జెఫన్యా 3:14-20

జెఫన్యా 3:14-20 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

సీయోను కుమారీ, పాట పాడు; ఇశ్రాయేలూ, బిగ్గరగా కేకవేయి! యెరూషలేము కుమారీ, నీ పూర్ణహృదయంతో సంతోషించి ఆనందించు! యెహోవా నీ శిక్షను తొలగించారు, నీ శత్రువును తిప్పికొట్టారు. ఇశ్రాయేలు రాజైన యెహోవా నీకు తోడుగా ఉన్నారు; ఇంకెప్పుడు ఏ హానికి నీవు భయపడవు. ఆ రోజున వారు యెరూషలేముతో, “సీయోనూ, భయపడకు; నీ చేతులను బలహీన పడనివ్వవద్దు. నీ దేవుడైన యెహోవా, రక్షించే పరాక్రమశాలి నీకు తోడుగా ఉన్నారు. ఆయన నిన్ను చూసి చాలా సంతోషిస్తారు; ఆయన తన ప్రేమను బట్టి ఆయన ఇకపై నిన్ను గద్దించరు, పాడుతూ నిన్ను చూసి సంతోషిస్తారు.” “నీ నియమించబడిన పండుగలకు రాలేక దుఃఖించే వారందరినీ నేను మీ మధ్య నుండి తొలగిస్తాను. వారు మీకు భారంగా నిందగా ఉన్నారు. ఆ సమయంలో నిన్ను హింసించిన వారందరిని నేను శిక్షిస్తాను. కుంటివారిని నేను రక్షిస్తాను; చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తాను. వారు అవమానానికి గురైన ప్రతి దేశంలో నేను వారికి కీర్తిని, ఘనతను ఇస్తాను. ఆ సమయంలో నేను మిమ్మల్ని సమకూర్చుతాను; ఆ సమయంలో నేను మిమ్మల్ని ఇంటికి తీసుకువస్తాను. నేను మిమ్మల్ని చెరలో నుండి తిరిగి తీసుకువచ్చినప్పుడు భూమ్మీద ఉన్న ప్రజలందరిలో నేను మీకు కీర్తిని, ఘనతను ఇస్తాను” అని యెహోవా అంటున్నారు.

జెఫన్యా 3:14-20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

సీయోను నివాసులారా, ఉత్సాహ ధ్వని చేయండి. ఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయండి. యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయండి. మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేశాడు. మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయం సంభవించదు. ఆ దినాన ప్రజలు మీతో ఇలా అంటారు. యెరూషలేమూ, భయపడకు. సీయోనూ, ధైర్యం తెచ్చుకో. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిశాలి. ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. ఆయన బహు ఆనందంతో నీ విషయం సంతోషిస్తాడు. నీ పట్ల తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ విషయమైన సంతోషము మూలంగా ఆయన హర్షిస్తాడు. నీ నియామక కాలపు పండగలకు రాలేక చింతపడే నీ బంధువులను నేను సమకూరుస్తాను. వారు గొప్ప అవమానం పొందిన వారు. ఆ కాలమున నిన్ను హింస పెట్టే వారినందరినీ నేను శిక్షిస్తాను. కుంటుతూ నడిచే వారిని నేను రక్షిస్తాను. చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తాను. ఏ యే దేశాల్లో వారు అవమానం పాలయ్యారో అలాటి ప్రతి చోటా నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలగజేస్తాను. ఆ కాలంలో మీరు చూస్తుండగా నేను మిమ్మల్ని చెరలోనుండి రప్పించి, మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపిస్తాను. నిజంగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును కట్టబెడతాను. ఇదే యెహోవా వాక్కు.

జెఫన్యా 3:14-20 పవిత్ర బైబిల్ (TERV)

యెరూషలేమా! పాడుతూ సంతోషంగా ఉండు! ఇశ్రాయేలూ, ఆనందంగా కేకలు వేయి! యెరూషలేమా, సంతోషించి సరదాగా ఉండు! ఎందుకంటే, నీ శిక్షను యెహోవా నిలిపివేశాడు గనుక! నీ శత్రువుల బలమైన దుర్గాలను ఆయన నాశనం చేశాడు! ఇశ్రాయేలు రాజా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఏ చెడు విషయం జరుగుతున్నా దాన్నిగూర్చి నీవు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో యెరూషలేముతో ఇలా చెప్పబడుతుంది: “బలంగా ఉండు, భయపడవద్దు! నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఆయన శక్తిమంతుడైన సైనికునిలా ఉన్నాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అది ఆయన నీకు చూపిస్తాడు. ఆయన నీగురించి సంతోషపడతాడు, నీవంటే ఆనందిస్తాడు. విందులో పాల్గొన్నవారివలె ఆయన నీ విషయంలో నవ్వుతూ సంతోషిస్తాడు. అది విందులో పాల్గొన్న ప్రజల్లా ఉంటుంది.” యెహోవా చెప్పాడు: “నీ అవమానాన్ని నేను తొలగించివేస్తాను. ఆ ప్రజలు నిన్ను బాధించకుండునట్లు నేను చేస్తాను. ఆ సమయంలో, నిన్ను బాధించేవారిని నేను శిక్షిస్తాను. బాధించబడిన నా ప్రజలను నేను రక్షిస్తాను. పారిపోయేలా బలవంతం చేయబడిన ప్రజలను నేను తిరిగి వెనుకకు తీసుకొనివస్తాను. మరియు నేను వారిని ప్రసిద్ధి చేస్తాను. అన్ని చోట్లా ప్రజలు వారిని పొగడుతారు. ఆ సమయంలో, నిన్ను నేను వెనుకకు తీసుకొని వస్తాను. నేను నిన్ను సమకూర్చి తీసుకొని వస్తాను. నిన్నునేను ప్రసిద్ధి చేస్తాను. అన్ని చోట్లా ప్రజలు నిన్ను పొగడుతారు. నీ సొంత కళ్ళయెదుట బందీలను తిరిగి నేను వెనుకకు తీసుకొని వచ్చినప్పుడు అది జరుగుతుంది!” ఆ సంగతులు యెహోవా చెప్పాడు.

జెఫన్యా 3:14-20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

సీయోను నివాసులారా, ఉత్సాహధ్వని చేయుడి; ఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయుడి; యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసియున్నాడు; మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టియున్నాడు; ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందురు–యెరూషలేమూ, భయపడకుము, సీయోనూ, ధైర్యము తెచ్చుకొనుము; నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమనుబట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును. నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చెదను, వారు గొప్ప అవమానము పొందినవారు. ఆ కాలమున నిన్ను హింసపెట్టువారినందరిని నేను శిక్షింతును, కుంటుచు నడుచువారిని నేను రక్షింతును, చెదరగొట్టబడినవారిని సమకూర్చుదును, ఏ యే దేశములలో వారు అవమానము నొందిరో అక్కడనెల్ల నేను వారికి ఖ్యాతిని మంచిపేరును కలుగజేసెదను, ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలోనుండి రప్పించి, మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును; నిజముగా భూమిమీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచిపేరును తెప్పింతును; ఇదే యెహోవా వాక్కు.