జెకర్యా 4:1-14

జెకర్యా 4:1-14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అప్పుడు నాతో మాట్లాడిన దూత తిరిగివచ్చి నిద్రపోతున్న వాన్ని లేపినట్లు నన్ను లేపాడు. “నీకు ఏం కనబడుతుంది?” అని నన్ను అడిగాడు. అందుకు నేను, “బంగారు దీపస్తంభం, దాని మీద ఉన్న గిన్నె, ఏడు దీపాలు, దీపాలకున్న ఏడు గొట్టాలు నాకు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా ఆ దీపస్తంభానికి కుడి వైపున ఒకటి ఎడమవైపున ఒకటి ఉన్న రెండు ఒలీవచెట్లు అక్కడ కనిపిస్తున్నాయి” అన్నాను. నాతో మాట్లాడిన దూతను, “నా ప్రభువా, ఇవి ఏంటి?” అని అడిగాను. అందుకా దూత, “ఇవి ఏంటో నీకు తెలియదా?” అని అడిగాడు. అందుకు నేను, “నా ప్రభువా, నాకు తెలియదు” అని చెప్పాను. అప్పుడతడు నాతో ఇలా చెప్పాడు, “జెరుబ్బాబెలు గురించి యెహోవా చెప్పే మాట ఇదే: ‘శక్తి వలన గాని బలం వలన గాని ఇది జరుగదు కాని నా ఆత్మ వలననే ఇది జరుగుతుంది’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు. “మహా పర్వతమా! నీవు ఎంతటి దానివి? జెరుబ్బాబెలు ఎదుట నీవు నేలమట్టం అవుతావు. అప్పుడు ‘దేవుడు దీవిస్తారు గాక! దేవుడు దీవిస్తారు గాక!’ అని కేకలు వేస్తుండగా అతడు పైరాయిని తీసుకువస్తాడు.” తర్వాత యెహోవా వాక్కు నా దగ్గరకు ఇలా వచ్చింది: “జెరుబ్బాబెలు చేతులు ఈ ఆలయపు పునాదిని వేశాయి; అంతే కాకుండా అతని చేతులే దానిని ముగిస్తాయి. అప్పుడు సైన్యాల యెహోవా నన్ను మీ దగ్గరకు పంపారని మీరు తెలుసుకుంటారు. “చిన్న విషయాలు జరిగే రోజును తృణకీరించే ధైర్యం ఎవరికైనా ఉందా? భూమి అంతా సంచరించే యెహోవా యొక్క ఏడు కళ్లు జెరుబ్బాబెలు చేతిలోని మట్టపు గుండును చూసి సంతోషిస్తాయి.” అప్పుడు నేను ఆ దూతను, “దీపస్తంభానికి కుడి ఎడమలకు ఉన్న ఈ రెండు ఒలీవచెట్లు ఏంటి?” అని అడిగాను. నేను మరలా, “ఆ రెండు బంగారు గొట్టాలలో నుండి బంగారు నూనె కుమ్మరించే ఆ రెండు ఒలీవ చెట్ల కొమ్మలు ఏంటి?” అని అతన్ని అడిగాను. అందుకతడు, “ఇవి ఏంటో నీకు తెలియదా?” అని అడిగాడు. “నా ప్రభువా, నాకు తెలియదు” అన్నాను. అందుకతడు, “ఈ ఇద్దరూ సర్వలోక ప్రభువు దగ్గర నిలబడి సేవ చేయడానికి అభిషేకించబడ్డవారు” అని చెప్పాడు.

జెకర్యా 4:1-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అప్పుడు నాతో మాట్లాడుతున్న దూత తిరిగి వచ్చి నిద్రపోతున్న ఒకణ్ణి లేపినట్లు నన్ను లేపాడు. “నీకు ఏమి కనిపిస్తుంది?” అని నన్ను అడిగాడు. నేను “బంగారు దీపస్తంభం నాకు కనిపిస్తుంది. దీపస్తంభం మీద ఒక నూనె పాత్ర ఉంది. దీపస్తంభానికి ఏడు దీపాలు, ఒక్కో దీపానికి ఏడేసి గొట్టాలు కనిపిస్తున్నాయి. దీపస్తంభానికి కుడి పక్కన ఒకటి, ఎడమ పక్కన ఒకటి చొప్పున రెండు ఒలీవ చెట్లు కనబడుతున్నాయి” అని చెప్పాను. తరువాత నేను నాతో మాట్లాడుతున్న దూతతో “స్వామీ, ఇది ఏమిటి?” అని అడిగాను. అప్పుడు నాతో మాట్లాడుతున్న దూత “ఇదేమిటో నీకు తెలియదా” అని అడిగాడు. నేను “స్వామీ, నాకు తెలియదు” అన్నాను. అప్పుడు ఆ దూత నాతో ఇలా చెప్పాడు. “జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఇదే. నీ శక్తి వల్లనైనా, నీ బలం వల్లనైనా ఇది జరగదు. కేవలం నా ఆత్మ వల్లనే ఇది జరుగుతుంది” అని సేనల ప్రభువు యెహోవా చెప్పాడు. మహా పర్వతమా, నువ్వు ఏపాటి దానివి? జెరుబ్బాబెలును అడ్డగించాలని ప్రయత్నించే నువ్వు నేలమట్టం అవుతావు. కృప కలుగు గాక, కృప కలుగు గాక అంటూ ప్రజలు జయజయధ్వానాలు చేస్తూ ఉండగా అతడు పై రాయి తీసుకుని ఆలయంపై పెట్టిస్తాడు. యెహోవా వాక్కు మళ్ళీ నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు. “జెరుబ్బాబెలు తన చేతులతో ఈ ఆలయం పునాది వేశాడు. అతడు ఈ కార్యం ముగిస్తాడు. అప్పుడు ఇదే సేనల ప్రభువు యెహోవా నన్ను మీ దగ్గరికి పంపించాడని నువ్వు తెలుసుకుంటావు. స్వల్పమైన పనులు జరిగే కాలాన్ని ఎవరు తృణీకరిస్తారు? లోకమంతా సంచారం చేసే యెహోవా ఏడు కళ్ళు జెరుబ్బాబెలు చేతిలో ఉన్న గుండునూలును చూసి సంతోషిస్తాయి.” నేను ఆ దూతను “దీపస్తంభానికి రెండు వైపులా ఉన్న ఈ రెండు ఒలీవచెట్ల భావం ఏమిటి?” “రెండు బంగారపు కొమ్ముల్లో నుండి బంగారు నూనె కుమ్మరించే ఒలీవ చెట్లకున్న రెండు కొమ్మల భావం ఏమిటి?” అని అడిగాను. అప్పుడు అతడు నాతో “ఇవి ఏమిటో నీకు తెలియదా?” అన్నాడు. నేను “స్వామీ, నాకు తెలియదు” అని చెప్పాను. అతడు “వీరిద్దరూ సర్వలోకనాధుడైన యెహోవా దగ్గర నిలిచి తైలం పోసే సన్నిధాన సేవకులు” అని చెప్పాడు.

జెకర్యా 4:1-14 పవిత్ర బైబిల్ (TERV)

