రోమా 14:1-4
రోమా 14:1-4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వివాదాస్పదమైన అంశాలపై వాదన పెట్టుకోక విశ్వాసంలో బలహీనంగా ఉన్నవారిని చేర్చుకోండి. ఒకరేమో తన విశ్వాసాన్నిబట్టి అన్నీ తినవచ్చు అని నమ్ముతున్నారు, మరొకరు తన బలహీనమైన విశ్వాసాన్నిబట్టి కేవలం కూరగాయలే తింటున్నారు. అన్నిటిని తినేవారు అలా తినని వారిని చులకనగా చూడకూడదు, అలాగే అన్నిటిని తిననివారు తినేవారి మీద నింద వేయకూడదు. ఎందుకంటే దేవుడు వారిని అంగీకరించారు. వేరేవాళ్ళ సేవకునికి తీర్పు తీర్చడానికి నీవెవరవు? అతడు నిలబడినా పడిపోయినా అది అతని యజమాని చూసుకుంటాడు. ప్రభువు వారిని నిలబెట్టడానికి శక్తిగలవాడు కాబట్టి వారు నిలబడతారు.
రోమా 14:1-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
విశ్వాసం విషయంలో బలహీనంగా ఉన్న వారిని చేరదీయండి గానీ వారి అనుమానాలు తీర్చడానికి వాదాలు పెట్టుకోవద్దు. ఆహార పదార్ధాలు అన్నీ తినవచ్చని ఒకడు నమ్ముతుంటే, ఇంకొకడు నమ్మకం లేక కూరగాయలే తింటున్నాడు. తినేవాడు తినని వాణ్ణి తక్కువగా చూడకూడదు. తినని వాడు తినేవాడిపై నిందారోపణ చేయకూడదు. ఎందుకంటే దేవుడు అతణ్ణి అంగీకరించాడు. వేరొకరి సేవకుని విషయంలో న్యాయం చెప్పడానికి నువ్వెవరివి? అతడు నిలబడినా, పడిపోయినా అది అతని యజమాని బాధ్యత. కాని అతడు నిలబడతాడు. ప్రభువు అతణ్ణి నిలబెట్టడానికి శక్తి గలవాడు.
రోమా 14:1-4 పవిత్ర బైబిల్ (TERV)
సంపూర్ణమైన విశ్వాసం లేనివాణ్ణి నిరాకరించకండి. వాదగ్రస్థమైన సంగతుల్ని విమర్శించకండి. ఒకడు అన్నీ తినవచ్చని విశ్వసిస్తాడు. కాని సంపూర్ణ విశ్వాసం లేని ఇంకొకడు కూరగాయలు మాత్రమే తింటాడు. అన్నీ తినే వ్యక్తి అలా చెయ్యని వ్యక్తిని చిన్న చూపు చూడకూడదు. అదే విధంగా అన్నీ తినని వాడు, తినేవాణ్ణి విమర్శించకూడదు. అతణ్ణి కూడా దేవుడు అంగీకరించాడు కదా. ఇతర్ల సేవకునిపై తీర్పు చెప్పటానికి నీవెవరవు? అతడు నిలిచినా పడిపోయినా అది అతని యజమానికి సంబంధించిన విషయం. ప్రభువు అతణ్ణి నిలబెట్ట గలడు కనుక అతడు నిలబడ గలుగుతున్నాడు.
రోమా 14:1-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
విశ్వాసము విషయమై బలహీనుడైనవానిని చేర్చు కొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ము చున్నాడు, మరియొకడు బలహీనుడై యుండి, కూర గాయలనే తినుచున్నాడు. తినువాడు తిననివాని తృణీ కరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు; ఏలయనగా దేవుడతనిని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుటయైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు.