రోమా 13:1-6
రోమా 13:1-6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దేవుడు ఇచ్చిన అధికారం తప్ప మరి ఏ అధికారం లేదు కాబట్టి ప్రతీ వ్యక్తి తన పైఅధికారులకు లోబడి ఉండాలి. ఇప్పుడు ఉన్న అధికారాలు దేవుడు నియమించినవే. కాబట్టి ఎవరైతే అధికారాన్ని ఎదిరిస్తున్నారో వారు దేవుడు నియమించిన దాన్ని ఎదిరిస్తున్నారు. అలా చేసేవారు తమ మీదకు తామే తీర్పు తెచ్చుకుంటారు. మంచి పనులు చేసేవారిని పరిపాలకులు భయపెట్టరు; అయితే తప్పు చేసే వారికే వారంటే భయం. అధికారంలో ఉన్నవారికి భయపడకుండా ఉండాలంటే మీరు మంచి పనులు చేయాలి. మీ మంచి కోసం అధికారంలో ఉన్నవారు దేవుని సేవకులు. మీరు తప్పు చేస్తే భయపడండి, ఎందుకంటే పరిపాలకులు కారణం లేకుండా ఖడ్గాన్ని పట్టుకోరు. వారు తప్పు చేసేవారిపై కోపాన్ని చూపించి శిక్ష విధించే దేవుని సేవకులు. కాబట్టి, శిక్ష విధించబడుతుందని కాక మనస్సాక్షిని బట్టి మనం అధికారులకు లోబడి ఉండాలి. అధికారులు దేవుని సేవకులు, వారు తమ సమయమంతా పాలనకే ఇస్తారు, అందుకే మనం వారికి పన్నులు చెల్లిస్తున్నాము.
రోమా 13:1-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ప్రతి ఒక్కడూ తన పై అధికారులకు లోబడాలి. ఎందుకంటే దేవుని వల్ల కలిగింది తప్ప అధికారం మరేదీ లేదు. ఇప్పుడు ఉన్న అధికారాలు దేవుడు నియమించినవే. కాబట్టి అధికారాన్ని ఎదిరించేవాడు దేవుని నియామకాన్ని ఎదిరిస్తున్నాడు. తద్వారా అతడు తన మీదికి తానే శిక్ష తెచ్చుకొంటాడు. పాలనాధికారులు చెడు పనులకే భయకారకులు గానీ మంచి పనులకు కాదు. వారికి భయపడకుండా ఉండాలంటే, మంచి పనులు చెయ్యి. అప్పుడు వారు నిన్ను మెచ్చుకుంటారు. వారు నీ మేలు కోసం ఉన్న దేవుని సేవకులు. అయితే నీవు చెడ్డ పని చేసినప్పుడు భయపడాలి. వారు కారణం లేకుండా కత్తిని ధరించరు. వారు చెడు జరిగించే వారి మీద కోపంతో ప్రతీకారం చేసే దేవుని సేవకులు. కాబట్టి కేవలం వారి కోపం గురించిన భయంతోనే కాక నీ మనస్సాక్షిని బట్టి కూడా అధికారులకు లోబడాలి. ఈ కారణం చేతనే మీరు పన్నులు కడుతున్నారు. ఎందుకంటే అధికారులు ఎప్పుడూ ఈ పనిలోనే దేవుని సేవకులుగా సేవ చేస్తుంటారు.
రోమా 13:1-6 పవిత్ర బైబిల్ (TERV)
ప్రభుత్వాన్ని దేవుడే నియమించాడు కనుక ప్రతి ఒక్కడూ ప్రభుత్వం చెప్పినట్లు చెయ్యాలి. ప్రస్తుతమున్న ప్రభుత్వాన్ని కూడా దేవుడే నియమించాడు. అందువల్ల ప్రభుత్వాన్ని ఎదిరించిన వాడు దేవుని ఆజ్ఞను ఎదిరించిన వానితో సమానము. వాళ్ళు శిక్షననుభవించవలసి వస్తుంది. సక్రమంగా నడుచుకొనేవాళ్ళు పాలకులకు భయపడరు. తప్పు చేసినవాళ్ళకే ఆ భయం ఉంటుంది. ప్రభుత్వానికి భయపడకుండా ఉండాలంటే, సక్రమంగా నడుచుకోండి. అప్పుడు ప్రభుత్వం మిమ్మల్ని మెచ్చుకుంటుంది. మీ మంచి కోసం ప్రభుత్వ అధికారులు దేవుని సేవకులుగా పని చేస్తున్నారు. కాని మీరు తప్పు చేస్తే భయపడవలసిందే! వాళ్ళు ఖడ్గాన్ని వృథాగా ధరించరు. దేవుని సేవకులుగా వాళ్ళు తప్పు చేసినవాళ్ళను శిక్షించటానికి ఉన్నారు. అందువల్ల శిక్షింపబడుతారనే కాకుండా మీ అంతరాత్మల కోసం కూడా అధికారులు చెప్పినట్లు చెయ్యటం అవసరం. అధికారులు దేవుని సేవకులు. వాళ్ళు తమ కాలాన్నంతా దీని కోసమే ఉపయోగిస్తున్నారు. అందువల్లే మీరు పన్నులు చెల్లిస్తున్నారు.
రోమా 13:1-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ప్రతివాడును పై అధికారులకు లోబడియుండ .వలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకేగాని మంచి కార్యములకు భయంకరులు కారు; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; వారికి భయపడక ఉండ కోరితివా, మేలుచేయుము, అప్పుడు వారిచేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసినయెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు; కీడుచేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారముచేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహభయమునుబట్టి మాత్రము కాక మనస్సాక్షినిబట్టియు లోబడియుండుట ఆవశ్యకము. ఏలయనగా వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు.