జెకర్యా 14:1-5
జెకర్యా 14:1-5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెరూషలేమా, యెహోవా దినం రాబోతుంది, అప్పుడు మీ దగ్గర కొల్లగొట్టబడిన ఆస్తులు మీ మధ్యనే పంచుతారు. యెరూషలేము మీద యుద్ధం చేయడానికి అన్ని దేశాలను నేను సమకూరుస్తాను; వారు పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారు, ఇల్లు దోచుకుంటారు, స్త్రీలను అత్యాచారం చేస్తారు. పట్టణ ప్రజల్లో సగం మంది బందీలుగా వెళ్తారు. అయితే మిగిలి ఉన్న ప్రజలు నాశనం కాకుండా పట్టణంలోనే ఉండిపోతారు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలంలో పోరాడే విధంగా ఆ దేశాలతో యుద్ధం చేస్తారు. ఆ రోజున ఆయన యెరూషలేముకు తూర్పుగా ఉన్న ఒలీవకొండ మీద తన పాదాలు ఉంచగా ఒలీవకొండ తూర్పు నుండి పడమరకు రెండుగా చీలిపోయి, సగం కొండ ఉత్తరదిక్కుకు, మరో సగం కొండ దక్షిణ దిక్కుకు జరిగి మధ్యలో విశాలమైన లోయ ఏర్పడుతుంది. కొండల మధ్య నేను ఏర్పరచిన ఆ లోయ ఆజేలు వరకు ఉంటుంది కాబట్టి మీరు ఆ కొండలోయ గుండా పారిపోతారు. యూదా రాజైన ఉజ్జియా కాలంలో భూకంపం వచ్చినప్పుడు మీరు పారిపోయినట్లు మీరు పారిపోతారు. అప్పుడు నా దేవుడైన యెహోవా తన పరిశుద్ధులందరితో కలిసి వస్తారు.
జెకర్యా 14:1-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇదిగో వినండి. యెహోవా తీర్పు దినం వచ్చేస్తోంది. ఆ రోజు మీ నుండి దోచుకున్న సొమ్ము మీ పట్టణాల్లోనే పంచిపెడతారు. ఎందుకంటే యెరూషలేము మీద యుద్ధం చేయడానికి నేను ఇతర దేశాల ప్రజలను సమకూర్చబోతున్నాను. అప్పుడు పట్టణం శత్రువు చేజిక్కుతుంది. ఇళ్ళు దోచుకుంటారు. స్త్రీలకు మానభంగాలు జరుగుతాయి. నగరంలో సగానికి పైగా బందీలుగా వెళ్ళిపోతారు. మిగిలినవారు నాశనం కాకుండా నగరంలోనే మిగిలిపోతారు. అప్పుడు యెహోవా బయలు దేరతాడు. యుద్ధకాలంలో పోరాడే విధంగా ఆయన ఆ ఇతర దేశాల ప్రజలతో యుద్ధం చేస్తాడు. ఆ రోజున ఆయన యెరూషలేము ఎదురుగా తూర్పు దిక్కున ఉన్న ఒలీవ కొండపై ఆయన పాదాలు మోపుతాడు. అప్పుడు ఒలీవ కొండ తూర్పుకు, పడమరకు మధ్యకు చీలిపోయి సగం కొండ ఉత్తరం వైపుకు, సగం కొండ దక్షిణం వైపుకు జరుగుతుంది. వాటి మధ్య ఒక విశాలమైన లోయ ఏర్పడుతుంది. కొండల మధ్య ఏర్పడిన లోయ ఆజీలు వరకు వ్యాపిస్తుంది. మీరు ఆ కొండ లోయగుండా పారిపోతారు. గతంలో యూదా రాజు ఉజ్జియా రోజుల్లో కలిగిన భూకంపానికి భయపడి పారిపోయినట్టు మీరు పారిపోతారు. నీతోబాటు పరిశుద్ధులందరూ వస్తారు. అప్పుడు నా దేవుడు యెహోవా ప్రత్యక్షం అవుతాడు.
జెకర్యా 14:1-5 పవిత్ర బైబిల్ (TERV)
చూడండి. తీర్పుతీర్చటానికి యెహోవాకు ఒక రోజు ఉంది. మీరు తీసుకున్న ధనం మీ నగరంలో విభజించబడుతుంది. యెరూషలేము మీదికి దేశాలన్నిటినీ నేను రప్పిస్తాను. వారు నగరాన్ని పట్టుకొని ఇండ్లన్నీ నాశనం చేస్తారు. స్త్రీలు మానభంగం చేయబడతారు. జనాభాలో సగం మంది బందీలుగా పట్టుకుపోబడతారు. కాని, మిగిలిన ప్రజలు నగరంనుండి తీసుకుపోబడరు. అప్పుడు యెహోవా ఆయా దేశాలపైకి యుద్ధానికి వెళతాడు. అది నిజమైన యుద్ధం అవుతుంది. ఆ సమయంలో ఆయన యెరూషలేముకు తూర్పున వున్న ఒలీవల కొండమీద నిలబడతాడు. ఒలీవల కొండ రెండుగా చీలి పోతుంది. ఆ కొండలో ఒక భాగం ఉత్తరానికి, మరొక భాగం దక్షిణానికి తిరుగుతాయి. తూర్పునుండి పడమటికి ఒక లోతైన లోయ ఏర్పడుతుంది. ఆ పర్వతలోయ మీకు మరి సన్నిహితంగా రావటంతో మీరు పారిపోవటానికి ప్రయత్నిస్తారు. యూదా రాజైన ఉజ్జియా కాలంలో భూకంపం వచ్చినప్పుడు మీరు పారిపోయిన రీతిగా మీరిప్పుడు పారిపోతారు. కాని, నా దేవుడైన యెహోవా వస్తాడు. ఆయనయొక్క పవిత్ర జనులందరూ ఆయనతో ఉంటారు.
జెకర్యా 14:1-5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇదిగో యెహోవా దినమువచ్చుచున్నది, అందు మీయొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరిని సమకూర్చబోవుచున్నాను; పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగముమంది చెరపట్టబడి పోవుదురు; అయితే శేషించువారు నిర్మూలము కాకుండ పట్టణములో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధముచేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పుతట్టుననున్న ఒలీవ కొండమీద ఆయన పాదములుంచగా ఒలీవకొండ తూర్పుతట్టునకును పడమటితట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపుతట్టునకును సగముకొండ దక్షిణపుతట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ యొకటి యేర్పడును. కొండలమధ్య కనబడులోయ ఆజీలువరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు, అప్పుడు నీతోకూడ పరిశుద్ధులందరును వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును.