ఆది 1

1
విశ్వ సృష్టి
1ఆరంభంలో దేవుడు ఆకాశాలనూ భూమినీ సృష్టించాడు. 2భూమి #1:2 అస్తవ్యస్తం గా నిరాకారంగా, శూన్యంగా ఉంది. జలాగాధం మీద చీకటి కమ్ముకుని ఉంది. దేవుని ఆత్మ#1:2 లేక దేవుని ప్రభావం, లేక దేవుని వాయువు. హీబ్రూరువారు ఆ మహా జలరాశిపై కదలాడుతూ ఉన్నాడు.
3దేవుడు “వెలుగు కలుగు గాక” అన్నాడు. వెలుగు కలిగింది. 4ఆ వెలుగు దేవునికి మంచిదిగా అనిపించింది. దేవుడు వెలుగునూ చీకటినీ వేరు చేశాడు. 5దేవుడు వెలుగుకు పగలు అనీ చీకటికి రాత్రి అని పేర్లు పెట్టాడు. సాయంత్రం అయింది, ఉదయం వచ్చింది, మొదటి రోజు#1:5 యూదులకు ఒక దినం అంటే సాయంత్రం నుండి మరుసటిరోజు సాయంత్రం వరకు..
6దేవుడు “మహా జలరాశి మధ్యలో ఒక విశాల ప్రదేశం కలుగు గాక. అది నీళ్ళనుండి నీళ్ళను వేరు చేయు గాక” అన్నాడు. 7దేవుడు ఆ విశాలమైన ప్రదేశాన్ని చేసి, దాని పైన ఉన్న జలాలను, కింద ఉన్న జలాలను వేరు చేసాడు. అది అలాగే జరిగింది. 8దేవుడు ఆ విశాల ప్రదేశానికి “ఆకాశం” అని పేరు పెట్టాడు. రాత్రి అయింది, ఉదయం వచ్చింది, రెండవ రోజు.
9దేవుడు “ఆకాశం కింద ఉన్న జలాలు ఒకే చోట సమకూడి ఆరిన నేల కనబడాలి” అన్నాడు. అలాగే జరిగింది. 10దేవుడు ఆరిన నేలకు “భూమి” అని పేరు పెట్టాడు. కూర్చి ఉన్న జలాలకు “సముద్రాలు” అని పేరు పెట్టాడు. అది ఆయనకు మంచిదిగా అనిపించింది.
11దేవుడు “వృక్ష జాలాన్ని, విత్తనాలుండే చెట్లను, భూమిపై తమ తమ జాతి ప్రకారం విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించాలి” అన్నాడు. అలాగే జరిగింది. 12వృక్ష జాతిని, విత్తనాలుండే చెట్లను, భూమిమీద తమ తమ జాతుల ప్రకారం తమలో విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించింది. అది ఆయనకు మంచిదిగా కనబడింది. 13రాత్రి అయింది, ఉదయం వచ్చింది-మూడవ రోజు.
14దేవుడు “రాత్రి నుంచి పగలును వేరు చెయ్యడానికి ఆకాశ విశాలంలో జ్యోతులు ఉండాలి. కాలాలకు, రోజులకు, సంవత్సరాలకు అవి సూచనలుగా ఉండాలి. 15భూమికి వెలుగు ఇవ్వడానికి ఆకాశ విశాలంలో జ్యోతులుగా అవి ఉండాలి” అన్నాడు. అలాగే జరిగింది.
16దేవుడు రెండు గొప్ప జ్యోతులు చేశాడు. పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని పాలించడానికి చిన్న జ్యోతిని చేశాడు. ఆయన నక్షత్రాలను కూడా చేశాడు. 17భూమికి వెలుగు ఇవ్వడానికీ, 18పగటినీ రాత్రినీ పాలించడానికీ, వెలుగునూ చీకటినీ వేరు చెయ్యడానికీ, దేవుడు ఆకాశ విశాలంలో వాటిని అమర్చాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది. 19రాత్రి అయింది. ఉదయం వచ్చింది-నాలుగో రోజు.
20దేవుడు “చలించే ప్రాణులు జలాల్లో కుప్పలు తెప్పలుగా నిండిపోవాలి. భూమిపై ఉన్న ఆకాశవిశాలంలో పక్షులు ఎగరాలి” అన్నాడు. 21దేవుడు బ్రహ్మాండమైన జలచరాలనూ, చలించే ప్రాణులన్నిటినీ వాటి వాటి జాతుల ప్రకారం పుష్కలంగా జలాలను నింపి వేసేలా సృష్టించాడు. ఇంకా వాటి వాటి జాతి ప్రకారం రెక్కలున్న ప్రతి పక్షినీ సృష్టించాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది.
22దేవుడు “మీరు ఫలించి వృద్ధి పొందండి. సముద్ర జలాలను నింపండి. పక్షులు భూమి మీద విస్తరించాలి” అని వాటిని దీవించాడు. 23రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఐదో రోజు.
24దేవుడు “వాటి వాటి జాతుల ప్రకారం ప్రాణం గలవాటిని, అంటే వాటి వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించాలి” అన్నాడు. అలాగే జరిగింది. 25దేవుడు, వాటి వాటి జాతుల ప్రకారం అడవి జంతువులనూ వాటి వాటి జాతుల ప్రకారం పశువులనూ, వాటి వాటి జాతుల ప్రకారం నేలమీద పాకే ప్రతి పురుగునూ చేశాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది.
26దేవుడు ఇలా అన్నాడు. “మన స్వరూపంలో మన పోలికలో మనిషిని చేద్దాం. సముద్రంలో చేపల మీదా ఆకాశంలో పక్షుల మీదా పశువుల మీదా భూమి మీద పాకే ప్రతి జంతువు మీదా భూమి అంతటి మీదా వారికి ఆధిపత్యం ఉండాలి” అన్నాడు. 27దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. దేవుని స్వరూపంలో అతణ్ణి సృష్టించాడు. పురుషుడిగా స్త్రీగా వాళ్ళను సృష్టించాడు.
28దేవుడు వాళ్ళను దీవించి “మీరు ఫలించి, సంఖ్యలో వృద్ధి చెందండి. భూమి అంతటా విస్తరించి, భూమిని నింపి దాన్ని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపలనూ ఆకాశంలో పక్షులనూ మీదా భూమి మీద పాకే ప్రతి ప్రాణినీ పరిపాలించండి” అని చెప్పాడు. 29దేవుడు ఇంకా ఇలా అన్నాడు. “చూడండి, భూమిమీద ఉన్న విత్తనాలిచ్చే ప్రతి చెట్టును, విత్తనాలున్న ఫలాలు ఇచ్చే ప్రతి చెట్టును మీకు ఇచ్చాను. అవి మీకు ఆహారం అవుతాయి.
30భూమిమీద ఉండే జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద పాకే జీవాలన్నిటికీ పచ్చని చెట్లన్నీ ఆహారం అవుతాయి” అన్నాడు. అలాగే జరిగింది. 31దేవుడు తాను చేసిందంతా చూసినప్పుడు అది ఆయనకు ఎంతో మంచిదిగా కనబడింది. రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఆరవ రోజు.

נבחרו כעת:

ఆది 1: IRVTel

הדגשה

שתף

העתק

None

רוצים לשמור את ההדגשות שלכם בכל המכשירים שלכם? הירשמו או היכנסו

YouVersion משתמש בקובצי Cookie כדי להתאים אישית את החוויה שלך. על ידי שימוש באתר שלנו, אתה מקבל את השימוש שלנו בעוגיות כמתואר ב מדיניות הפרטיות שלנו