రోమా 8:12-30 - Compare All Versions
రోమా 8:12-30 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి సహోదరి సహోదరులారా, శరీరానుసారంగా జీవించడానికి మనం శరీరానికి రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా జీవిస్తే మీరు మరణిస్తారు. కాని ఒకవేళ ఆత్మ ద్వారా శరీర సంబంధమైన చెడ్డక్రియలను చంపివేస్తే మీరు బ్రతుకుతారు. ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారే దేవుని బిడ్డలు. మీరు మరలా భయంలో జీవించడానికి, మీరు పొందిన ఆత్మ మిమ్మల్ని బానిసలుగా చేయదు కాని మీరు పొందిన ఆత్మ ద్వారా దత్తపుత్రులుగా చేయబడతారు. అప్పుడు ఆ ఆత్మ ద్వారా మనం, “అబ్బా, తండ్రీ” అని మొరపెడుతున్నాము. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యమిస్తున్నాడు. మనం పిల్లలమైతే వారసులం, అంటే దేవుని వారసులం; క్రీస్తు మహిమను మనం కూడా పొందడానికి ఆయనతో శ్రమపడితే క్రీస్తు సహ వారసులమవుతాం. మనలో ప్రత్యక్షం కాబోయే మహిమతో ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమలు ఎంత మాత్రం పోల్చదగినవి కావని నేను భావిస్తాను. దేవుని బిడ్డలు ప్రత్యక్షపరచబడాలని సృష్టి అంతా ఆతురతతో ఎదురుచూస్తూ ఉంది. తన ఇష్ట ప్రకారం కాక దానిని అప్పగించినవాని చిత్తప్రకారం నిరాశకు గురైన సృష్టి నిరీక్షణ కలిగి ఉంది. సృష్టి, నశించిపోవడమనే దాస్యం నుండి విడిపించబడి, దేవుని బిడ్డల మహిమలోనికి స్వాతంత్ర్యంలోనికి తీసుకురాబడుతుందనే ఆ నిరీక్షణ. నేటి వరకు సృష్టి అంతా ప్రసవ వేదన పడుతున్నట్లుగా మూల్గుతున్నదని మనకు తెలుసు. అది మాత్రమే కాదు, ఆత్మలో ప్రథమ ఫలం పొందిన మనం కూడా దత్తపుత్రులంగా అవ్వడానికి మన శరీరాల విమోచన కోసం ఆతురతగా ఎదురుచూస్తూ మన లోలోపల మూలుగుతున్నాము. ఈ నిరీక్షణలోనే మనం రక్షించబడ్డాము. అయితే కనబడే నిరీక్షణ ఎంత మాత్రం నిరీక్షణ కాదు. తాము చూస్తున్న వాటికోసం ఎవరు నిరీక్షిస్తారు? అయితే మన దగ్గర లేని దాని కోసం మనం నిరీక్షిస్తే ఓపికగా ఎదురుచూడగలము. అదే విధంగా మన బలహీనతల్లో ఆత్మ మనకు సహాయం చేస్తాడు. దేని గురించి ప్రార్థించాలో మనకు తెలియదు కాని, మన కోసం ఆత్మ తానే మాటల్లేని మూల్గులతో విజ్ఞాపన చేస్తున్నాడు. మన హృదయాలను పరిశోధించే ఆయనకు ఆత్మ యొక్క మనస్సు తెలుసు, ఎందుకనగా దేవుని ప్రజల కోసం దేవుని చిత్తప్రకారం ఆత్మ విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని ప్రేమించేవారికి అనగా దేవుని ఉద్దేశం ప్రకారం పిలువబడిన వారి మంచి జరిగేలా అన్నిటిని దేవుడు జరిగిస్తారని మనకు తెలుసు. అనేకులైన సహోదరి సహోదరుల మధ్యలో ఆయన ప్రథమ సంతానంగా ఉండాలని దేవుడు తాను ముందుగానే ఎరిగినవారిని తన కుమారుని స్వరూపానికి అనుగుణంగా ఉండేలా వారిని ముందుగానే నిర్ణయించారు. ఎవరిని ముందుగా నిర్ణయించారో వారిని ఆయన పిలిచారు; ఆయన ఎవరిని పిలిచారో వారిని నీతిమంతులుగా తీర్చారు; ఆయన ఎవరిని నీతిమంతులుగా తీర్చారో వారిని మహిమపరిచారు.
