Psalm 77:1-10

నేను ఎలుగెత్తి దేవునికి మొఱ్ఱపెట్టుదును ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు చెవియొగ్గువరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండ చాప బడియున్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లక యున్నది. దేవుని జ్ఞాపకము చేసికొనునప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను నేను ధ్యానించునప్పుడు నా ఆత్మ క్రుంగిపోవుచున్నది (సెలా.) నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేక యున్నాను. తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసి కొందును హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పుమార్గము శ్రద్ధగా వెదకెను. ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇకెన్నడును కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటికిలేకుండ మానిపోయెనా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పి పోయెనా? దేవుడు కటాక్షింప మానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా? (సెలా.) అందుకు–నేనీలాగు అనుకొనుచున్నాను మహోన్నతుని దక్షిణహస్తము మార్పునొందెననుకొను టకు నాకు కలిగినశ్రమయే కారణము.
కీర్తనలు 77:1-10