జెకర్యా 1:7-17

జెకర్యా 1:7-17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

దర్యావేషు పరిపాలనలో రెండవ సంవత్సరం శెబాతు అనే పదకొండవ నెల ఇరవై నాల్గవ రోజున ఇద్దో కుమారుడైన బెరక్యా, బెరక్యా కుమారుడైన జెకర్యా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు. రాత్రి సమయంలో నాకు దర్శనం వచ్చింది, అక్కడ నా ఎదుట ఎర్రని గుర్రంపై ఎక్కిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఒక లోయలోని గొంజిచెట్ల మధ్య నిలబడి ఉన్నాడు. అతని వెనుక ఎర్రని గుర్రాలు, గోధుమరంగు గుర్రాలు, తెలుపు గుర్రాలు ఉన్నాయి. అప్పుడు నేను, “నా ప్రభువా, ఇవి ఏంటి?” అని అడిగాను. నాతో మాట్లాడుతున్న ఆ దూత, “అవేంటో నీకు చూపిస్తాను” అని చెప్పాడు. అప్పుడు గొంజిచెట్ల మధ్యలో నిలబడిన వ్యక్తి, “ఇవి భూమి అంతా తిరగడానికి యెహోవా పంపించిన గుర్రాలు” అని చెప్పాడు. వారు గొంజిచెట్ల మధ్యలో నిలబడిన యెహోవా దూతతో, “మేము లోకమంతటా తిరిగి వచ్చాము. లోకమంతా ప్రశాంతంగా సమాధానంగా ఉండడం చూశాం” అన్నారు. అప్పుడు యెహోవా దూత, “సైన్యాల యెహోవా, డెబ్బై సంవత్సరాలుగా మీరు యెరూషలేము మీద, యూదా పట్టణాల మీద కోపంతో ఉన్నారు, ఇంకెన్నాళ్లు వరకు కనికరించకుండా ఉంటారు?” అని మనవి చేశాడు. కాబట్టి నాతో మాట్లాడుతున్న ఆ దూతకు యెహోవా దయగల ఆదరణ కలిగించే మాటలు చెప్పారు. ఆ తర్వాత నాతో మాట్లాడుతున్న దూత ఇలా అన్నాడు, “నీవు ఈ మాటను ప్రకటించు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘యెరూషలేము, సీయోను గురించి నేనెంతో ఆసక్తి కలిగి ఉన్నాను. నిశ్చింతగా బ్రతుకుతున్న ఇతర జాతులపై నేను చాలా కోపంగా ఉన్నాను. గతంలో నేను కొంచెమే కోప్పడ్డాను, కానీ వారు ఆ శిక్షను చాలా తీవ్రం చేసుకున్నారు.’ “కాబట్టి యెహోవా చెప్పే మాట ఇదే: ‘నేను కనికరంతో యెరూషలేము వైపు తిరుగుతాను, అక్కడ నా మందిరం తిరిగి కట్టబడుతుంది. యెరూషలేము మీద నిర్మాణకులు కొలతలు వేస్తారు’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు. “ఇది కూడా నీవు ప్రకటించు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘నా పట్టణాలు మళ్ళీ అభివృద్ధితో నిండుతాయి, యెహోవా మళ్ళీ సీయోనును ఆదరిస్తారు, యెరూషలేమును ఎన్నుకుంటారు.’ ”

