తీతుకు 2:1-5

తీతుకు 2:1-5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

నీవైతే స్వచ్ఛమైన బోధను అనుసరించి బోధించాలి. వృద్ధులైన పురుషులకు, వారు తమ కోరికలను అదుపులో ఉంచుకునేవారిగా, గౌరవించదగినవారిగా, స్వీయ నియంత్రణ కలిగినవారిగా విశ్వాసంలో, ప్రేమలో, ఓర్పులో స్థిరంగా ఉండమని బోధించు. అదే విధంగా, వృద్ధ స్త్రీలకు, భక్తి జీవితాన్ని కలిగి ఉండి, అపవాదులు వేసేవారిగా లేదా మద్యానికి బానిసలుగా ఉండకుండా, ఏది మంచిదో దానిని బోధించేవారిగా ఉండమని బోధించు. అప్పుడు వారు యవ్వన స్త్రీలకు తమ భర్తలను బిడ్డలను ప్రేమించుమని, స్వీయ నియంత్రణ కలిగి పవిత్రులుగా ఉండమని, తమ గృహాలలో పనులను చేసుకుంటూ దయ కలిగి ఉండమని, తన భర్తలకు విధేయత కలిగి ఉండమని బోధించగలరు, అప్పుడు దేవుని వాక్యాన్ని ఎవరూ దూషించలేరు.

తీతుకు 2:1-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అయితే నీవు ఆరోగ్యకరమైన ఉపదేశానికి అనుకూలమైన సంగతులను బోధించు. వృద్ధులు నిగ్రహం కలిగి, గౌరవపూర్వకంగా, వివేకంతో మెలుగుతూ విశ్వాసం, ప్రేమ, సహనంలో శుద్ధంగా ఉండాలి. అలాగే వృద్ధ స్త్రీలు గౌరవప్రదంగా, పుకార్లు పుట్టించేవారుగా కాకుండా ఉండాలి. అస్తమానం మద్యపానంలో మునిగి తేలుతూ ఉండకూడదు. నడవడిలో భయభక్తులు గలిగి మంచి విషయాలు నేర్పుతూ ఉండాలి. దేవుని వాక్యానికి చెడ్డ పేరు రాకుండేలా తమ భర్తలను, పిల్లలను ప్రేమతో చూసుకోవాలని యువతులను ప్రోత్సహిస్తూ, మనసును అదుపులో ఉంచుకుంటూ, శీలవతులుగా, తమ ఇంటిని శ్రద్ధగా చక్కబెట్టుకొనేవారుగా, తమ భర్తలకు లోబడుతూ ఉండాలని వృద్ధ స్త్రీలు వారికి బోధించాలి.

తీతుకు 2:1-5 పవిత్ర బైబిల్ (TERV)

ఉత్తమ సిద్ధాంతాల ప్రకారం సత్యాన్ని అనుసరించమని ప్రజలకు బోధించు. వృద్ధులకు శాంతంగా ఉండమని, గౌరవంగా జీవించుని, ఆత్మనిగ్రహం, సంపూర్ణమైన విశ్వాసం, ప్రేమ, సహనము కలిగి ఉండమని బోధించు. అదే విధంగా వృద్ధ స్త్రీలకు పవిత్రంగా జీవించమని, ఇతర్లను దూషించకూడదని, త్రాగుబోతులు కాకూడదని, మంచిని మాత్రమే ఉపదేశమిమ్మని చెప్పు. అలా చేస్తే వాళ్ళు యౌవన స్త్రీలకు తమ భర్తల్ని, తమ పిల్లల్ని ప్రేమించాలని, ఆత్మనిగ్రహం కలిగి ఉండి పవిత్రంగా జీవించాలని, తమ గృహనిర్వాహక కర్తవ్యాలను పూర్తి చెయ్యాలని, దయను అలవరచుకోవాలని, వారి భర్తలకు విధేయతగా ఉండాలని ఉపదేశించి శిక్షణనిస్తారు. అప్పుడు దైవసందేశాన్ని ఎవ్వరూ విమర్శించరు.

తీతుకు 2:1-5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నీవు హితబోధకనుకూలమైన సంగతులను బోధించుము. ఏలాగనగా వృద్ధులు మితానుభవముగలవారును, మాన్యులును, స్వస్థబుద్ధిగలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపములేనివారునై యుండవలెననియు, ఆలాగుననే వృద్ధీస్తలు కొండెకత్తెలును, మిగుల మద్యపానాసక్తులునై యుండక, ప్రవర్తనయందు భయభక్తులుగలవారై యుండవలెననియు, దేవునివాక్యము దూషింపబడకుండునట్లు, యౌవనస్త్రీలు తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థబుద్ధిగలవారును పవిత్రులును ఇంట ఉండి పనిచేసికొనువారును మంచివారునై యుండవలెనని బుద్ధిచెప్పుచు, మంచి ఉపదేశముచేయువారునై యుండవలెననియు బోధించుము.