రోమా 9:1-7
రోమా 9:1-7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నేను క్రీస్తులో సత్యమే చెప్తున్నాను అబద్ధం చెప్పడం లేదు, పరిశుద్ధాత్మ ద్వారా నా మనస్సాక్షి దానిని నిర్ధారిస్తుంది. నా హృదయంలో ఎంతో దుఃఖం తీరని ఆవేదన ఉన్నాయి. నా సొంత జాతి వారైన ఇశ్రాయేలీయుల కోసం క్రీస్తు నుండి విడిపోయి శపించబడిన వానిగా ఉండాలని కోరుకుంటాను. వారు ఇశ్రాయేలు ప్రజలు, వారు దత్తపుత్రులుగా చేయబడినవారు; దైవికమైన మహిమ, నిబంధనలు, పొందిన ధర్మశాస్త్రం, దేవాలయంలో ఆరాధన, వాగ్దానాలు వారివే. పితరులు వారి వారే, అందరికి దేవుడైన క్రీస్తు మానవునిగా వారిలోనే పుట్టారు. ఆయన నిత్యం స్తోత్రార్హుడు! ఆమేన్. దేవుని మాట విఫలమైనదని కాదు. ఇశ్రాయేలు నుండి వచ్చిన వారందరు ఇశ్రాయేలీయులు కారు. అబ్రాహాము సంతతి అయినంత మాత్రాన వారు అబ్రాహాముకు పిల్లలు అవ్వరు. అయితే, “ఎందుకంటే ఇస్సాకు మూలంగా కలిగిన వారిగానే నీ సంతానం లెక్కించబడుతుంది.”
రోమా 9:1-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా హృదయంలో గొప్ప దుఃఖం, తీరని వేదన ఉన్నాయి. నేను అబద్ధమాడడం లేదు, క్రీస్తులో నిజమే చెబుతున్నాను. పరిశుద్ధాత్మలో నా మనస్సాక్షి నాతో కలిసి సాక్షమిస్తున్నది. సాధ్యమైతే, శరీర సంబంధంగా నా సోదరులు, నా సొంత జాతి వారి కోసం, క్రీస్తు నుండి వేరుపడి దేవుని శాపానికి గురి కావడానికి కూడా నేను సిద్ధమే. వీరు ఇశ్రాయేలీయులు. దత్తపుత్రత్వం, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్రం అనే బహుమానం, దైవారాధన ఆచారాలు, వాగ్దానాలు వీరివి. పూర్వీకులు వీరి వారే. శరీరరీతిగా క్రీస్తు వచ్చింది వీరిలో నుండే. ఈయన సర్వాధికారియైన దేవుడు, శాశ్వత కాలం స్తుతిపాత్రుడు, ఆమేన్. అయితే దేవుని మాట భంగమైనట్టు కాదు. ఇశ్రాయేలునుండి వచ్చిన వారంతా ఇశ్రాయేలీయులు కారు. అబ్రాహాముకు పుట్టిన వారంతా నిజమైన వారసులు కాదు, “ఇస్సాకు మూలంగా కలిగే వారినే నీ సంతానం అని పిలుస్తారు.”
రోమా 9:1-7 పవిత్ర బైబిల్ (TERV)
క్రీస్తు పేరట నేను నిజం చెపుతున్నాను. నేను అసత్యమాడటం లేదు. నా అంతరాత్మ పవిత్రాత్మ ద్వారా ఇది నిజమని సాక్ష్యం చెబుతోంది. నాలో చాలా దుఃఖం ఉంది. అంతంగాని ఆవేదన నా హృదయంలో ఉంది. నా జాతికి చెందిన నా సోదరుల కోసం దేవుడు నన్ను శపించినా, క్రీస్తు నుండి నన్ను వేరు చేసినా నాకు సంతోషమే. ఈ నా సోదరులు ఇశ్రాయేలు వంశానికి చెందిన వాళ్ళు. దేవుడు వాళ్ళను తన పుత్రులుగా చేసుకొని మహిమను, ఒడంబడికలను, ధర్మశాస్త్రాన్ని, ఆరాధనా విధానాన్ని ఇచ్చి వాగ్దానాలు చేసాడు. మూల పురుషులు వీళ్ళ వంశానికి చెందినవాళ్ళు. క్రీస్తు వీళ్ళ వంశంలో జన్మించాడు. క్రీస్తు అందరికీ దేవుడు. ఆయన్ని చిరకాలం అందరూ స్తుతించుగాక! ఆమేన్! ఇశ్రాయేలు జాతికి చెందిన వాళ్ళందర్ని దేవుడు తన ప్రజలుగా ఎన్నుకోలేదు. కాబట్టి దేవుని మాట పరాజయం పొందిందని మనమనకూడదు. లేక అబ్రాహాము సంతానమందరూ నిజంగా అబ్రాహాము సంతానమని మనమనలేము. కాని ఈ విషయంపై ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ఇస్సాకు వల్ల మాత్రమే నీ సంతానం గుర్తింపబడుతుంది.”
రోమా 9:1-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పు చున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైనయెడల, దేహసంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తునుండి వేరై శాపగ్రస్తుడనై యుండ గోరుదును. వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి. పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్. అయితే దేవునిమాట తప్పిపోయినట్టు కాదు; ఇశ్రాయేలు సంబంధులందరును ఇశ్రాయేలీయులు కారు. అబ్రాహాము సంతానమైనంత మాత్రముచేత అందరును పిల్లలు కారు గాని ఇస్సాకువల్లనైనది నీ సంతానము అనబడును