జెకర్యా 1:7-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం శెబాటు అనే 11 వ నెల 24 వ రోజున యెహోవా వాక్కు బెరక్యా కొడుకు, ఇద్దో మనుమడు, ప్రవక్త అయిన జెకర్యాకు ప్రత్యక్షమయింది. రాత్రి సమయంలో ఎర్రని గుర్రం ఎక్కిన ఒక వ్యక్తి నాకు కనబడ్డాడు. అతడు లోయలో ఉన్న గొంజి చెట్లలో నిలబడి ఉన్నాడు. అతని వెనుక ఎర్రని గుర్రాలు, చుక్కలు ఉన్న గుర్రాలు, తెల్లని గుర్రాలు కనబడ్డాయి. అప్పుడు నేను “స్వామీ, ఇవి ఏమిటి?” అని అడిగినప్పుడు నాతో మాట్లాడే దూత “ఇవి ఏమిటో నేను నీకు చెబుతాను” అన్నాడు. అప్పుడు గొంజి చెట్లలో నిలబడి ఉన్న వ్యక్తి “ఇవి లోకమంతా సంచరించడానికి యెహోవా పంపిన గుర్రాలు” అని చెప్పాడు. అప్పుడు అవి గొంజి చెట్ల మధ్య నిలబడి ఉన్న యెహోవా దూతతో “మేము లోకమంతా సంచరించి వచ్చాము. లోకంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ప్రశాంతంగా ఉన్నారు” అన్నాడు. అప్పుడు యెహోవా దూత “సేనల ప్రభువు యెహోవా, 70 సంవత్సరాల నుండి నీవు యెరూషలేము మీదా, యూదా పట్టణం మీదా కోపగిస్తూ ఉన్నావు. ఎంతకాలం పాటు వాళ్ళపై కనికరం చూపకుండా ఉంటావు?” అని వేడుకున్నాడు. నాతో మాటలాడిన దూతకు యెహోవా ఆదరణకరమైన సున్నితమైన మాటలతో జవాబిచ్చాడు. అప్పుడు నాతో మాట్లాడుతున్న దూత నాతో ఇలా అన్నాడు “నువ్వు ఈ విధంగా ప్రకటించాలి, సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు. నాకు యెరూషలేము, సీయోనుల విషయంలో అమితమైన ఆసక్తి ఉంది. ఏమీ పట్టనట్టు ఉన్న ఇతర దేశాల ప్రజలపై నాకు తీవ్రమైన కోపం ఉంది. ఇంతకు ముందు నాకున్న కోపం స్వల్పమే గానీ వారు కీడును వృద్ది చేసుకున్నారు. కాబట్టి యెహోవా చెప్పేది ఏమిటంటే, కనికరం చూపాలన్న ఆసక్తితో నేను యెరూషలేము వైపు చూస్తున్నాను. అందులో నా మందిరాన్ని కడతారు. యెరూషలేము మీద శిల్పకారులు కొలనూలు లాగి కొలతలు వేస్తారు. ఇది యెహోవా వాక్కు. నీవు ఇంకా ప్రకటించాల్సింది ఏమిటంటే, ఇకపై నా పట్టణాలు మరింత ఎక్కువగా భోగభాగ్యాలతో నిండి పోతాయి. యెహోవా సీయోనుకు ఓదార్పు కలిగిస్తాడు. యెరూషలేముపై ఆయన మరింత మక్కువ చూపుతాడు.”

జెకర్యా 1:7-17 పవిత్ర బైబిల్ (TERV)

