Kisary famantarana ny YouVersion
Kisary fikarohana

మత్తయి సువార్త 25

25
పదిమంది కన్యల ఉపమానం
1“పరలోక రాజ్యం తమ దీపాలను పట్టుకుని పెండ్లికుమారుని ఎదుర్కోడానికి బయలుదేరిన పదిమంది కన్యలను పోలి ఉంది. 2వీరిలో అయిదుగురు బుద్ధిలేని వారు, అయిదుగురు బుద్ధిగలవారు. 3బుద్ధిలేని వారు తమ దీపాలను పట్టుకున్నారు కాని తమతో నూనెను తీసుకుపోలేదు. 4బుద్ధిగలవారు, తమ దీపాలతో పాటు సీసాల్లో నూనె తీసుకెళ్లారు. 5పెండ్లికుమారుడు రావడానికి ఆలస్యం అయ్యింది, అంతలో వారందరు కునికి నిద్రపోయారు.
6“అర్థరాత్రి సమయంలో ‘ఇదిగో, పెండ్లికుమారుడు వస్తున్నాడు, ఆయనను ఎదుర్కోడానికి రండి!’ అనే కేక వినపడింది.
7“అప్పుడు ఆ కన్యలందరు లేచి తమ దీపాలను సరిచేసికొని వెలిగించుకున్నారు. 8గాని బుద్ధిలేని కన్యలు బుద్ధిగల కన్యలతో, ‘మా దీపాలు ఆరిపోతున్నాయి; మాకు కొంచెం నూనెను ఇవ్వండి’ అని అడిగారు.
9“అందుకు బుద్ధిగల కన్యలు, ‘లేదు, మాకు మీకు అది సరిపోదు, మీరు అమ్మేవారి దగ్గరకు పోయి కొనుక్కోండి’ అని చెప్పారు.
10“వారు కొనడానికి వెళ్తున్నప్పుడే, పెండ్లికుమారుడు వచ్చాడు. సిద్ధపడి ఉన్న కన్యలు ఆయనతో కూడ పెండ్లివిందుకు లోపలికి వెళ్లారు. ఆ తర్వాత తలుపు మూయబడింది.
11“ఆ తర్వాత మిగతావారు వచ్చి, ‘ప్రభువా, ప్రభువా, మాకోసం తలుపు తెరవండి!’ అన్నారు.
12“కాని అతడు, ‘నేను మీతో నిజం చెప్తున్న, మీరు ఎవరో నాకు తెలియదు’ అని జవాబిచ్చాడు.
13“కాబట్టి మెలకువగా ఉండండి, ఎందుకంటే ఆ దినం కాని ఆ గంట కాని మీకు తెలియదు” అని చెప్పారు.
తలాంతుల ఉపమానం
14యేసు మరొక ఉపమానం చెప్పారు, “పరలోక రాజ్యం, దూర దేశానికి ప్రయాణమై, తన ఇంట్లో పని చేసి సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించిన ఒక మనుష్యుని పోలి ఉంది. 15ఆయన వారిలో ఒకనికి అయిదు తలాంతుల బంగారం, ఇంకొకనికి రెండు తలాంతుల బంగారం, మరొకనికి ఒక తలాంతు బంగారం, ఎవని సామర్థ్యాన్ని బట్టి వానికి ఇచ్చాడు. తర్వాత అతడు ప్రయాణమై వెళ్లాడు. 16అయిదు తలాంతుల బంగారం#25:16 అయిదు తలాంతుల బంగారం ఒక తలాంతు 6,000 దీనార్లతో సమానము. ఒక దీనార్ అనగా ఒక రోజు కూలి; ఒక తలాంతు సుమారు 20 సంవత్సరాల దిన కూలి యొక్క జీతంతో సమానం తీసుకున్నవాడు వెంటనే వెళ్లి వెంటనే ఆ డబ్బుతో వ్యాపారం చేసి ఇంకా అయిదు తలాంతులను సంపాదించాడు. 17అలాగే, రెండు తలాంతుల బంగారం తీసికొన్నవాడు మరి రెండు సంపాదించాడు. 18అయితే ఒక తలాంతు బంగారం తీసికొన్నవాడు మాత్రం వెళ్లి, భూమిలో ఒక గుంట త్రవ్వి దానిలో తన యజమానుని ఇచ్చిన ఒక్క తలాంతును దాచిపెట్టాడు.
19“చాలా కాలం తర్వాత ఆ యజమానుడు తిరిగివచ్చి వారి దగ్గర లెక్క చూసుకొన్నాడు. 20అయిదు తలాంతుల బంగారం తీసికొన్నవాడు ఇంకా అయిదు తలాంతులు తెచ్చి, ‘యజమానుడా, నీవు నాకు అయిదు తలాంతుల బంగారం అప్పగించావు. చూడు, నేను ఇంకా అయిదు తలాంతులను సంపాదించాను’ అని చెప్పాడు.
21“అతని యజమాని అతనితో, ‘భళా, నమ్మకమైన మంచి దాసుడా! నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు; కాబట్టి నిన్ను అనేక వాటి మీద నియమిస్తాను. వచ్చి నీ యజమాని సంతోషంలో పాలుపొందు’ అని అతనితో చెప్పాడు.
22“అలాగే రెండు తలాంతుల బంగారం తీసికొన్నవాడు కూడా వచ్చాడు. అతడు ‘యజమానుడా, నీవు నాకు రెండు తలాంతుల బంగారం అప్పగించావు; చూడు, నేను ఇంకా రెండు తలాంతులను సంపాదించాను’ అని చెప్పాడు.
23“అతని యజమాని అతనితో, ‘భళా, నమ్మకమైన మంచి దాసుడా! నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు; కాబట్టి నిన్ను అనేక వాటి మీద నియమిస్తాను. వచ్చి నీ యజమాని సంతోషంలో పాలుపొందు’ అని అతనితో చెప్పాడు.
24“ఆ తర్వాత ఒక తలాంతు బంగారం తీసికొన్నవాడు వచ్చి, ‘యజమానుడా, నీవు కఠినుడవని, విత్తనాలు విత్తని చోట పంట కోసేవాడవు, వెదజల్లని చోట పంట కూర్చుకునే వాడవని నాకు తెలుసు. 25కాబట్టి నేను భయపడి వెళ్లి, నీ తలాంతు బంగారాన్ని భూమిలో దాచి పెట్టాను’ అని చెప్పాడు.
26“అందుకు అతని యజమానుడు వానితో, ‘సోమరియైన చెడ్డ దాసుడా! నేను విత్తనాలు విత్తని చోట కోసే వాడను అని, వెదజల్లని చోట పంట కూర్చుకునే వాడనని నీకు తెలుసు కదా? 27అలాగైతే, నీవు నా సొమ్మును వడ్డీ వ్యాపారుల దగ్గర పెట్టాల్సింది, అప్పుడు నేను వచ్చి దానిని వడ్డీతో కలిపి తీసుకునేవాన్ని’ అన్నాడు.
28“ఆ తలాంతును వాని దగ్గరి నుండి తీసుకుని, పది తలాంతుల గలవానికి ఇవ్వండి. 29ఎందుకంటే కలిగినవానికి మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది, అతడు సమృద్ధిగా కలిగి ఉంటాడు. లేనివారి నుండి, వారు కలిగి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. 30అయితే పనికిమాలిన ఈ దాసుని బయటకు చీకటిలోనికి త్రోసివేయండి. అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి.”
దేవుని న్యాయం గొర్రెలు మేకలను వేరుపరుస్తుంది
31మనుష్యకుమారుడు తన మహిమలో, దేవదూతలందరితో వచ్చేటప్పుడు, ఆయన తన మహిమగల సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. 32భూప్రజలందరు ఆయన ముందు పోగు చేయబడి ఉంటారు, ఒక గొర్రెల కాపరి మేకల నుండి గొర్రెలను వేరు చేసినట్లు ఆయన వారిని వేరు చేస్తాడు. 33ఆయన తన కుడి వైపున గొర్రెలను ఎడమవైపున మేకలను వేరుగా నిలబెడతాడు.
34అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారితో, “నా తండ్రి ఆశీర్వాదం పొందిన వారలారా; రండి! లోకం సృజింపబడినప్పటి నుండి మీ కోసం సిద్ధపరచి ఉంచిన మీ వారసత్వ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. 35ఎందుకంటే, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు, నేను దప్పికతో ఉన్నప్పుడు మీరు నాకు త్రాగడానికి ఇచ్చారు. నేను పరదేశిగా ఉన్నప్పుడు మీరు నన్ను మీ ఇంట్లోకి చేర్చుకొన్నారు. 36నాకు బట్టలు లేనప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చారు. నేను రోగిగా ఉన్నప్పుడు మీరు నన్ను చూసుకున్నారు. నేను చెరసాలలో ఉన్నప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి నన్ను పరామర్శించారు” అని చెప్తాడు.
37“అప్పుడు ఆ నీతిమంతులు, ‘ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలితో ఉన్నావని చూసి ఆహారం పెట్టాం? ఎప్పుడు దప్పికతో ఉన్నావని చూసి నీ దాహం తీర్చాము? 38ఎప్పుడు నీవు పరదేశివని చూసి నిన్ను మా ఇంట్లోకి చేర్చుకున్నాము? ఎప్పుడు బట్టలు లేకపోవడం చూసి బట్టలు ఇచ్చాము? 39ఎప్పుడు నిన్ను రోగిగా చూసి లేదా చెరసాలలో చూసి పరామర్శించాము?’ అని ఆయనను అడుగుతారు.
40“అందుకు ఆ రాజు, ‘ఈ నా సహోదర సహోదరీలలో బహు అల్పులైనవారికి చేశారు కాబట్టి, నాకు చేసినట్లే అని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను’ అని వారితో అంటాడు.
41“అప్పుడు ఆయన తన ఎడమవైపున ఉన్నవారిని చూసి, ‘శాపగ్రస్తులారా, నన్ను విడిచి, అపవాది వాని దూతల కోసం సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్లిపొండి. 42ఎందుకంటే నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు, దాహంతో ఉన్నప్పుడు మీరు నాకు దాహం తీర్చలేదు, 43నేను పరదేశిగా ఉన్నప్పుడు మీరు నన్ను మీ ఇంట్లోకి చేర్చుకోలేదు, నాకు బట్టలు లేనప్పుడు నాకు బట్టలివ్వలేదు. రోగిగా చెరసాలలో ఉన్నప్పుడు మీరు నన్ను పరామర్శించలేదు’ అని చెప్తాడు.
44“అందుకు వారు, ‘ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలితో ఉండడం లేదా దాహంతో ఉండడం లేదా పరదేశిగా ఉండడం లేదా బట్టలు లేనివానిగా ఉండడం లేదా రోగిగా లేదా చెరసాలలో ఉండడం చూసి సహాయం చేయలేదు?’ అడుగుతారు.
45“అందుకు రాజు, ‘ఈ నా సహోదర సహోదరీలలో బహు అల్పులైనవారికి చేయలేదు కాబట్టి నాకు చేయనట్లే అని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను’ అని వారితో అంటాడు.
46“అప్పుడు వారు నిత్య శిక్షలోనికి ప్రవేశిస్తారు, కాని నీతిమంతులు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారు.”

Voafantina amin'izao fotoana izao:

మత్తయి సువార్త 25: TSA

Asongadina

Hizara

Dika mitovy

None

Tianao hovoatahiry amin'ireo fitaovana ampiasainao rehetra ve ireo nasongadina? Hisoratra na Hiditra

Horonantsary ho an'i మత్తయి సువార్త 25