జెకర్యా 1:1-6

జెకర్యా 1:1-6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

దర్యావేషు పరిపాలన రెండవ సంవత్సరం ఎనిమిదో నెలలో, ఇద్దో కుమారుడు బెరక్యా, బెరక్యా కుమారుడైన జెకర్యా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు: “యెహోవా మీ పూర్వికుల మీద చాలా కోపంగా ఉన్నారు. కాబట్టి నీవు ఈ ప్రజలతో ఇలా చెప్పు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను’ అని సైన్యాల యెహోవా అంటున్నారు. ప్రవక్తలు మీ పూర్వికులతో, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘మీ చెడు మార్గాలను విడిచిపెట్టి, మీ చెడు అలవాట్లన్నింటినీ మానుకోండి’ అని చెప్పినప్పుడు వినని, పట్టించుకోని మీ పూర్వికుల్లా మీరు ఉండకండి, అని యెహోవా ప్రకటిస్తున్నారు. ఇప్పుడు మీ పూర్వికులు ఏమయ్యారు? ఆ ప్రవక్తలు ఏమయ్యారు, వారు ఎల్లకాలం బ్రతికి ఉంటారా? అయితే నా సేవకులైన ప్రవక్తలకు నేను ఆదేశించిన మాటలు శాసనాలు మీ పూర్వికుల విషయంలో నెరవేరలేదా? “అవి నెరవేరినప్పుడు వారు పశ్చాత్తాపపడి, ‘మన ప్రవర్తనకు మన పనులకు తగినట్లుగా సైన్యాల యెహోవా తాను చేయాలనుకున్న ప్రకారం మనకు చేశారు’ అని చెప్పుకున్నారు.”

జెకర్యా 1:1-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

దర్యావేషు పాలించే కాలంలో రెండవ సంవత్సరం ఎనిమిదవ నెలలో యెహోవా వాక్కు బెరక్యా కొడుకు, ఇద్దో మనుమడు, ప్రవక్త అయిన జెకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన వాక్కు. “యెహోవా మీ పూర్వీకుల మీద తీవ్రంగా కోపం తెచ్చుకున్నాడు. కాబట్టి నువ్వు వాళ్ళతో ఇలా చెప్పు. సేనల ప్రభువు యెహోవా సెలవిచ్చేది ఏమిటంటే, మీరు నావైపు తిరిగిన పక్షంలో నేను మీ వైపు తిరుగుతాను. ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు. మీరు మీ పూర్వీకుల వలే ఉండవద్దు. పూర్వికులైన ప్రవక్తలు ఇలా ప్రకటించారు. సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, మీ దుర్మార్గతను, మీ దుష్ట క్రియలను మానుకుని ప్రవర్తించమని వారికి ప్రకటించినప్పటికీ వాళ్ళు వినలేదు. నా మాట ఆలకించలేదు. ఇదే యెహోవా వాక్కు.” “మీ పితరులు ఏమయ్యారు? ప్రవక్తలు కలకాలం జీవిస్తారా? అయినప్పటికీ నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలు, కట్టడలు మీ పూర్వీకుల విషయంలో నెరవేరాయి గదా. అవి నెరవేరినప్పుడు వాళ్ళు ‘మళ్ళీ మన ప్రవర్తన బట్టి, క్రియలను బట్టి, యెహోవా మనకు చేయాలని సంకల్పించినదంతా మనకు చేశాడు’ అని చెప్పుకున్నారు.”

జెకర్యా 1:1-6 పవిత్ర బైబిల్ (TERV)

బెరక్యా కుమారుడు జెకర్యా. యెహోవా నుండి జెకర్యాకు ఒక వర్తమానం వచ్చింది. అది పర్షియా (పారశీకం) రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం, ఎనిమిదవ నెలలో వచ్చింది. (జెకర్యా తండ్రి పేరు బెరక్యా. బెరక్యా ఇద్దో కుమారుడు. ఇద్దో ఒక ప్రవక్త.) ఆ వర్తమానం ఇలా ఉంది. యెహోవా మీ పూర్వీకుల పట్ల చాలా కోపంగా ఉన్నాడు. కావున ప్రజలకు నీవు ఈ విషయాలు తప్పక చెప్పాలి. “మీరు నా వద్దకు తిరిగి రండి; నేను మీ వద్దకు వస్తాను” అని సర్వశక్తి మంతుడైన యెహోవా చెపుతున్నాడు. యెహోవా చెపుతున్నది యిదే. “మీ పూర్వీకులవలె మీరు ఉండవద్దు. గతంలో ప్రవక్తలు వారితో, ‘సర్వశక్తిమంతుడైన యెహోవా మీ చెడు జీవిత విధానాలను మార్చుకోమని మిమ్మల్ని కోరుతున్నాడు. చెడు కార్యాలు చేయటం మానండి!’ అని చెప్పాడు. కాని మీ పూర్వీకులు నా మాట వినలేదు.” యెహోవా చెపుతున్నది యిదే. “మీ పూర్వీకులు పోయారు. ఆ ప్రవక్తలూ శాశ్వతంగా జీవించలేదు. ప్రవక్తలు నా సేవకులు. మీ పూర్వీకులకు నా ధర్మాన్ని, బోధనలను తెలియజెప్పటానికి నేను వారిని వినియోగించుకొన్నాను. చివరకు మీ పూర్వీకులు గుణపాఠం నేర్చుకున్నారు. ‘సర్వశక్తిమంతుడైన యెహోవా చేస్తానని చెప్పిన విషయాలు చేశాడు. మేము జీవించిన పద్ధతికి, మేము చేసిన చెడు పనులకు ఆయన మమ్మల్ని శిక్షించాడు’ అని వారు చెప్పారు. కావున వారు దేవుని వద్దకు తిరిగి వచ్చారు.”

జెకర్యా 1:1-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జెకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా –యెహోవా మీపితరులమీద బహుగా కోపించెను. కాబట్టి నీవు వారితో ఇట్లనుము –సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున దేమనగా–మీరు నాతట్టు తిరిగినయెడల నేను మీతట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీరు మీపితరులవంటివారై యుండవద్దు; పూర్వికులైన ప్రవక్తలు–సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–మీ దుర్మార్గ తను మీ దుష్‌క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించక పోయిరి; ఇదే యెహోవా వాక్కు. మీపితరు లేమైరి? ప్రవక్తలు నిత్యము బ్రదుకుదురా? అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలును కట్టడలును మీపితరుల విషయములో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి–మన ప్రవర్తననుబట్టియు క్రియలనుబట్టియు యెహోవా మనకు చేయదలచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసియున్నాడని చెప్పుకొనిరి.