రోమా 2:1-16
రోమా 2:1-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఇతరులకు తీర్పు తీర్చే వారెవరైనా సరే తప్పించుకునే అవకాశం లేదు. మీరు ఏ విషయంలో ఇతరులకు తీర్పు తీరుస్తున్నారో ఆ విషయంలో మీకు మీరే తీర్పు తీర్చుకుంటున్నారు, ఎందుకంటే తీర్పు తీరుస్తున్న మీరు కూడా అవే పనులు చేస్తున్నారు. అలాంటి కార్యాలు చేసేవారి పట్ల సత్యాన్ని అనుసరించి దేవుని తీర్పు ఉంటుందని మనకు తెలుసు. కాబట్టి అలాంటివి చేసేవారికి తీర్పు తీరుస్తూ వాటినే చేస్తూ ఉన్న సాధారణ మనుష్యులైన మీరు దేవుని తీర్పును తప్పించుకోగలరని అనుకుంటున్నారా? దేవుని దయ మిమ్మల్ని పశ్చాత్తాపం వైపు నడిపిస్తుందని తెలియక ఆయన దయ, సహనం, ఓర్పు అనే ఐశ్వర్యాన్ని త్రోసివేస్తారా? అయితే మీ మొండితనం, పశ్చాత్తాపంలేని హృదయాన్నిబట్టి దేవుని న్యాయమైన తీర్పు తీర్చబడే దేవుని ఉగ్రత దినాన దేవుని ఉగ్రతను మీకు మీరే పోగు చేసుకుంటున్నారు. దేవుడు “వారందరికి వారు చేసిన కార్యాలను బట్టి ప్రతిఫలమిస్తారు.” పట్టువదలకుండా మంచిని చేస్తూ మహిమ, ఘనత, నిత్యత్వాన్ని వెదికేవారికి ఆయన నిత్యజీవాన్ని ఇస్తారు. కానీ స్వలాభాన్ని చూసుకుంటూ సత్యాన్ని తిరస్కరించి చెడ్డపనులను చేసేవారి మీదికి దేవుని కోపం, ఉగ్రత వస్తుంది. చెడు చేసే ప్రతీ వ్యక్తికి అనగా మొదట యూదులకు, తర్వాత యూదేతరులకు ఇబ్బంది, బాధ ఉంటుంది; అయితే మంచి పనులు చేసే వారందరికి అనగా మొదట యూదులకు తర్వాత యూదేతరులకు మహిమ, ఘనత, సమాధానాలు కలుగుతాయి. ఎందుకంటే దేవుడు పక్షపాతం చూపించరు. ధర్మశాస్త్రం లేకుండా పాపం చేసిన వారందరు ధర్మశాస్త్రం లేకుండానే నశిస్తారు. ధర్మశాస్త్రం క్రింద ఉండి పాపం చేసేవారు ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పుపొందుతారు. ఎందుకంటే, ధర్మశాస్త్రాన్ని వినేవారు దేవుని దృష్టిలో నీతిమంతులు కారు కాని దానికి లోబడేవారే నీతిమంతులుగా ప్రకటించబడతారు. ధర్మశాస్త్రం లేని యూదేతరులు స్వతహాగా ధర్మశాస్త్రానికి సంబంధించిన పనులు చేస్తే, వారు ధర్మశాస్త్రం లేనివారైనప్పటికీ, తమకు తామే ధర్మశాస్త్రంగా ఉన్నారు. ధర్మశాస్త్ర సారం తమ హృదయాల మీద రాసి ఉన్నట్లుగా వారు చూపిస్తారు. అలాంటివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిస్తుంది. వారి ఆలోచనలు కొన్ని సమయాల్లో వారిని నిందిస్తాయి మరికొన్ని సమయాల్లో వారిని కాపాడతాయి. నా సువార్తలో చెప్పిన ప్రకారం, దేవుడు యేసు క్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యాలను తీర్పు తీర్చే దినాన ఇలా జరుగుతుంది.
