రోమా 7:4-12 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 7:4-12 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కావున నా సహోదరులారా, మనము దేవునికొరకు ఫలమును ఫలించునట్లు మృతులలోనుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరముద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. ఏలయనగా మనము శరీరసంబంధులమై యుండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై, ధర్మశాస్త్రమువలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై యుండెను. ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడితిమో దానివిషయమై చనిపోయినవారమై, ధర్మశాస్త్రమునుండి విడుదల పొంది తిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీనస్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీనస్థితి గలవారమై సేవచేయుచున్నాము. కాబట్టి యేమందుము? ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదు. ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పనియెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసికొని సకలవిధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రములేకుండ జీవించుచుంటిని గాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను; నేనైతే చనిపోతిని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువుచేసికొని నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడ పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై యున్నది.
రోమా 7:4-12 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కాబట్టి నా సోదరులారా, మనం దేవుని కోసం ఫలించ గలిగేలా చనిపోయి తిరిగి లేచిన క్రీస్తును చేరుకోడానికి మీరు కూడా ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయంలో చనిపోయారు. ఎందుకంటే మనం శరీర సంబంధులుగా ఉన్నప్పుడు చావు ఫలాన్ని ఫలించడానికి ధర్మశాస్త్రం ద్వారా కలిగే పాపపు కోరికలు మన అవయవాల్లో పని చేస్తూ ఉండేవి. ఇప్పుడైతే ఏది మనలను బంధించి ఉంచిందో దాని విషయంలో చనిపోయి, ధర్మశాస్త్రం నుండి స్వేచ్ఛ పొందాము. కాబట్టి మనం దాని అక్షరార్ధమైన పాత విధానంలో కాక దేవుని ఆత్మానుసారమైన కొత్త విధానంలో సేవ చేస్తున్నాము. కాబట్టి ఏం చెప్పాలి? ధర్మశాస్త్రం పాపమా? కానే కాదు. ధర్మశాస్త్రం వలన కాకపోతే నాకు పాపమంటే ఏమిటో తెలిసేది కాదు. ఇతరులకు చెందిన దాన్ని ఆశించవద్దని ధర్మశాస్త్రం చెప్పకపోతే దురాశ అంటే ఏమిటో నాకు తెలిసేది కాదు. అయితే పాపం ఆజ్ఞను ఆధారంగా చేసుకుని అన్ని రకాల దురాశలను నాలో పుట్టించింది. ధర్మశాస్త్రం లేకపోతే పాపం చనిపోయినట్టే. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేనప్పుడు జీవంతోనే ఉన్నాను గాని, ఆజ్ఞ రావడంతోనే పాపానికి మళ్ళీ జీవం వచ్చి నేను చనిపోయాను. అప్పుడు జీవాన్ని తెచ్చే ఆజ్ఞ నాకు చావును కలిగించేదిగా కనబడింది. ఎందుకంటే పాపం ఆజ్ఞను ఆధారంగా చేసుకుని మోసం చేసి నన్ను చంపింది. కాబట్టి ధర్మశాస్త్రం పవిత్రం. ఆజ్ఞ కూడా పవిత్రం, నీతివంతం, ఉత్తమం.
