రోమా 5:6-11
రోమా 5:6-11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మనం ఇంకను బలహీనులమై ఉన్నప్పుడే, సరియైన సమయంలో క్రీస్తు భక్తిహీనుల కోసం మరణించారు. ఒక మంచివాని కోసం ఎవరో ఒకరు చనిపోవడానికి సాహసం చేయవచ్చు, కాని ఒక నీతిమంతుని కోసం ఎవరైనా చనిపోవడం చాలా అరుదు. కాని మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం మరణించుట ద్వారా దేవునికి మన పట్ల ఉన్న తన ప్రేమను చూపించారు. ఇప్పుడైతే ఆయన రక్తం చేత నీతిమంతులంగా తీర్చబడిన మనం మరింత ఖచ్చితంగా ఆయన ద్వారా దేవుని ఉగ్రత నుండి రక్షించబడతాం! ఎందుకంటే, మనం దేవునికి శత్రువులమై ఉండగానే ఆయన కుమారుని మరణం ద్వారా మనం ఆయనతో తిరిగి సమాధానపరచబడితే ఆయన జీవం ద్వారా మరి అధికంగా రక్షించబడతాము. అంతే కాకుండా మనల్ని సమాధానపరచిన మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు మనం దేవునిలో అతిశయిస్తున్నాము.
రోమా 5:6-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎందుకంటే మనం బలహీనులుగా ఉండగానే, సరైన సమయంలో క్రీస్తు భక్తిహీనుల కోసం చనిపోయాడు. నీతిపరుని కోసం సైతం ఎవరైనా చనిపోవడం అరుదు. మంచివాడి కోసం ఎవరైనా చనిపోడానికి ఒకవేళ తెగించవచ్చు. అయితే దేవుడు మన మీద తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎలాగంటే మనమింకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్పు పొంది, మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించుకుంటాం. ఎందుకంటే మనం శత్రువులుగా ఉండి, ఆయన కుమారుని మరణం ద్వారా దేవునితో సమాధానపడితే, ఆయన జీవం చేత ఇంకా నిశ్చయంగా రక్షణ పొందుతాము. అంతేకాదు, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు సమాధాన స్థితి పొందాము కాబట్టి ఆయన ద్వారా మనం దేవునిలో ఆనందిస్తున్నాం.
రోమా 5:6-11 పవిత్ర బైబిల్ (TERV)
నిజానికి మనలో శక్తి లేని సమయాన భక్తిహీనులమైన మన కోసం క్రీస్తు మరణించాడు. నీతిమంతుల కోసం మరణించటం చాలా అరుదు. మంచి స్నేహితుని కోసం ఒకడు ధైర్యం చేసి, మరణిస్తే మరణించవచ్చు. కాని మనమింకా పాపంలో ఉన్నప్పుడే క్రీస్తు మనకోసం మరణించాడు. ఈ విధంగా దేవుడు తన ప్రేమను మనకోసం వ్యక్తం చేసాడు. దేవుడు యేసు క్రీస్తు రక్తంద్వారా మనము నీతిమంతులమని తీర్పు చెప్పాడు. కనుక మనము దేవుని ఆగ్రహం నుండి తప్పకుండా రక్షింపబడుతాము. ఇది యేసు క్రీస్తు ద్వారా సంభవిస్తుంది. ఒకప్పుడు మనం దేవుని శత్రువులం. అయినా తన కుమారుని మరణంవల్ల మనకు ఆయనతో సమాధానం కలిగింది. కనుక క్రీస్తు జీవితం ద్వారా ఆయన మనల్ని తప్పకుండా రక్షిస్తాడు. పైగా మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవునితో స్నేహం కలిగినందుకు మనం ఇప్పుడు ఆనందిస్తున్నాము.
రోమా 5:6-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఏలయనగా మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను. నీతిమంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును. అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధానపరచబడినయెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడు దుము. అంతేకాదు; మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొంది యున్నాము.