రోమా 2:1-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి ఇతరులకు తీర్పు తీర్చే నీవు ఎవరివైనా సరే, నిన్ను నీవు సమర్ధించుకోలేవు. దేని విషయంలో ఎదుటి వాడికి తీర్పు తీరుస్తున్నావో దాని విషయంలో నీవే దోషివని తీర్పు తీర్చుకుంటున్నావు. ఎందుకంటే నీవు ఏ పనుల విషయంలో తీర్పు తీరుస్తున్నావో వాటినే నీవు కూడా చేస్తున్నావు కదా? ఆ పనులు చేసే వారి మీద దేవుని తీర్పు న్యాయమైనదే అని మనకు తెలుసు. ఆ పనులు చేసే వారికి తీర్పు తీరుస్తూ వాటినే చేస్తున్న ఓ మనిషీ, దేవుని తీర్పు నీవెలా తప్పించుకుంటావు? దేవుని కటాక్షం నిన్ను పశ్చాత్తాప పడేందుకు ప్రేరేపిస్తున్నదని తెలియక ఆయన మంచితనం అనే ఐశ్వర్యాన్నీ సహనాన్నీ దీర్ఘశాంతాన్నీ తోసిపుచ్చుతావా? నీ మొండితనాన్ని, మారని నీ హృదయాన్ని బట్టి దేవుని న్యాయమైన తీర్పు జరిగే ఆ ఉగ్రత రోజు కోసం, దేవుని కోపాన్ని పోగు చేసుకుంటున్నావు. ఆయన ప్రతి మనిషికీ అతని పనుల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. మంచి పనులను ఓపికగా చేస్తూ, మహిమ, ఘనత, అక్షయతలను వెదికే వారికి నిత్యజీవమిస్తాడు. అయితే స్వార్ధపరులు, సత్యాన్ని విడిచిపెట్టి దుర్నీతిని జరిగించే వారి మీదికి దేవుని ఉగ్రత, మహా కోపం వస్తాయి. చెడ్డ పని చేసే ప్రతి మనిషి ఆత్మకు, ముందు యూదునికి, తరువాత యూదేతరునికి బాధ, వేదన కలుగుతాయి. అయితే మంచి పని చేసే ప్రతి వ్యక్తికి, ముందు యూదునికి, తరువాత యూదేతరునికి మహిమ, ఘనత, శాంతిసమాధానాలు కలుగుతాయి. ఎందుకంటే దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రం ఉండి పాపం చేసినవారు ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు పొందుతారు. ధర్మశాస్త్రం లేకుండా పాపం చేసిన వారు కూడా ధర్మశాస్త్రం లేకపోయినా నాశనం అవుతారు. ధర్మశాస్త్రం వినే వారిని కాదు, దాన్ని అనుసరించి ప్రవర్తించే వారినే దేవుడు నీతిమంతులుగా ఎంచుతాడు. ధర్మశాస్త్రం లేని యూదేతరులు స్వాభావికంగా ధర్మశాస్త్రం చెప్పినట్టు నడుచుకుంటే వారికి ధర్మశాస్త్రం లేకపోయినా, తమకు తామే ధర్మశాస్త్రంలాగా ఉంటారు. అలాటి వారి మనస్సాక్షి కూడా సాక్షమిస్తుంది. వారి ఆలోచనలు వారిపై తప్పు మోపడమో లేక తప్పులేదని చెప్పడమో చేస్తాయి. అలాటివారి హృదయాలపై ధర్మశాస్త్ర సారం రాసినట్టే ఉంటుంది రాసినట్టే ఉంటుంది. నా సువార్త ప్రకారం దేవుడు యేసు క్రీస్తు ద్వారా మానవుల రహస్యాలను విచారించే రోజున ఈ విధంగా జరుగుతుంది.
