పరమగీతము 3:1-4 - Compare All Versions
పరమగీతము 3:1-4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రాత్రంతా నేను పడుకుని నా హృదయం ప్రేమించేవాని కోసం నేను చూశాను; ఆయన కోసం చూశాను కాని ఆయన రాలేదు. నేను ఇప్పుడే లేచి పట్టణం వైపు వెళ్తాను, పట్టణ వీధుల్లో రహదారుల్లో వెదకుతాను; నా హృదయం ప్రేమిస్తున్నవాని కోసం నేను వెదకుతాను. కాబట్టి నేను ఆయన కోసం వెదికాను కాని ఆయన కనపడలేదు. పట్టణంలో గస్తీ తిరుగుతున్న కావలివారు నాకు ఎదురుపడితే “మీరు నా ప్రాణప్రియుని చూశారా?” అని వారినడిగాను. నేను దాదాపుగా వారిని దాటి వెళ్లాను అప్పుడు నా ప్రేమికుడు నాకు కనిపించాడు. ఆయనను గట్టిగా పట్టుకున్నాను ఆయనను నా తల్లి గృహానికి, నన్ను కనిన గది లోనికి తెచ్చే వరకు నేను వదల్లేదు.
పరమగీతము 3:1-4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
(యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) రాత్రిపూట పడుకుని నేను నా ప్రాణప్రియుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అతని కోసం నేనెంతగానో ఎదురు చూసినా అతడు కనబడలేదు. “నేను లేచి వీధుల గుండా పట్టణమంతా తిరిగి నా ప్రాణప్రియుడి కోసం వెతుకుతాను” అనుకున్నాను. నేనతన్ని వెతికినా అతడు కనబడలేదు. పట్టణంలో గస్తీ తిరిగేవాళ్ళు నాకెదురు పడ్డారు. “మీరు నా ప్రాణప్రియుని చూశారా?” అని అడిగాను. నేను వాళ్ళ దగ్గర నుంచి కొంచెం దూరం ముందుకు వెళితే, ప్రాణప్రియుడు నాకు కనిపించాడు. నేనతన్ని గట్టిగా పట్టుకుని వదలిపెట్టక నా పుట్టింటికి తీసుకొచ్చాను. నేను కడుపున పడ్డ పడకగది లోకి తీసుకొచ్చాను.
పరమగీతము 3:1-4 TERV (పవిత్ర బైబిల్)
రాత్రి నా పరుపు మీద, నేను ప్రేమించిన వానికోసం వెదికాను. అతని కోసం చూశాను, కాని అతణ్ణి కనుగొనలేకపోయాను! ఇప్పుడు లేచి, నగరమంతా తిరుగుతాను. వీధుల్లోను కూడలి స్థలాల్లోను సంత వీధుల్లోనూ నేను ప్రేమించిన వ్యక్తికోసం చూస్తాను. అతని కోసం చూశాను, కాని అతణ్ణి కనుక్కోలేక పోయాను! నగరంలో పాహరా తిరిగే కావలివాళ్లు నన్ను చూశారు. వారినడిగాను, “నేను ప్రేమించిన వ్యక్తిని మీరు చూశారా?” అని. కావలివాళ్లను దాటిన వెంటనే నేను ప్రేమించిన వ్యక్తిని కనుక్కున్నాను! అతణ్ణి పట్టుకున్నాను. అతణ్ణి పోనివ్వలేదు, నా తల్లి ఇంటికి అతణ్ణి తీసుకొని వచ్చాను. నన్ను కన్న తల్లి గదికి తీసుకొని వచ్చాను.
పరమగీతము 3:1-4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకితిని వెదకినను అతడు కనబడక యుండెను. నేనిప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెదకుదును సంతవీధులలోను రాజవీధులలోను తిరుగుదును నా ప్రాణప్రియుని వెదకుదును అని నేననుకొంటిని. నేను వెదకినను అతడు కనబడలేదు. పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురు పడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా? అని నేనడిగి తిని నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను వదలిపెట్టక నేనతని పట్టుకొంటిని నా తల్లి యింటికతని తోడుకొని వచ్చితిని నన్ను కనినదాని యరలోనికి తోడుకొని వచ్చితిని.