Matthew 27:45-56

మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటికమ్మెను. ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అక్కడ నిలిచియున్నవారిలో కొందరామాట విని ఇతడు ఏలీయాను పిలుచుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరుగెత్తికొనిపోయి, స్పంజీ తీసికొని చిరకాలో ముంచి, రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను; తక్కినవారు–ఊరకుండుడి ఏలీయా అతని రక్షింపవచ్చునేమో చూత మనిరి. యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్ద లాయెను; సమాధులు తెరవబడెను; నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలోనుండి బయటికి వచ్చి ఆయన లేచినతరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధి పతియు అతనితోకూడ యేసునకు కావలి యున్నవారును, భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి, మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పు కొనిరి. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేకమంది స్త్రీలు అక్కడ దూరమునుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు యాకోబు యోసే అనువారి తల్లియైన మరి యయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి.
మత్తయి 27:45-56