పర్షియా రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం పదకొండవ నెల (షెబాటు) ఇరవై నాల్గవ రోజున జెకర్యా మరో వర్తమానాన్ని యెహోవానుండి అందుకున్నాడు. (జెకర్యా తండ్రి బెరక్యా, బెరక్యా తండ్రి ప్రవక్త అయిన ఇద్దో.) రాత్రి వేళ ఒకడు ఎర్రగుర్రమునెక్కి స్వారీచేయటం నేను చూశాను. అతడు లోయలోని కదంబ చెట్ల మధ్య నిలుచున్నాడు. అతని వెనుక ఎర్రగుర్రాలు, చుక్కలు చుక్కలుగల గుర్రాలు మరియు తెలుపు గుర్రాలు ఉన్నాయి. “అయ్యా, ఈ గుర్రాలు ఏమిటి?” అని నాతో మాట్లాడుతున్న దేవదూతను నేను అడిగాను. అప్పుడు దేవదూత నాతో మాట్లాడుతూ, “ఈ గుర్రాలు ఏనిటో నేను నీకు చెపుతాను” అని అన్నాడు. అప్పుడు కదంబచెట్లమధ్య నిలుచున్న మనిషి, “యెహోవా ఈ గుర్రాలను భూలోకమంతా ఇటు అటు తిరగటానికి పంపించాడు” అని చెప్పాడు. తరువాత కదంబ చెట్ల మధ్య నిలుచున్న యెహోవా దూతతో ఆ గుర్రాలు మాట్లాడాయి. “మేము భూలోకమంతా సంచరించాము. అంతా సవ్యంగా, శాంతంగా ఉంది” అని అవి చెప్పాయి. అందుకు యెహోవా దూత, “ప్రభువా! యెరూషలేమును, యూదా నగరాలను ఓదార్చటానికి నీకు ఇంకా ఎంతకాలం పడుతుంది? ఇప్పటికి డెబ్బైయేండ్లగా ఈ నగరాలపై నీ కోపాన్ని చూపిస్తూ వచ్చావే” అన్నాడు. అప్పుడు నాతో మాట్లాడుతూ వున్న దేవదూతకు యెహోవా సమాధానం చెప్పాడు. యెహోవా మంచివైన, ఓదార్పు మాటలు చెప్పాడు. తరువాత దేవదూత నాతో ఇలా అన్నాడు: ఈ విషయాలను ప్రజలకు చెప్పు. సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెపుతున్నాడు: “యెరూషలేముపట్ల, సీయోనుపట్ల నాకు గాఢమైన ఆసక్తి ఉంది. మిక్కిలి క్షేమంగా ఉన్నామని భావించే దేశాలపట్ల నేను చాలా కోపంగా వున్నాను. నాకు కొంచెం కోపం వచ్చినప్పుడు. నా జనులను శిక్షించటానికి నేను ఆ రాజ్యాలను వినియోగించాను. కాని ఆ రాజ్యాలు వీరికి చాలా హాని చేశాయి.” కాబట్టి యెహోవా ఏమి చెపుతున్నాడంటే, “నేను ప్రేమతో యెరూషలేముకు తిరిగి వచ్చి ఆమెను ఓదార్చుతాను. యెరూషలేము మళ్లీ నిర్మింపబడుతుంది. మరియు నా ఆలయం అక్కడ కట్టబడుతుందని సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు” అని చెప్పు. “ప్రజలకు ఈ విషయాలు కూడా చెప్పు, సర్వశక్తిమంతుడైన యెహోవా, ‘నా పట్టణాలు మళ్లీ భాగ్యవంత మవుతాయి. నేను సీయోనును ఓదార్చుతాను. నేను యెరూషలేమును నా ప్రత్యేక నగరంగా ఎంపిక చేసుకుంటాను’” అని చెపుతున్నాడు.

జెకర్యా 1:7-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరియు దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవ త్సరము శెబాటు అను పదకొండవ నెల యిరువది నాలుగవదినమున యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జెకర్యాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. –రాత్రి ఎఱ్ఱని గుఱ్ఱమునెక్కిన మనుష్యు డొకడు నాకు కనబడెను; అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలువబడియుండగా అతని వెనుక ఎఱ్ఱని గుఱ్ఱములును చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములును తెల్లని గుఱ్ఱములును కనబడెను. అప్పుడు–నా యేలినవాడా, యివి ఏమని నేనడుగగా నాతో మాటలాడు దూత–ఇవి ఏమియైనది నేను నీకు తెలియజేతుననెను. అప్పుడు గొంజి చెట్లలో నిలువబడియున్నవాడు–ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుఱ్ఱములని చెప్పెను. అవి గొంజిచెట్లమధ్యను నిలువబడిన యెహోవాదూతను చూచి–మేము లోకమంతట తిరుగులాడివచ్చియున్నాము; ఇదిగో లోకులందరు శాంతముకలిగి నిమ్మళముగా ఉన్నారని చెప్పెను. అందుకు యెహోవాదూత – సైన్యములకధిపతియగు యెహోవా, డెబ్బది సంవత్సరములనుండి నీవు యెరూషలేముమీదను యూదా పట్టణములమీదను కోపముంచియున్నావే; యిక ఎన్నాళ్లు కనికరింపకయుందువు అని మనవిచేయగా యెహోవా నాతో మాటలాడిన దూతకు ఆదరణయైన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను. కాబట్టి నాతో మాటలాడుచున్నదూత నాతో ఇట్లనెను–నీవు ప్రకటన చేయ వలసినదేమనగా–సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు – నేను యెరూషలేము విషయములోను సీయోనువిషయములోను అధికాసక్తి కలిగియున్నాను; నిమ్మళముగా ఉన్న అన్యజనులమీద నేను బహుగా కోపించుచున్నాను; ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడుచేయవలెనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి. కాబట్టి యెహోవా సెలవిచ్చున దేమనగా–వాత్సల్యముగలవాడనై నేను యెరూషలేముతట్టు తిరిగియున్నాను; అందులో నా మందిరము కట్టబడును; యెరూషలేముమీద శిల్పకారులు నూలు సాగ లాగుదురు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా –ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును, ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును.