Romans 15:4-13

ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి. మీరేకభావము గలవారై యేకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమ పరచు నిమిత్తము, క్రీస్తుయేసు చిత్తప్రకారము ఒకనితో నొకడు మనస్సు కలిసినవారై యుండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చు కొనుడి. నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని సాప్థిచుటకును, అన్యజనులు ఆయన కనికరమునుగూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయెను. అందు విషయమై– ఈ హేతువుచేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును; నీ నామసంకీర్తనము చేయుదును అని వ్రాయబడియున్నది. మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు మరియు సమస్త అన్యజనులారా, ప్రభువు ను స్తుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక అనియు చెప్పియున్నది. మరియు యెషయా యీలాగు చెప్పుచున్నాడు– యెష్షయిలోనుండి వేరు చిగురు, అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును; ఆయనయందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.
రోమా 15:4-13