రోమా 4:18-22
రోమా 4:18-22 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“నీ సంతానం అలా ఉంటుంది” అని అతనితో చెప్పినప్పుడు అబ్రాహాము నిరీక్షణలేని సమయంలో కూడా నిరీక్షణ కలిగి నమ్మాడు, అందుకే అతడు అనేక జనాలకు తండ్రి అయ్యాడు. తనకు వంద సంవత్సరాల వయస్సు కాబట్టి తన శరీరం మృతతుల్యంగా ఉందని శారా గర్భం కూడా మృతతుల్యంగా ఉందనే వాస్తవం తెలిసినప్పటికీ అతడు తన విశ్వాసంలో బలహీనపడనే లేదు. అతడు దేవుడు చేసిన వాగ్దానంపట్ల అపనమ్మకంతో ఎన్నడు సందేహించలేదు కాని, అతడు తన విశ్వాసంలో బలపడి దేవునికి మహిమ చెల్లించాడు. దేవుడు తాను వాగ్దానం చేసిన దానిని నెరవేర్చగల శక్తిగలవాడని అతడు గట్టిగా నమ్మాడు. అందుకే “అది అతనికి నీతిగా ఎంచబడింది.”
రోమా 4:18-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అలాగే, “నీ సంతానం ఇలా ఉంటుంది” అని రాసి ఉన్నట్టుగా తాను అనేక జనాలకు తండ్రి అయ్యేలా ఎలాటి ఆశాభావం లేనప్పడు సైతం అతడు ఆశాభావంతో నమ్మాడు. అతడు విశ్వాసంలో బలహీనుడు కాలేదు, సుమారు నూరు సంవత్సరాల వయస్సు గలవాడు కాబట్టి, తన శరీరాన్ని మృతతుల్యంగా, శారా గర్భం మృతతుల్యంగా భావించాడు. అవిశ్వాసంతో దేవుని వాగ్దానాన్ని గూర్చి సందేహించక విశ్వాసంలో బలపడి దేవుణ్ణి మహిమ పరచాడు. దేవుడు మాట ఇచ్చిన దాన్ని ఆయన నెరవేర్చడానికి సమర్థుడని గట్టిగా నమ్మాడు. అందుచేత దేవుడు దాన్ని అతనికి నీతిగా ఎంచాడు.
రోమా 4:18-22 పవిత్ర బైబిల్ (TERV)
నిరాశ సమయంలో అబ్రాహాము ఆశతో నమ్ముకొన్నాడు. అందుకే అతడు ఎన్నో జనములకు తండ్రి అయ్యాడు. “నీ సంతతివాళ్ళు చాలా మంది ఉంటారు” అని దేవుడు చెప్పిన ప్రకారమే జరిగింది. అప్పటికి అబ్రాహాముకు సుమారు నూరు సంవత్సరాల వయస్సు. అతని శరీరం బలహీనంగా ఉండింది. పైగా శారాకు గర్భం దాల్చే వయస్సు దాటిపోయి ఉంది. ఈ సంగతులు అబ్రాహాముకు తెలుసు. అయినా అతని విశ్వాసం సన్నగిల్లలేదు. దేవుడు చేసిన వాగ్దానంలో అతడు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. దానికి మారుగా అతడు దృఢ విశ్వాసంతో దేవుణ్ణి స్తుతించాడు. దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని నిలుపుకోగలడని, ఆ శక్తి ఆయనలో ఉందని అబ్రాహాముకు సంపూర్ణమైన విశ్వాసం ఉండినది. ఈ కారణంగానే, “దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు”
రోమా 4:18-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
–నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది. –నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడైయుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని, అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.