పిమ్మట నాతో మాట్లాడుతూవున్న దేవదూత నా వద్దకు వచ్చి నన్ను లేపాడు. నేను నిద్ర నుండి మేల్కొంటున్న వ్యక్తివలె ఉన్నాను. “నీవు ఏమి చూస్తున్నావు?” అని దేవదూత నన్ను అడిగాడు. నేను ఇలా చెప్పాను: “ఒక గట్టి బంగారు దీపస్తంభాన్ని చూస్తున్నాను. ఆ స్తంభం మీద ఏడు దీపాలు (ప్రమిదెలు) ఉన్నాయి. దీపస్తంభం మీద ఒక గిన్నెఉంది. గిన్నెనుండి ఏడు గొట్టాలు వచ్చాయి. ప్రతి దీపానికీ ఒక గొట్టం చొప్పున వెళ్లాయి. ఆ గొట్టాలు దీపాలకు కావలసిన నూనెను గిన్నెనుండి చేరవేస్తున్నాయి. గిన్నె పక్కగా కుడి వైవున ఒకటి, ఎడమవైపున ఒకటి ఒలీవ చెట్లు ఉన్నాయి.” తరువాత నాతో మాట్లాడుతూవున్న దేవదూతను, “అయ్యా, ఈ వస్తువులు ఏమి తెలియజేస్తున్నాయి?” అని అడిగాను. “ఈ వస్తువులు ఏమిటో నీకు తెలియదా?” అని నాతో మాట్లాడుతూ ఉన్న దేవదూత అన్నాడు. “లేదయ్యా” అని నేను చెప్పాను. అతడు నాతో ఇలా అన్నాడు: “యెహోవానుంచి జెరుబ్బాబెలుకు వచ్చిన వర్తమానం ఇది: ‘నీ శక్తి సామర్థ్యాలవల్ల నీకు సహాయం రాదు. నీ సహాయం నా ఆత్మ నుండి వస్తుంది.’ సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు! ఆ ఎత్తైన పర్వతం జెరుబ్బాబెలుకు సమమైన ప్రదేశంగా ఉంటుంది. అతడు ఆలయ నిర్మాణం చేస్తాడు. దానికి చివరి రాయి పెట్టబడినప్పుడు, ‘అందంగా ఉంది! అందంగా ఉంది!’ అని ప్రజలు కేకలు పెడతారు.” నాకు వచ్చిన యెహోవా వర్తమానం ఇంకా ఇలా చెప్పింది: “నా ఆలయానికి జెరుబ్బాబెలు పునాదులు నిర్మిస్తాడు. మరియు జెరుబ్బాబెలు ఆలయ నిర్మాణం పూర్తిచేస్తాడు. అప్పుడు సర్వశక్తిమంతుడైన యెహోవా తన ప్రజలైన మీ వద్దకు నన్ను పంపినట్టు మీరు తెలుసుకుంటారు. సామాన్యంగా ప్రారంభించబడే పనులపట్ల ప్రజలు సిగ్గుచెందరు. జెరుబ్బాబెలు గుండు, దారం తీసికొని, తయారైన భవనాన్ని తనిఖీచేసి, కొలవటం చూసినప్పుడు, ప్రజలు నిజంగా సంతోషిస్తారు. ఆ రాతికి మీరు ఇప్పుడు చూసిన ఏడు పక్కలు యెహోవా యొక్క ఏడు కండ్లకు చిహ్నాలుగా ఉండి, అన్ని దిశలకూ చూస్తూ ఉంటాయి. అవి భూమి మీద ప్రతిదాన్నీ చూస్తాయి.” పిమ్మట నేను (జెకర్యా) అతనికి చెప్పాను: “దీపస్తంభానికి కుడి పక్కన ఒక ఒలీవ చెట్టును, ఎడమ పక్కన మరొక చెట్టును నేను చూశాను. ఆ రెండు ఒలీవ చెట్ల అర్థం ఏమిటి?” నేనింకా ఇలా అన్నాను: “బంగారు రంగుగల నూనె ప్రవహించే బంగారు గొట్టాలవద్ద నేను రెండు ఒలీవ కొమ్మలు చూశాను. వీటి అర్థం ఏమిటి?” తరువాత దేవదూత నాతో, “వీటి అర్థం ఏమిటో నీకు తెలియదా?” అని అన్నాడు. “లేదయ్యా” అని నేను చెప్పాను. “ఈ సర్వజగత్తుకు ప్రభువైన యెహోవాను సేవించటానికి ఎంపిక చేయబడిన ఇద్దరు మనుష్యులను అవి సూచిస్తాయి,” అని అతడు చెప్పాడు.

జెకర్యా 4:1-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నాతో మాటలాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన యొకని లేపినట్లు నన్ను లేపి నీకు ఏమి కనబడు చున్నదని యడుగగా నేను–సువర్ణమయమైన దీపస్తంభమును దానిమీద ఒక ప్రమిదెయును, దీపస్తంభమునకు ఏడు దీపములును దీపమునకు ఏడేసి గొట్టములును కనబడుచున్నవి. మరియు రెండు ఒలీవచెట్లు దీపస్తంభమునకు కుడిప్రక్క ఒకటియు ఎడమప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి –నా యేలినవాడా, యిదేమిటియని నాతో మాటలాడుచున్న దూత నడిగితిని. నాతో మాటలాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా యని నన్నడుగగా–నేను–నా యేలినవాడా, నాకు తెలియదంటిని. అప్పుడతడు నాతో ఇట్లనెను–జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే; శక్తిచేతనైనను బలముచేతనైననుకాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదునుభూమి వగుదువు; –కృప కలుగును గాక కృప కలుగునుగాక అని జనులు కేకలువేయగా అతడు పైరాయి తీసికొని పెట్టించును. యెహోవా వాక్కు మరల నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను – జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసియున్నవి, అతనిచేతులు ముగించును, అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీయొద్దకు పంపియున్నాడని నీవు తెలిసికొందువు. కార్యములు అల్పములైయున్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారముచేయు యెహోవాయొక్క యేడు నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుటచూచి సంతోషించును. దీపస్తంభమునకు ఇరుప్రక్కలనుండు ఈ రెండు ఒలీవచెట్లు ఏమిటివనియు, రెండు బంగారపు కొమ్ములలోనుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న రెండు కొమ్మలును ఏమిటివనియు నేనతని నడుగగా అతడు నాతో–ఇవేమిటివని నీకు తెలియదా యనెను–నా యేలినవాడా, నాకు తెలియదని నేననగా అతడు–వీరిద్దరు సర్వలోకనాధుడగు యెహోవాయొద్ద నిలువబడుచు తైలము పోయువారై యున్నారనెను.