రోమా 2:1-16 పవిత్ర బైబిల్ (TERV)
ఇతర్లపై తీర్పు చెప్పే నీవు, ఏ సాకూ చెప్పలేని స్థితిలో ఉన్నావు. ఎందుకంటే ఏవిషయాల్లో నీవు ఇతర్లపై తీర్పు చెపుతున్నావో అవే పనులు నీవుకూడా చేస్తున్నావు. అందువల్ల నీకు నీవే శిక్ష విధించుకుంటున్నావు. దేవుడు అలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్నవాళ్ళకు సత్యం ఆధారం మీద న్యాయమైన శిక్ష విధిస్తాడని మనకు తెలుసు. మిత్రమా! ఏ కారణాలవల్ల నీవు వాళ్ళపై తీర్పు చెపుతున్నావో అవే పనులు నీవు కూడా చేస్తున్నావు. మరి అలాంటప్పుడు దేవుని శిక్షను తప్పించుకోగలనని ఎలా అనుకుంటున్నావు? లేక, నీవు దేవుని అనంతమైన దయను, క్షమను, సహనాన్ని ద్వేషిస్తున్నావా? నీవు మారుమనస్సు పొందాలని దేవుడు నీపై దయచూపాడు. ఈ విషయం నీకు తెలియదా? కాని, నీది కఠిన హృదయం. అది పశ్చాత్తాపం పొందదు. కనుక దేవుడు ఆగ్రహం చూపే రోజున నీకు లభింపనున్న శిక్షను స్వయంగా ఎక్కువ చేసుకొంటున్నావు. ఆరోజు న్యాయమైన తీర్పు నీకు వ్యక్తమౌతుంది. ఆ రోజు దేవుడు ప్రతి ఒక్కనికి అతడు చేసిన పనిని బట్టి ప్రతిఫలం ఇస్తాడు. కొందరు ఎప్పుడూ మంచిపనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు తేజస్సును, గౌరవాన్ని, నశించని దేహాన్ని పొందాలని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకే దేవుడు అనంత జీవాన్నిస్తాడు. మరికొందరు సత్యాన్ని తృణీకరించి, చెడును అనుసరిస్తూ స్వార్థంతో జీవిస్తూ ఉంటారు. దేవుడు అలాంటివాళ్ళపై తన ఆగ్రహాన్ని తీవ్రంగా చూపుతాడు. చెడును చేసిన ప్రతి మనిషికి కష్టాలు, దుఃఖాలు సంభవిస్తాయి. అవి యూదులకు, తర్వాత ఇతరులకు కూడా సంభవిస్తాయి. మంచి చేసిన ప్రతి ఒక్కనికి తేజస్సు, గౌరవము, శాంతి లభిస్తాయి. అవి మొదట యూదులకు తర్వాత ఇతరులకు కూడా లభిస్తాయి. దేవుడు పక్షపాతం చూపడు. ధర్మశాస్త్రము లేని పాపులు ధర్మశాస్త్రము లేకుండానే నశించిపోతారు. అలాగే ధర్మశాస్త్రం ఉండి కూడా పాపం చేసినవాళ్ళపై దేవుడు ధర్మ శాస్త్రానుసారం తీర్పు చెపుతాడు. ఎందుకంటే, ధర్మశాస్త్రాన్ని విన్నంత మాత్రాన దేవుని దృష్టిలో నీతిమంతులు కాలేరు. కాని ధర్మశాస్త్రంలో ఉన్న నియమాల్ని విధేయతతో ఆచరించేవాళ్ళను దేవుడు నీతిమంతులుగా పరిగణిస్తాడు. యూదులుకానివాళ్ళకు ధర్మశాస్త్రం లేదు. కాని వాళ్ళు సహజంగా ధర్మశాస్త్రం చెప్పినట్లు నడుచుకొంటే వాళ్ళకు ధర్మశాస్త్రం లేకపోయినా, వాళ్ళు నడుచుకునే పద్ధతే ఒక ధర్మశాస్త్రం అవుతుంది. వాళ్ళ ప్రవర్తన ధర్మశాస్త్ర నియమాలు వాళ్ళ హృదయాలపై వ్రాయబడినట్లు చూపిస్తుంది. ఇది నిజమని వాళ్ళ అంతరాత్మలు కూడా చెపుతున్నాయి. వాళ్ళు కొన్నిసార్లు సమర్థించుకొంటూ, మరి కొన్నిసార్లు నిందించుకొంటూ, తమలోతాము వాదించుకుంటూ ఉంటారు. ఆ రోజు దేవుడు మానవుల రహస్య ఆలోచనలపై యేసు క్రీస్తు ద్వారా తీర్పు చెపుతాడు. నేను ప్రజలకు అందించే సువార్త ఈ విషయాన్ని తెలియజేస్తుంది.
రోమా 2:1-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీ వెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు. దేనివిషయములో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు; ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువారిమీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని యెరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించు కొందువని అనుకొందువా? లేదా, దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రతదినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చు కొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్‌క్రియను ఓపికగాచేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును. అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారిమీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్క్యార్యముచేయు ప్రతిమనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, శ్రమయు వేదనయు కలుగును. సత్‌క్రియచేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతములేదు. ధర్మశాస్త్రములేక పాపము చేసినవారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు; ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవునిదృష్టికి నీతిమంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రములేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తుద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును.