రోమా 15:4-9
రోమా 15:4-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
గతంలో వ్రాయబడిన సంగతులన్ని, లేఖనాల్లో బోధించబడిన ఓర్పు ద్వారా అవి ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి మనం నిరీక్షణ కలిగి ఉండడం కోసం మనకు బోధించడానికి వ్రాయబడ్డాయి. మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియైన దేవున్ని మీరు ఒకే మనస్సుతో ఒకే స్వరంతో మహిమపరిచేలా, మనకు ఓర్పును ప్రోత్సాహాన్ని ఇస్తున్న దేవుడు క్రీస్తు యేసు కలిగి ఉన్న వైఖరి మనం ఒకరిపట్ల ఒకరం కలిగి ఉండేలా మనకు అనుగ్రహించును గాక. క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్టుగా దేవునికి మహిమ కలిగేలా మీరు కూడా ఒకరిని ఒకరు అంగీకరించండి. పితరులకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో దేవుడు సత్యవంతుడని నిరూపించడానికి, యూదేతరులు దేవుని కనికరాన్ని బట్టి ఆయనను మహిమపరచడానికి, క్రీస్తు యూదుల సేవకుడిగా మారారని నేను మీకు చెప్తున్నాను. దీని విషయమై లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉంది: “కాబట్టి నేను నిన్ను యూదేతరుల మధ్యలో ఘనపరుస్తాను. నీ నామాన్ని గురించి స్తుతులు పాడతాను.”
రోమా 15:4-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎందుకంటే, గతంలో రాసి ఉన్నవన్నీ మన ఉపదేశం కోసమే ఉన్నాయి. కారణం, ఓర్పు వలనా, దేవుని వాక్కులోని ఆదరణ వలనా, మనలో ఆశాభావం కలగడం కోసం. మీరు ఒకే మనసుతో ఏక స్వరంతో అందరూ కలిసి, మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి మహిమ పరచడానికి, ఓర్పుకు, ఆదరణకు కర్త అయిన దేవుడు క్రీస్తు యేసును అనుసరించి మీ మధ్య ఐకమత్యం కలుగజేయు గాక. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని ఎలాగైతే చేర్చుకున్నాడో అలాగే దేవునికి మహిమ కలిగేలా మీరు ఒకరిని ఒకడు చేర్చుకోండి. నేను చెప్పేదేమిటంటే పితరులకు చేసిన వాగ్దానాల విషయం దేవుడు సత్యవంతుడని నిరూపించడానికీ, యూదేతరులు దేవుని కనికరాన్ని బట్టి దేవుని మహిమపరచడానికీ క్రీస్తు సున్నతి గలవారికి సేవకుడయ్యాడు. దీని గురించి, “ఈ కారణం చేత యూదేతరుల్లో నేను నిన్ను స్తుతిస్తాను. నీ నామ సంకీర్తనం చేస్తాను” అని రాసి ఉంది.
రోమా 15:4-9 పవిత్ర బైబిల్ (TERV)
గతంలో వ్రాసిన లేఖనాలు మనకు బోధించటానికి వ్రాశారు. వాటి ద్వారా సహనము, ప్రోత్సాహము పొంది, రక్షణ లభిస్తుందన్న నమ్మకం మనలో కలగాలని దానిలోని ఉద్దేశ్యం. మనలో సహనము, ప్రోత్సాహము కలుగచేసే దేవుడు, యేసు క్రీస్తు ద్వారా మీ మధ్య ఐకమత్యము కలుగచేయునుగాక! అప్పుడు మనము ఒకే హృదయంతో, ఒకే నాలుకతో మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించగలుగుతాము. దేవునికి ఘనత కలగాలని క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్లే మీరు కూడా ఇతర్లను అంగీకరించండి. మూలపురుషులకు దేవుడు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టాలని, దేవుడు సత్యవంతుడని నిరూపించాలని, క్రీస్తు యూదుల సేవకుడు అయ్యాడు. యూదులు కానివాళ్ళు దేవుని అనుగ్రహం కోసం ఆయన్ని స్తుతించాలని క్రీస్తు ఉద్దేశ్యం. ఈ సందర్భాన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ఈ కారణంగానే యూదులు కాని వాళ్ళతో కలిసి నిన్ను స్తుతిస్తాను. నీ పేరిట భక్తి గీతాలు పాడతాను.”
రోమా 15:4-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి. మీరేకభావము గలవారై యేకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమ పరచు నిమిత్తము, క్రీస్తుయేసు చిత్తప్రకారము ఒకనితో నొకడు మనస్సు కలిసినవారై యుండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చు కొనుడి. నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని సాప్థిచుటకును, అన్యజనులు ఆయన కనికరమునుగూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయెను. అందు విషయమై– ఈ హేతువుచేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును; నీ నామసంకీర్తనము చేయుదును అని వ్రాయబడియున్నది.