పరమగీతము 8:1-14

పరమగీతము 8:1-14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఒకవేళ నీవు నాకు సోదరుడిలా ఉంటే, నా తల్లి స్తనముల దగ్గర పెంచబడిన వాడవైయుంటే! అప్పుడు, నేను నిన్ను బయట కనుగొని ఉంటే, నిన్ను ముద్దాడేదాన్ని, నన్ను ఎవరూ నిందించేవారు కారు. నేను నిన్ను తోలుకొని నాకు ఉపదేశం చేసిన, నా తల్లి ఇంటికి తీసుకెళ్లేదాన్ని. నీవు త్రాగడానికి నీకు సుగంధద్రవ్యాలు కలిపిన ద్రాక్షరసాన్ని, దానిమ్మపండ్ల మకరందం ఇచ్చేదాన్ని. ఆయన ఎడమ చేయి నా తల క్రింద ఉంచాడు, కుడిచేతితో నన్ను కౌగిలించుకున్నాడు. యెరూషలేము కుమార్తెలారా! మీతో ప్రమాణము చేయిస్తున్నాను: సరియైన సమయం వచ్చేవరకు ప్రేమను లేపకండి, మేల్కొల్పకండి. తన ప్రియుని ఆనుకుని అరణ్యంలో నుండి నడచి వస్తున్నది ఎవరు? ఆపిల్ చెట్టు క్రింద నేను నిన్ను లేపాను; అక్కడ నీ తల్లి నిన్ను గర్భం దాల్చింది, అక్కడ ప్రసవ వేదనలో ఆమె నీకు జన్మనిచ్చింది. నన్ను నీ హృదయం మీద ఒక ముద్రలా, మీ చేతికి రాజ ముద్రలా ఉంచుకో; ఎందుకంటే ప్రేమ మరణంలా బలమైనది, దాని అసూయ సమాధిలా క్రూరమైనది. ఇది మండుతున్న అగ్నిలా, శక్తివంతమైన మంటలా కాలుతుంది. పెరుగుతున్న జలాలు ప్రేమను అణచివేయలేవు; నదీజలాలు ప్రేమను తుడిచివేయలేవు. ప్రేమకు ప్రతిగా తనకున్నదంతా ఇచ్చినా, దానికి తిరస్కారమే లభిస్తుంది. మాకో చిన్న చెల్లెలుంది, దానికింకా స్తనములు రాలేదు. దానికి పెళ్ళి నిశ్చయమైతే ఏం చేయాలి? ఒకవేళ ఆమె ప్రాకారమైతే, ఆమెపై మేము వెండి గోపురం కట్టిస్తాము. ఒకవేళ ఆమె ద్వారం అయితే, దేవదారు పలకలతో దానికి భద్రత ఏర్పరుస్తాము. నేను ప్రాకారాన్ని, నా స్తనములు గోపురాల్లాంటివి. అందుకే అతని దృష్టికి క్షేమం పొందదగినదానిగా ఉన్నాను. బయల్-హామోను దగ్గర సొలొమోనుకు ద్రాక్షతోట ఉంది; అతడు తన ద్రాక్షతోటను కౌలుకిచ్చాడు. దాని ఫలానికి ఒక్కొక్కడు వెయ్యి వెండి షెకెళ్ళ శిస్తు చెల్లించాలి. కాని, నా ద్రాక్షవనం నా స్వాధీనంలోనే ఉంది; సొలొమోను రాజా, నీ వెయ్యి షెకెళ్ళు నీకే చెందుతాయి. వాటిని చూసుకునే వారికి రెండువందలు షెకెళ్ళు గిట్టుతాయి. ఉద్యానవనాల్లో నివసించేదానా నీ చెలికత్తెలు నీతో ఉండగా, నీ స్వరం విననివ్వు. నా ప్రియుడా, దూరంగా రా, జింకలా, దుప్పిలా పరిమళముల పర్వతాల మీదుగా గంతులు వేస్తూ రా.

పరమగీతము 8:1-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) నా తల్లి పాలు తాగిన నా సోదరునిలా నువ్వు నాకుంటే ఎంత బాగు! అప్పుడు నువ్వు బయట ఎదురు పడితే నీకు ముద్దులిచ్చేదాన్ని. అప్పుడు నన్నెవరూ నిందించరు. నేను నిన్ను మా పుట్టింటికి తీసుకెళ్తాను. నువ్వు నాకు పాఠాలు నేర్పిస్తావు. తాగడానికి నీకు సుగంధ ద్రాక్షారసాన్ని, నా దానిమ్మ పళ్ళ రసాన్ని ఇస్తాను. (యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది). అతని ఎడమచెయ్యి నా తల కింద ఉంది. అతని కుడిచేత్తో నన్ను ఆలింగనం చేసుకున్నాడు (యువతి ఇతర స్త్రీలతో మాట్లాడుతూ ఉంది) యెరూషలేము ఆడపడుచులారా, మీచేత ఒట్టు వేయించుకుంటున్నాను. మా ప్రేమ పని ముగిసేంత వరకూ మీరు మమ్మల్ని ఆటంకపరచవద్దు. [ఆరవ భాగం-ముగింపు] (యెరూషలేము స్త్రీలు మాట్లాడుతున్నారు) తన ప్రియుని మీద ఆనుకుని ఎడారి దారిలో వచ్చేది ఎవరు? (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) ఆపిల్ చెట్టు కింద నువ్వు పడుకుని ఉంటే నేను నిన్ను లేపాను. అక్కడ నువ్వు మీ అమ్మ కడుపులో పడ్డావు. ఆమె నిన్ను అక్కడే ప్రసవించింది. నీ చేతిమీదున్న పచ్చబొట్టులా నీ గుండె మీద నా పచ్చబొట్టు పొడిపించుకో. ఎందుకంటే ప్రేమకు చావుకున్నంత బలముంది. మోహం పాతాళంతో సమానమైన తీవ్రత గలది. దాని మంటలు ఎగిసి పడతాయి. అది మండే అగ్నిజ్వాల. ఏ అగ్ని మంటలకన్నా అది తీవ్రమైనది. ఉప్పెన కూడా ప్రేమను ఆర్పలేదు. వరదలు దాన్ని ముంచలేవు. ప్రేమ కోసం ఎవడైనా తనకున్నదంతా ఇచ్చేసినా ఆ ప్రయత్నం శుద్ధ దండగ. (ఆ యువతి సోదరులు తమలో తాము మాట్లాడుకుంటున్నారు). మాకొక చిన్నారి చెల్లి ఉంది. ఆమె స్తనాలు ఇంకా పెరగలేదు. ఆమె నిశ్చితార్థం రోజున మా చెల్లి కోసం మేమేం చెయ్యాలి? ఆమె గోడలాంటిదైతే దానిమీద వెండి గోపురం కట్టిస్తాం. ఆమె తలుపులాంటిదైతే దేవదారు చెక్కతో దానికి గడులు పెడతాం. (యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.) నేను గోడలా ఉండేదాన్ని. అయితే ఇప్పుడు నా స్తనాలు గోపురాల్లా ఉన్నాయి. కాబట్టి నేను పూర్తిగా అతని దృష్టికి సిద్ధంగా ఉన్నా. బయల్ హామోనులో సొలొమోనుకు ఒక ద్రాక్షావనం ఉంది. అతడు దాన్ని రైతులకు కౌలుకిచ్చాడు. ప్రతి రైతూ వెయ్యి వెండి నాణాలు కౌలు చెల్లించాలి. నా ద్రాక్షతోట నా సొంతం. సొలొమోనూ, ఆ వెయ్యి వెండి నాణాలు నీవే. దాన్ని కౌలు చేసేవారికి రెండు వందల నాణాలు గిట్టుతాయి. (ఆ యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతున్నాడు) ఉద్యానవనంలో పెరిగేదానా, నా మిత్రులు నీ స్వరం వింటున్నారు. నన్నూ విననీ. (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) ప్రియా, త్వరగా వచ్చెయ్యి. జింకలా, లేడిపిల్లలా సుగంధ పర్వతాల మీదుగా చెంగు చెంగున వచ్చెయ్యి.

పరమగీతము 8:1-14 పవిత్ర బైబిల్ (TERV)

