రోమా 4:1-12,16

రోమా 4:1-12 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అయితే శరీరరీతిగా మన పూర్వికుడైన అబ్రాహాము ఈ విషయంలో ఏమి తెలుసుకున్నాడని మనం అనవచ్చు? ఒకవేళ, నిజంగానే, అబ్రాహాము క్రియలమూలంగా నీతిమంతునిగా ఎంచబడి ఉంటే అతడు అతిశయించడానికి కారణం ఉండేది కాని దేవుని ఎదుట కాదు. లేఖనాలు ఏమి చెప్తున్నాయి? “అబ్రాహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది” అనే కదా! పని చేసేవారికి ఇచ్చే జీతం ఒక బాధ్యతే కాని ఉచితంగా ఇచ్చే బహుమానం కాదు. అయితే, ఒకరు పని చేయకుండా, భక్తిహీనున్ని కూడా నీతిమంతునిగా తీర్చగల దేవునిపై నమ్మకముంచితే వారి విశ్వాసం నీతిగా ఎంచబడుతుంది. క్రియలు లేకుండానే ఎవరిని దేవుడు నీతిమంతులుగా ఎంచుతారో వారు దీవించబడినవారని దావీదు కూడా చెప్తున్నాడు. “తమ అతిక్రమాలు క్షమించబడినవారు, తమ పాపాలు పరిహరించబడినవారు ధన్యులు. ప్రభువుచేత పాపం లేనివారిగా పరిగణించబడినవారు ధన్యులు.” ఈ ఆశీర్వాదం కేవలం సున్నతి పొందినవారికి మాత్రమేనా లేదా సున్నతి పొందని వారికి కూడా వర్తిస్తుందా? అబ్రాహాము విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడిందని మనం చెప్తున్నాం కదా. ఏ పరిస్థితుల్లో అది అతనికి నీతిగా యెంచబడింది? అతడు సున్నతి పొందిన తర్వాత లేదా సున్నతి పొందక ముందా? సున్నతి పొందక ముందే కదా! అతడు ఇంకా సున్నతి పొందక ముందే, తనకు ఉన్న విశ్వాసం ద్వారా నీతికి ముద్రగా సున్నతి అనే గుర్తును పొందాడు. కాబట్టి సున్నతి పొందకపోయిన విశ్వసించిన వారందరికి అది నీతిగా ఎంచబడేలా అబ్రాహాము వారందరికి తండ్రి అయ్యాడు. అంతేకాక సున్నతి పొందినవారిలో ఎవరైతే మన తండ్రియైన అబ్రాహాము సున్నతి పొందక ముందు నడిచిన విశ్వాసపు అడుగుజాడలను అనుసరించి జీవిస్తున్నారో వారికి కూడా అబ్రాహాము తండ్రి అయ్యాడు.

షేర్ చేయి
చదువండి రోమా 4

రోమా 4:1-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

కాబట్టి శరీరరీతిగా మన పూర్వికుడైన అబ్రాహాముకు ఏం దొరికింది? అబ్రాహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్పు పొంది ఉంటే అతడు గొప్పలు పోవడానికి కారణం ఉండేది గానీ అది దేవుని ఎదుట కాదు. లేఖనం చెబుతున్నదేమిటి? “అబ్రాహాము దేవునిలో నమ్మకముంచాడు. దాని ద్వారానే అతడు నీతిమంతుడని తీర్పు పొందాడు.” పని చేసే వ్యక్తికి ఇచ్చే జీతం అతనికి హక్కుగా రావలసిన సొమ్మే గాని దానం కాదు. కానీ క్రియలు చేయకుండా దానికి బదులు భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చే దేవునిలో కేవలం విశ్వాసం ఉంచే వ్యక్తి విశ్వాసాన్నే దేవుడు నీతిగా ఎంచుతాడు. అదే విధంగా క్రియలు లేకుండా దేవుడు నీతిమంతుడుగా ప్రకటించిన మనిషి ధన్యుడని దావీదు కూడా చెబుతున్నాడు. ఎలా అంటే, “తన అతిక్రమాలకు క్షమాపణ పొందినవాడు, తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. ప్రభువు ఎవరి అపరాధం లెక్కలోకి తీసుకోడో వాడు ధన్యుడు.” ఈ దీవెన సున్నతి ఆచరించే వారి గురించి చెప్పాడా, ఆచరించని వారి గురించి కూడా చెప్పాడా? అబ్రాహాము విశ్వాసం అతణ్ణి నీతిమంతుడుగా తీర్చింది అన్నాం కదా? అతడు ఏ స్థితిలో ఉన్నప్పుడు అది జరిగింది? సున్నతి చేయించుకున్న తరవాతా లేక సున్నతికి ముందా? ముందే కదా! సున్నతి లేకపోయినా నమ్మిన వారికందరికీ అతడు తండ్రి కావడం కోసం వారికి నీతి ఆపాదించడానికై సున్నతి లేనప్పుడే, తాను కలిగి ఉన్న విశ్వాసం వలన పొందిన నీతికి ముద్రగా సున్నతి అనే గుర్తును పొందాడు. అలాగే సున్నతి గలవారికి కూడా తండ్రి కావడానికి, అంటే కేవలం సున్నతి మాత్రమే పొందిన వారు కాక సున్నతి లేనప్పుడు మన తండ్రి అబ్రాహాము విశ్వాసపు అడుగుజాడల్లో నడచిన వారికి కూడా తండ్రి కావడానికి అతడు ఆ గుర్తు పొందాడు.

షేర్ చేయి
చదువండి రోమా 4

రోమా 4:1-12 పవిత్ర బైబిల్ (TERV)

అబ్రాహాము మన మూలపురుషుడు. అతడు ఈ విషయంలో ఏమి నేర్చుకొన్నాడు! అబ్రాహాము చేసిన కార్యాలవలన అతడు నీతిమంతునిగా పరిగణింపబడి ఉంటే అతడు గర్వించటానికి కారణం ఉండేది. కాని దేవుని యెదుట కాదు ఈ విషయాన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “అబ్రాహాము దేవుణ్ణి విశ్వసించాడు కనుక దేవుడు అతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు.” పనిచేసేవానికి కూలి దొరుకుతుంది. అది అతని హక్కు. ఆ వచ్చిన జీతం బహుమానం కాదు. దుర్మార్గుల్ని నీతిమంతులుగా చెయ్యగల దేవుడు, వాళ్ళు కార్యాలు చెయ్యకపోయినా వాళ్ళు తనను విశ్వసిస్తే, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళను నీతిమంతులుగా పరిగణిస్తాడు. క్రియలు చేయకున్నా దేవునిచే నీతిమంతునిగా పరిగణింపబడిన మానవుడు ధన్యుడు. ఈ విషయాన్ని గురించి దావీదు ఈ విధంగా అన్నాడు: “దేవుడు ఎవరి తప్పుల్ని, పాపాల్ని క్షమిస్తాడో వాళ్ళు ధన్యులు. ఎవరి పాపాల్ని ప్రభువు వాళ్ళ లెక్కలో వెయ్యడో వాళ్ళు ధన్యులు.” మరి, సున్నతి చేయించుకొన్నవాళ్ళు మాత్రమే ధన్యులా లేక సున్నతి చేయించుకోనివాళ్ళు కూడా ధన్యులా? అబ్రాహాములో విశ్వాసం ఉండటం వల్ల దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడని మనమంటూ వచ్చాము. దేవుడు అతణ్ణి నీతిమంతునిగా ఎప్పుడు అన్నాడు? సున్నతి చేయించుకొన్న పిదపనా లేక ముందా? సున్నతి చేయించుకున్న పిదప కాదు, ముందే. అబ్రాహాము సున్నతి చేయించుకోకముందు అతనిలో విశ్వాసముండటం వల్ల దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు. దీనికి చిహ్నంగా అబ్రాహాము సున్నతిని ఒక ముద్రగా పొందాడు. తద్వారా సున్నతి పొందకున్నా, విశ్వాసం ఉన్నవాళ్ళకు అతడు తండ్రి అయ్యాడు. వీళ్ళను నీతిమంతులుగా పరిగణించాలని దేవుని ఉద్దేశం. అబ్రాహాము సున్నతి చేయించుకొన్నవాళ్ళకు కూడా తండ్రి. అంటే అందరికి కాదు. మన తండ్రి అబ్రాహాము సున్నతి చేయించుకోకముందు నుండి అతనిలో ఉన్న విశ్వాసాన్ని తమలో చూపిన వాళ్ళకు మాత్రమే అతడు తండ్రి.

షేర్ చేయి
చదువండి రోమా 4

రోమా 4:1-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

కాబట్టి శరీరము విషయమై మన మూలపురుషుడగు అబ్రాహామునకేమి దొరికెనని అందుము. అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడినయెడల అతనికి అతిశయకారణము కలుగును గాని అది దేవుని యెదుట కలుగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రా హాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను పని చేయువానికి జీతము ఋణమేగాని దానమని యెంచ బడదు. పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వానియందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆప్రకారమే క్రియలులేకుండ దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మను ష్యుడు ధన్యుడని దావీదు కూడ చెప్పుచున్నాడు. ఏలాగనగా– తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతిగలవారినిగూర్చి చెప్పబడినదా సున్నతిలేనివారినిగూర్చి కూడ చెప్పబడినదా? అబ్రాహాముయొక్క విశ్వాస మతనికి నీతి అని యెంచబడెననుచున్నాము గదా? మంచిది; అది ఏ స్థితియందు ఎంచబడెను? సున్నతి కలిగి యుండినప్పుడా సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి యుండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేనివారైనను, నమ్మినవారికందరికి అతడు తండ్రి యగుటవలన వారికి నీతి ఆరోపించుటకై, అతడు సున్నతి పొందకమునుపు, తనకు కలిగిన విశ్వాసమువలననైన నీతికి ముద్రగా, సున్నతి అను గురుతు పొందెను. మరియు సున్నతి గలవారికిని తండ్రియగుటకు, అనగా సున్నతిమాత్రము పొందినవారుగాక, మన తండ్రియైన అబ్రాహాము సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసముయొక్క అడుగుజాడలనుబట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు, అతడు ఆ గురుతు పొందెను.

షేర్ చేయి
చదువండి రోమా 4