రోమా 6:4-11 - Compare All Versions

రోమా 6:4-11 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

తండ్రియైన దేవుని మహిమ ద్వారా మరణం నుండి తిరిగి సజీవంగా లేచిన క్రీస్తువలె మనం కూడా నూతన జీవాన్ని జీవించడానికి ఆయన మరణంలో బాప్తిస్మం పొందిన మనం ఆయనతో పాటు పాతిపెట్టబడ్డాము. మనం కూడా ఆయన మరణం విషయంలో ఆయనతో ఐక్యమైతే, ఖచ్చితంగా మనం కూడా ఆయన పునరుత్థానం విషయంలో ఆయనతో ఐక్యమవుతాము. మనమింక పాపానికి బానిసలుగా ఉండకుండా పాపం చేత పాలించబడిన శరీరం నశించేలా, మన పాత స్వభావం ఆయనతో పాటు సిలువ వేయబడిందని మనకు తెలుసు. ఎందుకంటే, మరణించినవారు పాపం నుండి విడుదల పొందారు. కాబట్టి మనం క్రీస్తుతో పాటు మరణిస్తే, ఆయనతో పాటు మనం కూడా జీవిస్తామని నమ్ముతున్నాము. క్రీస్తు మరణం నుండి తిరిగి సజీవంగా లేచారు, ఆయన మరి ఎన్నడూ మరణించరు; ఇకపై మరణానికి ఆయన మీద అధికారం లేదు. ఆయన మనందరి పాపాల కోసం మరణించారు గాని ఆయన జీవించిన జీవితం దేవుని కొరకే జీవించారు. అలాగే పాప విషయంలో చనిపోయాం కాని యేసు క్రీస్తులో దేవుని కోసం సజీవంగానే ఉన్నామని మిమ్మల్ని మీరు ఎంచుకోండి.

షేర్ చేయి
రోమా 6 TSA

రోమా 6:4-11 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

తండ్రి మహిమ వలన క్రీస్తు చనిపోయిన వారిలోనుండి ఏ విధంగా లేచాడో, అదే విధంగా మనం కూడా నూతన జీవం పొంది నడుచుకొనేలా, మనం బాప్తిసం ద్వారా మరణించి, ఆయనతో కూడా సమాధి అయ్యాము. ఆయన చావు పోలికలో ఆయనతో ఐక్యం గలవారమైతే, ఆయన పునరుత్థానంలో కూడా ఆయనతో ఐక్యం కలిగి ఉంటాం. ఎందుకంటే, మనకు తెలుసు, మనం ఇకమీదట పాపానికి దాసులుగా ఉండకుండాా పాపశరీరం నాశనం అయ్యేలా, మన పాత స్వభావం క్రీస్తుతో కలిసి సిలువ మరణం పాలైంది. చనిపోయిన వ్యక్తి పాపం విషయంలో నీతిమంతుడని తీర్పు పొందాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోతే, ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముతున్నాము. చనిపోయిన వారిలో నుండి లేచిన క్రీస్తు ఇంక చనిపోడనీ, చావుకి ఆయన మీద అధికారం లేదనీ మనకు తెలుసు. ఎందుకంటే ఆయన చనిపోవడం పాపం విషయంలో ఒక్కసారే చనిపోయాడు గాని, ఆయన జీవించడం మాత్రం దేవుని విషయమై జీవిస్తున్నాడు. ఇదే మీకూ వర్తిస్తుంది. మీరు పాపం విషయంలో చనిపోయిన వారిగా, దేవుని విషయంలో క్రీస్తు యేసులో మిమ్మల్ని సజీవులుగా ఎంచుకోండి.

షేర్ చేయి
రోమా 6 IRVTEL

రోమా 6:4-11 TERV (పవిత్ర బైబిల్)

ఈ బాప్తిస్మము ద్వారా మరణించి మనం ఆయనతో సహా సమాధి పొందాము. తండ్రి తేజస్సు ద్వారా క్రీస్తు బ్రతికింపబడినట్లుగానే మనం కూడా నూతన జీవితాన్ని పొందటమే ఇందులోని ఉద్దేశ్యం. మనం ఆయన మరణంలో ఐక్యమైనట్లుగా ఆయన పునరుత్ధానములో కూడా మనం ఐక్యం కాగలం. మన పాపజీవితం క్రీస్తుతో కూడ సిలువ వేయబడినందున, ఈ పాప శరీరం బలహీనమై, మనమిక పాపానికి దాసులుగానుండమని మనకు తెలుసు. ఎందుకంటే మరణించిన ప్రతి వ్యక్తి పాపంనుండి విముక్తి పొందుతాడు. మనం క్రీస్తుతో కలిసి మరణిస్తే ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముచున్నాము. దేవుడు క్రీస్తును బ్రతికించాడని, ఆయనకు మళ్ళీ మరణం ప్రాప్తించదని మనకు తెలుసు. మరణానికి ఆయనపై అధికారం ఉండదు. పాపం విషయమై ఆయన ఒకే ఒకసారి మరణించాడు. కాని ఆయన జీవిస్తున్న జీవితం దేవుని కోసం జీవిస్తున్నాడు. అదే విధంగా, మీరు పాపం విషయంలో మరణించినట్లు దేవునికోసం యేసుక్రీస్తులో జీవిస్తున్నట్లు భావించండి.

షేర్ చేయి
రోమా 6 TERV

రోమా 6:4-11 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలుపొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణముయొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైనయెడల, ఆయన పునరుత్థానముయొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగలవారమై యుందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము ఆయనతోకూడ సిలువవేయబడెనని యెరుగుదుము. చనిపోయినవాడు పాపవిముక్తు డని తీర్పుపొందియున్నాడు. మనము క్రీస్తుతోకూడ చనిపోయినయెడల, మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయనమీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయనతోకూడ జీవించుదు మని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై, ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా, దేవుని విషయమై జీవించుచున్నాడు అటువలె మీరును పాపము విష యమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తుయేసునందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి.

షేర్ చేయి
రోమా 6 TELUBSI