Colossians 1:12-17

అందుచేత ఈ సంగతి వినిననాటనుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమునుగలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతోకూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగాచేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలు చున్నాము. ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను. ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.
కొలొస్సయులకు 1:9-12-17