రోమా 7:4-12 TERV (పవిత్ర బైబిల్)
అదే విధంగా నా సోదరులారా! మీరు కూడా క్రీస్తు శరీరంతో పాటు చనిపోయి ధర్మశాస్త్ర బంధం నుండి విముక్తి పొందారు. మీరు బ్రతికింపబడ్డ క్రీస్తుకు చెందినవారై దేవుని కొరకు ఫలిస్తారు. ధర్మశాస్త్రం మూలంగా కలిగిన దురాశలు మన శరీరాల్లో పని చేయటంవల్ల మనం మరణాన్ని పొందాము. మనల్ని బంధించి ఉంచిన ధర్మశాస్త్రం విషయంలో మనం మరణించాము కనుక ఇప్పుడు మనము ఆ బంధం నుండి స్వేచ్ఛను పొందాము. అందువల్ల వ్రాత పూర్వకంగా ఉన్న ధర్మశాస్త్రానికి మనమిక బానిసలము కాము. దేవుని ఆత్మ చూపించిన క్రొత్త మార్గాన్ని అనుసరించి మనము ఆయన సేవ చేస్తున్నాము. అంటే, ధర్మశాస్త్రం పాపంతో కూడుకున్నదని అర్థమా? కాదు. ధర్మశాస్త్రం లేకపోయినట్లయితే పాపమంటే నాకు తెలిసేది కాదు. “ఇతర్లకు చెందిన వాటిని ఆశించవద్దని” ధర్మశాస్త్రం చెప్పి ఉండకపోతే, ఆశించటమంటే ఏమో నాకు తెలిసేది కాదు. ధర్మశాస్త్రం చెప్పిన ఆజ్ఞను ఉపయోగించి పాపం నాలో అన్ని రకాల దురాశల్ని కలిగించింది. ధర్మశాస్త్రం లేకపోయినట్లైతే పాపంలో ప్రాణముండేది కాదు. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించాను. కాని ఆజ్ఞ రాగానే పాపం మొలకెత్తింది. దానితో నేను మరణించాను. జీవాన్నివ్వటానికి ఉద్దేశింపబడిన ఆ ఆజ్ఞ నాకు మరణాన్ని కలుగ చెయ్యటం గమనించాను. ఆజ్ఞ కలుగ చేసిన అవకాశాన్ని ఉపయోగించుకొని, పాపం నన్ను మోసంచేసి ఆ ఆజ్ఞద్వారా నన్ను చంపివేసింది. సరే! మరి, ధర్మశాస్త్రం పవిత్రమైంది. ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఆజ్ఞ పవిత్రమైంది. దానిలో నీతి, మంచితనము ఉన్నాయి.
రోమా 7:4-12 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని కోసం ఫలించేలా, మరణించి సజీవంగా తిరిగి లేచిన క్రీస్తును చేరుకునేలా మీరు కూడా క్రీస్తు శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మరణించారు. మనం శరీర సంబంధులుగా మనం ఉన్నప్పుడు ధర్మశాస్త్రం వలన కలిగే పాప ఆలోచనలు మనలో పని చేస్తున్నాయి కాబట్టి మనం మరణాన్ని ఫలంగా పొందుకుంటున్నాము. కాని ఇప్పుడు, మనల్ని బంధించి ఉంచిన దాని విషయమై చనిపోయి, ధర్మశాస్త్రం నుండి విడుదలను పొందాము కాబట్టి, వ్రాయబడి ఉన్న నియమం ప్రకారం కాకుండా ఆత్మానుసారమైన నూతన మార్గంలో మనం సేవిస్తాము. అయితే మనం ఏమనాలి? ధర్మశాస్త్రాన్ని పాపమనా? కానే కాదు! ఒకవేళ ధర్మశాస్త్రం లేకపోతే పాపం అంటే ఏమిటో నాకు తెలిసేది కాదు. “మీరు ఆశించకూడదు” అని ధర్మశాస్త్రం చెప్పకపోతే ఆశించడం అంటే ఏమిటో నిజంగా నాకు తెలిసేది కాదు. అయితే పాపం ఆజ్ఞను ఆధారం చేసుకుని నాలో అన్ని రకాల దురాశలను పుట్టించింది. ధర్మశాస్త్రం లేకపోతే పాపం మరణిస్తుంది. ఒకప్పుడు ధర్మశాస్త్రం లేకపోయిన నేను సజీవంగానే ఉన్నాను, అయితే ఆజ్ఞలు ఇవ్వబడినప్పుడు పాపం జీవంలోనికి వచ్చింది, నేను మరణించాను. జీవాన్ని ఇవ్వడానికి ఉద్దేశించబడిన ఆ ఆజ్ఞలే మరణాన్ని తీసుకువచ్చాయని నేను తెలుసుకున్నాను. అయితే పాపం ఆజ్ఞను ఆధారం చేసుకుని నన్ను మోసగించి ఆ ఆజ్ఞల ద్వారానే నన్ను మరణానికి గురిచేసింది. కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది. ఆజ్ఞలు పరిశుద్ధమైనవి, నీతి కలిగినవి, మంచివి.