13ఆ ఇంటికి ఆ యోగ్యత ఉంటే మీ శాంతి ఆ ఇంటి మీద నిలుస్తుంది. ఆ యోగ్యత ఆ ఇంటికి లేకపోతే మీ శాంతి మీకే తిరిగి వస్తుంది. 14ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే లేదా మీ మాటలు వినకపోతే, ఆ ఇంటిని లేదా ఆ గ్రామాన్ని విడిచి వెళ్లేటప్పుడు మీ పాదాల దుమ్మును దులిపి వెళ్లండి. 15తీర్పు దినాన ఆ గ్రామానికి పట్టిన గతికంటే సొదొమ, గొమొర్రాల గతి భరించ గలదిగా ఉంటుందని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
16“చూడండి, నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు పంపుతున్నాను. కాబట్టి మీరు పాముల్లా వివేకంగాను పావురాల్లా కపటం లేనివారిగాను ఉండండి. 17మనుష్యుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు న్యాయసభలకు అప్పగించబడతారు, సమాజమందిరాల్లో కొరడాలతో కొట్టబడతారు. 18అయితే వారికి, అలాగే యూదేతరులకు మీరు సాక్షులుగా ఉండడానికి నన్ను బట్టి మీరు అధికారుల ఎదుటకు రాజుల ఎదుటకు కొనిపోబడతారు. 19అయితే వారు మిమ్మల్ని బంధించినప్పుడు, మీరు ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో అని చింతించకండి. మీరు ఏమి చెప్పాలనేది ఆ సమయంలోనే మీకు ఇవ్వబడుతుంది; 20ఎందుకంటే, ఆ సమయంలో మాట్లాడేది మీరు కాదు; మీ తండ్రి ఆత్మయే మీ ద్వారా మాట్లాడతారు.
21“సహోదరుడు సహోదరున్ని, తండ్రి తన బిడ్డను మరణానికి అప్పగిస్తారు; పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడి వారిని చంపిస్తారు. 22నన్ను బట్టి మీరు వారందరిచేత ద్వేషించబడతారు, అయితే అంతం వరకు స్థిరంగా నిలిచి ఉండేవారే రక్షించబడతారు. 23మిమ్మల్ని ఒక గ్రామంలో హింసిస్తే మరో గ్రామానికి పారిపోండి. మనుష్యకుమారుడు వచ్చేలోగా మీరు ఇశ్రాయేలు గ్రామాలన్నింటికి వెళ్లడం పూర్తి చేయలేరు” అని మీకు ఖచ్చితంగా చెప్తున్నాను.
24ఒక శిష్యుడు బోధకుని కంటే లేదా సేవకుడు యజమాని కంటే గొప్పవాడు కాడు. 25శిష్యుడు తన బోధకునిలా, సేవకుడు తన యజమానిలా ఉంటే చాలు. ఇంటి యజమానినే బయెల్జెబూలు అని పిలిస్తే అతని ఇంటివారిని ఇంకా ఎలా పిలుస్తారో గదా!
26“కాబట్టి వారికి భయపడకండి, ఎందుకంటే దాచిపెట్టబడినదేది బయటపడక ఉండదు, మరుగున ఉంచినదేది తెలియకుండా ఉండదు. 27నేను మీతో చీకట్లో చెప్పేదానిని మీరు పగటి వెలుగులో చెప్పండి; మీ చెవిలో చెప్పబడినదానిని పైకప్పుల నుండి ప్రకటించండి. 28శరీరాన్ని చంపి ఆత్మను చంపలేనివారికి భయపడకండి. కానీ శరీరాన్ని, ఆత్మను రెండింటిని నరకంలో నాశనం చేయగలవానికి భయపడండి. 29రెండు పిచ్చుకలు ఒక్క కాసుకు అమ్మబడడం లేదా! అయినా వాటిలో ఒకటి కూడా మీ పరమతండ్రి అనుమతి లేకుండా నేల కూలదు. 30అలాగే మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. 31కాబట్టి భయపడకండి; మీరు అనేక పిచ్చుకల కంటే విలువైనవారు.
32“ఎవరు ఇతరుల ముందు బహిరంగంగా నన్ను ఒప్పుకుంటారో, నేను కూడా పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు ఒప్పుకుంటాను. 33ఎవరు ఇతరుల ముందు నన్ను నిరాకరిస్తారో, పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేను వారిని నిరాకరిస్తాను.
34“భూమి మీద నేను సమాధానం తేవడానికి వచ్చానని అనుకోకండి. నేను ఖడ్గాన్ని తేవడానికి వచ్చానే గాని సమాధానం తేవడానికి కాదు. 35ఎలాగంటే,
“ ‘తన తండ్రికి వ్యతిరేకంగా కుమారుడు
తన తల్లికి వ్యతిరేకంగా కుమార్తె,
తన అత్తకు వ్యతిరేకంగా కోడలు తిరగబడతారు.
36ఒక మనుష్యుని శత్రువులు తన సొంత ఇంటివారే.’#10:36 మీకా 7:6
37“తన తండ్రిని గాని తల్లిని గాని నా కంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు యోగ్యులు కారు. తన కుమారుని గాని కుమార్తెను గాని నా కంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు యోగ్యులు కారు. 38తమ సిలువను ఎత్తుకోకుండా నన్ను వెంబడించేవారు నాకు యోగ్యులు కారు. 39తన ప్రాణాన్ని దక్కించుకొనే వారు దానిని పోగొట్టుకుంటారు. నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకొనేవారు దానిని దక్కించుకుంటారు.
40“మిమ్మల్ని చేర్చుకొనేవారు నన్ను చేర్చుకొంటారు. నన్ను చేర్చుకొనేవారు నన్ను పంపినవానిని చేర్చుకొంటారు. 41ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనేవారు ప్రవక్త ఫలం పొందుతారు. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనేవారు నీతిమంతుని ఫలం పొందుతారు. 42నా శిష్యుడని ఈ చిన్నవారిలో ఒకరికి ఒక గిన్నెడు చల్లని నీళ్లను ఇస్తే వారు తమ ఫలాన్ని పోగొట్టుకోరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.”

Sarudza vhesi

Pakurirana nevamwe

Sarudza zvinyorwa izvi

None

Unoda kuti zviratidziro zvako zvichengetedzwe pamidziyo yako yose? Nyoresa kana kuti pinda