రోమా 8:12-30 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కాబట్టి సోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం దానికేమీ రుణపడి లేము. మీరు శరీరానుసారంగా నడిస్తే చావుకు సిద్ధంగా ఉన్నారు గానీ ఆత్మ చేత శరీర కార్యాలను చంపివేస్తే మీరు జీవిస్తారు. దేవుని ఆత్మ ఎందరిని నడిపిస్తాడో, వారంతా దేవుని కుమారులుగా ఉంటారు. ఎందుకంటే, మళ్లీ భయపడడానికి మీరు పొందింది దాస్యపు ఆత్మ కాదు, దత్తపుత్రాత్మ. ఆ ఆత్మ ద్వారానే మనం, “అబ్బా! తండ్రీ!” అని దేవుణ్ణి పిలుస్తున్నాం. మనం దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో సాక్షమిస్తున్నాడు. మనం పిల్లలమైతే వారసులం కూడా. అంటే దేవుని వారసులం. అలాగే క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో కష్టాలు అనుభవిస్తే, క్రీస్తు తోటి వారసులం. మనకు వెల్లడి కాబోయే మహిమతో ఇప్పటి కష్టాలు పోల్చదగినవి కావని నేను భావిస్తున్నాను. దేవుని కుమారులు వెల్లడయ్యే సమయం కోసం సృష్టి బహు ఆశతో ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే తన ఇష్టం చొప్పున కాక దాన్ని లోబరచినవాడి మూలంగా వ్యర్థతకు గురైన సృష్టి, నాశనానికి లోనైన దాస్యం నుండి విడుదల పొంది, దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వేచ్ఛ పొందుతాననే నిరీక్షణతో ఉంది. ఇప్పటి వరకూ సృష్టి అంతా ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నదని మనకు తెలుసు. అంతే కాదు, ఆత్మ ప్రథమ ఫలాలను పొందిన మనం కూడా దత్తపుత్రత్వం కోసం, అంటే మన శరీర విమోచన కోసం కనిపెడుతూ లోలోపల మూలుగుతున్నాం. ఎందుకంటే మనం ఈ ఆశాభావంతోనే రక్షణ పొందాం. మనం ఎదురు చూస్తున్నది కనిపించినప్పుడు ఇక ఆశాభావంతో పని లేదు. తన ఎదురుగా కనిపించే దాని కోసం ఎవరు ఎదురు చూస్తాడు? మనం చూడని దాని కోసం ఎదురు చూసేవారమైతే ఓపికతో కనిపెడతాము. అలాగే పరిశుద్ధాత్మ కూడా మన బలహీనతలో సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే మనం సరిగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాని, మాటలతో పలకడానికి వీలు లేని మూలుగులతో పరిశుద్ధాత్మ మన పక్షంగా వేడుకుంటున్నాడు. ఆయన దేవుని సంకల్పం ప్రకారం పవిత్రుల పక్షంగా వేడుకుంటున్నాడు. ఎందుకంటే హృదయాలను పరిశీలించే వాడికి ఆత్మ ఆలోచన ఏమిటో తెలుసు. దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు. ఎందుకంటే తన కుమారుడు అనేక సోదరుల్లో జ్యేష్ఠుడుగా ఉండాలని, దేవుడు ముందుగా ఎరిగిన వారిని, తన కుమారుణ్ణి పోలిన రూపం పొందడానికి ముందుగా నిర్ణయించాడు. ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నిర్దోషులుగా ఎంచాడు. అంతే కాదు, ఎవరిని నిర్దోషులుగా ఎంచాడో వారిని మహిమ పరిచాడు.
రోమా 8:12-30 TERV (పవిత్ర బైబిల్)
అందువల్ల సోదరులారా! మనము మన ఐహిక వాంఛల ప్రకారం బ్రతకనవసరం లేదు. ఎందుకంటే, ఐహికవాంఛలతో జీవిస్తే మీరు మరణిస్తారు. కాని శరీరం చేస్తున్న చెడ్డ పనుల్ని ఆత్మద్వారా రూపు మాపితే మీరు జీవిస్తారు. దేవుని ఆత్మను అనుసరించినవాళ్ళు దేవుని కుమారులు. మీరు బానిసలయ్యే ఆత్మను పొందలేదు. మీరు దేవుని కుమారులుగా అయ్యే ఆత్మను పొందారు. ఇది మీలో భయం కలిగించదు. దానికి మారుగా మనము దేవుణ్ణి, “ అబ్బా ! తండ్రీ!” అని పిలుస్తున్నాము మనం దేవుని పుత్రులమని దేవుని ఆత్మ మన ఆత్మతో కలిసి సాక్ష్యం చెపుతున్నాడు. మనము దేవుని సంతానము కనుక మనము ఆయన వారసులము. క్రీస్తుతో సహవారసులము. మనము ఆయనలో కలిసి ఆయన తేజస్సును పంచుకోవాలనుకొంటే, ఆయనతో కలిసి ఆయన కష్టాలను కూడా పంచుకోవాలి. మనకు వ్యక్తం కానున్న తేజస్సు, మనం ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాలకన్నా ఎన్నో రెట్లు గొప్పదని నా అభిప్రాయం. దేవుడు తన కుమారుల్ని బయలు పర్చాలని సృష్టి అంతా ఆతృతతో కాచుకొని ఉంది. సృష్టి నాశనంకు అప్పగింపబడింది. అయితే తన కోరిక ప్రకారం కాకుండా, దాన్ని లోబర్చిన వాని చిత్తప్రకారం నిరీక్షణలో అప్పగించబడింది. బానిసత్వంతో క్షీణించిపోతున్న ఈ సృష్టి ఒక రోజు విడుదలపొంది, దేవుని సంతానం అనుభవింపనున్న తేజోవంతమైన స్వేచ్ఛను అనుభవిస్తుందనే ఒక విశ్వాసం ఉంది. సృష్టి అంతా ప్రసవించునప్పుడు స్త్రీకి కలిగే బాధలాంటి నొప్పులతో మూలుగుతూ ఈనాటి వరకు బాధపడుతుందని మనకు తెలుసు. అంతేకాదు, దేవుని ఆత్మను మొదటి ఫలంగా పొందిన మనము కూడా మన మనస్సులో మూలుగుతున్నాము. మనం దత్త పుత్రులం కావాలనీ, మన శరీరాలకు విముక్తి కలగాలనీ ఆతృతతో కాచుకొని ఉన్నాము. మనం రక్షింపబడినప్పుడు ఈ నిరీక్షణ మనలో ఉంది. కాని విశ్వాసంతో ఎదురు చూస్తున్నది లభించిన తర్వాత దాని కోసం ఆశించవలసిన అవసరం ఉండదు. తన దగ్గరున్న దానికోసం ఎవరు ఎదురు చూస్తారు? కాని మన దగ్గర లేనిదాని కోసం ఆశిస్తే దానికోసం ఓర్పుతో నిరీక్షిస్తాము. అదే విధంగా మనం బలహీనులం కనుక, ఏ విధంగా ప్రార్థించాలో మనకు తెలియదు. కనుక, దేవుని ఆత్మ స్వయంగా మన పక్షాన మాటలు వ్యక్తపరచలేని మూలుగులతో దేవునికి తెలిపి మనకు సహాయపడుతున్నాడు. ఆయన దేవునితో తన ప్రజలకోసం ఆయన ఇచ్ఛానుసారం విన్నపం చేస్తున్నాడు. మన హృదయాలను పరిశోధించే దేవునికి ఆయన యొక్క ఆలోచనలు తెలుసు. దేవుడు తనను ప్రేమించే ప్రజల కోసం, తన ఉద్దేశానుసారం పిలువబడినవాళ్ళ కోసం ఆయన సమస్తము చేయుచున్నాడని మనకు తెలుసు. ఈ ప్రజల్ని దేవుడు తన ఉద్దేశానుసారంగా పిలిచాడు. దేవుడు తనకు ఇదివరకే తెలిసిన వాళ్ళను తన కుమారునిలా రూపొందించాలని ప్రత్యేకంగా ఉంచాడు. తనకు చాలామంది పుత్రులుండాలని, వాళ్ళలో యేసు మొట్ట మొదటి వానిగా ఉండాలని ఆయన ఉద్దేశ్యం. దేవుడు ఎవర్ని ప్రత్యేకంగా ఉంచాడో వాళ్ళను పిలిచాడు. ఎవర్ని పిలిచాడో వాళ్ళను నీతిమంతులుగా చేసాడు. ఎవర్ని నీతిమంతులుగా చేసాడో వాళ్ళతో తన మహిమను పంచుకొన్నాడు.
రోమా 8:12-30 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మ చేత శారీర క్రియ లను చంపినయెడల జీవించెదరు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులైయుందురు. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొంది తిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము–అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతోకూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసు లము; క్రీస్తుతోకూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము. మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి, నాశనమునకులోనయిన దాస్యములోనుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్యము పొందుదునను నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచ బడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదనపడుచునున్నదని యెరుగుదుము. అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడ దత్త పుత్రత్వముకొరకు, అనగా మన దేహముయొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడనిదాని కొరకు నిరీక్షించినయెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము. అటువలె ఆత్మ యు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనముచేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్ధులకొరకు విజ్ఞాపనముచేయుచున్నాడు. దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.