రోమా 13:7-10
రోమా 13:7-10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీరు ఎవరికి ఏమి రుణపడి ఉంటే వారికి అది చెల్లించండి: మీరు పన్నులు చెల్లించాల్సి ఉంటే పన్నులు చెల్లించండి; ఆదాయపన్నైతే ఆదాయపన్ను చెల్లించండి; మర్యాదైతే మర్యాద; గౌరవమైతే గౌరవం ఇవ్వండి. ఇతరులను ప్రేమించేవారు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తారు కాబట్టి ఒకరిని ఒకరు ప్రేమించే విషయంలో తప్ప మరి దేనిలో ఎవరికి రుణపడి ఉండవద్దు. “మీరు వ్యభిచారం చేయకూడదు, మీరు హత్య చేయకూడదు, మీరు దొంగతనం చేయకూడదు, ఇతరులదేదీ మీరు ఆశించకూడదు” అనే ఆజ్ఞలు ఇతర ఆజ్ఞలు ఉన్నప్పటికీ అవన్నీ, “మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి” అనే ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉన్నాయి. ప్రేమ పొరుగువారికి హాని కలిగించదు. కాబట్టి ప్రేమ చూపించడం అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే.
రోమా 13:7-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎవరికేది రుణ పడి ఉంటే అది వాళ్ళకివ్వండి. పన్నులు రుణపడి ఉంటే పన్నులు, సుంకాలు రుణ పడి ఉంటే సుంకాలు చెల్లించండి. మర్యాద ఇవ్వవలసి ఉంటే మర్యాదను, గౌరవం ఇవ్వవలసి ఉంటే గౌరవాన్ని ఇవ్వండి. ప్రేమ విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికీ రుణ పడి ఉండవద్దు. పొరుగువాణ్ణి ప్రేమించేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు. ఎందుకంటే వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, వేరొకరిది ఆశించవద్దు అనేవీ, మరింకే ఆజ్ఞ అయినా ఉంటే అదీ, “నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణి ప్రేమించు” అనే వాక్యంలో ఇమిడి ఉన్నాయి. ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కాబట్టి ప్రేమ కలిగి ఉండడం అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే.
రోమా 13:7-10 పవిత్ర బైబిల్ (TERV)
ఎవరికేది ఋణపడి ఉంటే అది వాళ్ళకివ్వండి. పన్నులు ఋణపడి ఉంటే పన్నుల్ని, సుంకాలు ఋణపడి ఉంటే సుంకాల్ని, మర్యాదను ఋణపడి ఉంటే మర్యాదను, గౌరవాన్ని ఋణపడి ఉంటే గౌరవాన్ని ఇవ్వండి. తోటివాళ్ళను ప్రేమిస్తే ధర్మశాస్త్రాన్నంతా అనుసరించినట్లే కనుక ఇతర్లను ప్రేమించటం అనే ఋణంలో తప్ప మరే ఋణంలో పడకండి. “వ్యభిచారం చెయ్యరాదు; హత్య చెయ్యరాదు; దొంగతనం చెయ్యరాదు; ఇతర్లకు చెందిన వాటిని ఆశించరాదు” అనే మొదలగు ఆజ్ఞలన్నీ, “నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా నీ పొరుగువాణ్ణి ప్రేమించు” అనే ఆజ్ఞలో మిళితమై ఉన్నాయి. ప్రేమ పొరుగు వానికి హాని కలిగించదు. కాబట్టి ధర్మశాస్త్రం సాధించాలి అనుకొన్నదాన్ని ప్రేమ సాధిస్తుంది.
రోమా 13:7-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇందుకే గదా మీరు పన్ను కూడ చెల్లించుచున్నారు? కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనియెడల భయముండవలెనో వానియెడల భయమును, ఎవనియెడల సన్మాన ముండవలెనో వానియెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి. ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఏలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిల వద్దు, ఆశింపవద్దు అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్నయెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి. ప్రేమ పొరుగువానికి కీడుచేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.