నీవు నా తల్లి పాలు త్రాగిన నా సహోదరుడివైయుంటే, నీవు నాకు బయట అగుపిస్తే, నిన్ను నేను ముద్దాడగలిగి ఉండేదాన్ని. అప్పుడు నన్నెవరూ తప్పు పట్టేవారు కారు! నేను నిన్ను నాకు అన్నీ నేర్పిన మా తల్లి ఇంటి గదిలోనికి తీసుకుపోయి ఉండేదాన్ని. దానిమ్మ పళ్లరసంతో చేసిన సురభిళ మధువును నీకు ఇచ్చి ఉండేదాన్ని. అతను తన ఎడమ చేతిని నా తల క్రింద ఉంచి తన కుడిచేతితో నన్ను కౌగలించుకొంటాడు. యెరూషలేము స్త్రీలారా మీరు నాకొక వాగ్దానం చేయండి నా ప్రేమ స్వయం ప్రేరితమయ్యేదాకా, ప్రేమను జాగృతం చేయకండి ప్రేమను పురిగొల్పకండి. ఎడారి మార్గంలో, తన ప్రియుని ఆనుకొని వస్తున్న ఈ స్త్రీ ఎవరు? జల్దరు చెట్టు నీడలో నిన్ను తట్టి నే లేపాను. అచ్చటే నిన్ను మోసిన నీ తల్లి నిన్ను కన్నది. నీ హృదయ పీఠం మీద నా రూపం ముద్రించు, నీ వేలికి ముద్రికలా ధరించు. మృత్యువంత బలమైనది ప్రేమ పాతాళమంత కఠనమైంది ఈర్శ్య. అగ్ని జ్వాలల్లాంటివి దాని మంటలు అవి పెచ్చు మీరి మహాజ్వాల అవుతాయి. ఉప్పెన కూడా ప్రేమజ్వాలను ఆర్పజాలదు. నదీ జలాలూ ప్రేమను ముంచెత్తజాలవు. ఒకడు ప్రేమ కోసం తన సర్వస్వం ధారపోస్తే, అతణ్ణి ప్రజలు మూర్ఖుడిగా పరిగణించరు. ఎవడూ తప్పు పట్ట జాలడు! మాకు ఉన్నదొక చిన్న చెల్లెలు ఆమెకింకా యుక్త వయస్సు రాలేదు. ఆమెను వివాహం చేసుకొనుటకు ఒక పురుషుడు వస్తే, మా చెల్లెలి విషయంలో మేమేమి చెయ్యాలి? అది ప్రాకారమైతే, దాని చుట్టూ వెండి నగిషీ చేస్తాము అది తలుపైతే, దాని చుట్టూ దేవదారు పలకలతో అంచులు అలంకరిస్తాము. నేను ప్రాకారం వంటిదాన్ని నా వక్షోజాలు గోపుర ప్రాయాలు అతనికి నేనంటే తనివి, తృప్తి! బయలు హామోనులో సొలొమోనుకొక ద్రాక్షాతోట ఉంది. ఆ తోటనాతడు కొందరు రైతులకు కౌలుకిచ్చాడు. వారిలో ఒక్కొక్క రైతు వెయ్యి వెండి షెకెళ్లు ఇచ్చాడు. సొలొమోనూ, ఆ వెయ్యి షెకెళ్లూ నీవే ఉంచుకో, వాటిలో యిన్నూరేసి ఒక్కొక్క రైతుకు అతడు తెచ్చిన ద్రాక్షాలకోసం యివ్వు. నా ద్రాక్షాతోట నా స్వంతంగా ఉంటుంది! ద్రాక్షాతోటలో కూర్చున్న ఓ సఖీ, నీ చెలికత్తెలు నీ స్వరం వింటున్నారు, నీ మధుర స్వరాన్ని నన్నూ విననీయి. నా ప్రాణ స్నేహితుడా, వేగిరం వచ్చెయ్యి. జింకల్లా, లేడి పిల్లల్లా పరిమళవృక్ష సముదాయం పెరిగిన పర్వతాలపై నుంచి చెంగుచెంగున వచ్చెయ్యి.

పరమగీతము 8:1-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నా తల్లియొద్ద స్తన్యపానము చేసిన యొక సహోదరుని వలె నీవు నాయెడలనుండిన నెంతమేలు! అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును ఎవరును నన్ను నిందింపరు. నేను నీకు మార్గదర్శినౌదును నా తల్లియింట చేర్చుదును నీవు నాకు ఉపదేశము చెప్పుదువు సంభార సమ్మిళిత ద్రాక్షారసమును నా దాడిమఫలరసమును నేను నీకిత్తును. అతని యెడమచెయ్యి నా తలక్రింద నున్నది అతని కుడిచెయ్యి నన్ను కౌగిలించుచున్నది యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇచ్ఛపుట్టువరకు లేపకయు కలతపరచకయు నుందుమని నేను మీచేత ప్రమాణము చేయించుకొందును. తన ప్రియునిమీద ఆనుకొని అరణ్యమార్గమున వచ్చునది ఎవతె? జల్దరువృక్షము క్రింద నేను నిన్ను లేపితిని అచ్చట నీ తల్లికి నీవలన ప్రసవవేదన కలిగెను నిన్ను కనిన తల్లి యిచ్చటనే ప్రసవవేదన పడెను. ప్రేమ మరణమంత బలవంతమైనది ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది దాని జ్వాలలు అగ్నిజ్వాలా సమములు అది యెహోవా పుట్టించు జ్వాల నీ హృదయముమీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. అగాధసముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాని ముంచివేయజాలవు ప్రేమకై యొకడు తన స్వాస్థ్యమంత ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. మాకొక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకను వయస్సు రాలేదు వివాహకాలము వచ్చినప్పుడు మేము దానివిషయమై యేమి చేయుదుము? అది ప్రాకారమువంటిదాయెనా? మేము దానిపైన వెండి గోపురమొకటి కట్టుదుము. అది కవాటమువంటిదాయెనా? దేవదారు మ్రానుతో దానికి అడ్డులను కట్టుదుము నేను ప్రాకారమువంటిదాననైతిని నా కుచములు దుర్గములాయెను అందువలన అతనిదృష్టికి నేను క్షేమము నొందదగినదాననైతిని. బయలు హామోనునందు సొలొమోను కొక ద్రాక్షావనము కలదు అతడు దానిని కాపులకిచ్చెను దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు వేయి రూపాయిలు తేవలెను. నా ద్రాక్షావనము నా వశమున ఉన్నది సొలొమోనూ, ఆ వేయి రూపాయిలు నీకే చెల్లును. దానిని కాపుచేయువారికి రెండువందలు వచ్చును. ఉద్యానవనములలో పెంచబడినదానా, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు నన్నును దాని విననిమ్ము. నా ప్రియుడా, త్వరపడుము లఘువైన యిఱ్ఱివలె ఉండుము గంధవర్గవృక్ష పర్వతములమీద గంతులువేయు లేడిపిల్లవలె ఉండుము.