కీర్తనలు 107:1-9

యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుదురు గాక విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించినవారును తూర్పునుండి పడమటినుండి ఉత్తరమునుండి దక్షిణము నుండియు నానాదేశములనుండియు ఆయన పోగుచేసినవారును ఆమాట పలుకుదురుగాక. వారు అరణ్యమందలి యెడారిత్రోవను తిరుగులాడుచుండిరి. నివాస పురమేదియు వారికి దొరుకకపోయెను. ఆకలి దప్పులచేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను వారొక నివాస పురము చేరునట్లు చక్కనిత్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్య కార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి యున్నాడు. ఆకలిగొనినవారి ప్రాణమును మేలుతో నింపి యున్నాడు.
కీర్తనలు 107:1-9