జెకర్యా 12

12
యెరూషలేము విడుదల, విజయం
1ఇది దేవోక్తి. ఇశ్రాయేలు ప్రజలను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశమండలాన్ని విశాలంగా చేసి, భూమికి పునాది వేసి, మనిషిలో జీవాత్మను పుట్టించినవాడు యెహోవా. 2ఆయన చెబుతున్నది ఏమిటంటే “నేను యెరూషలేమును చుట్టూ ఉన్న సమస్త ప్రజలందరికీ మత్తు కలిగించే పాత్రగా చేయబోతున్నాను. శత్రువులు యెరూషలేమును, యూదా దేశాన్ని కూడా ముట్టడిస్తారు.
3భూమిపై ఉన్న ఇతర జాతులన్నీ యెరూషలేముకు విరోధంగా సమకూడతాయి. ఆ రోజుల్లో నేను యెరూషలేమును సమస్త జాతులకు బరువైన రాయిగా చేస్తాను, దాన్ని తొలగించాలని చూసేవాళ్ళంతా గాయాలపాలు అవుతారు.” 4ఇదే యెహోవా వాక్కు. “ఆ దినాన నేను గుర్రాలన్నిటికీ బెదురు, గుర్రపు రౌతులకు వెర్రి పుట్టిస్తాను. యూదావారి విషయం శ్రద్ధ చూపించి, ఇతర ప్రజల గుర్రాలన్నిటికీ గుడ్డితనం కలిగిస్తాను.”
5అప్పుడు యెరూషలేములోని అధికారులు, నివాసులు “దేవుడైన యెహోవాను నమ్ముకోవడం వల్ల ఆయన మాకు తోడుగా ఉన్నాడు” అని తమ మనస్సుల్లో చెప్పుకుంటారు. 6ఆ దినాన నేను యూదా అధికారులను కట్టెల కింద మంటగా చేస్తాను, పనల కింద కాగడాగా చేస్తాను, వారు నాలుగు దిక్కుల్లో ఉన్న ప్రజలందరినీ దహించివేస్తారు. యెరూషలేము నివాసులు తమ స్వస్థలంలో స్థిరంగా నివసిస్తారు.
7మొదటగా యెహోవా యూదావారి నివాసాలను రక్షిస్తాడు. దావీదు వంశంవారు, యెరూషలేము ప్రజలు తమకు కలిగిన ఘనతను బట్టి యూదావారిని చిన్నచూపు చూడకుండా ఉండేలా ఆయన ఇలా చేస్తాడు. 8ఆ కాలంలో యెహోవా యెరూషలేము నివాసులను కాపాడతాడు. వారిలో బలహీనులు దావీదువంటి వారిలాగా, దావీదు వంశీయులు దేవుని వంటివారుగా, ప్రజల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగా ఉంటారు. 9ఆ కాలంలో యెరూషలేము మీదికి దండెత్తే ఇతర దేశాల ప్రజలందరినీ నాశనం చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను.
అభిషిక్తుని విషయంలో యూదులు పశ్చాత్తాపం, విలాపం
10అప్పుడు దావీదు వంశీయుల మీదా యెరూషలేములో నివసించే ప్రజల మీదా కరుణ కలిగించే ఆత్మ కోసం విజ్ఞాపన చేసే ఆత్మను నేను కుమ్మరిస్తాను. తాము పొడిచిన నన్ను వారు కళ్లారా చూస్తారు. ఒకడు తన ఏకైక కుమారుడు మరణిస్తే దుఃఖించినట్టు, తన జ్యేష్ఠపుత్రుడు మరణిస్తే ఒకడు విలపించినట్టు అతని విషయమై దుఃఖిస్తూ ప్రలాపిస్తారు.
11మెగిద్దో మైదానంలో హదదిమ్మోను దగ్గర జరిగిన విలాపం వలె ఆ రోజున యెరూషలేములో మహా విలాపం జరుగుతుంది. 12దేశ ప్రజలంతా ఏ వంశానికి ఆ వంశంగా విలపిస్తారు. దావీదు వంశీయులు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు. నాతాను వంశీయులు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు. 13లేవి వంశీయులు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా, షిమీ వంశీయులు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు. 14మిగిలిన అన్ని వంశాలవారు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు.

Markering

Kopiëren

Vergelijk

Delen

None

Wil je jouw markerkingen op al je apparaten opslaan? Meld je aan of log in